వైకాపా ఫ్యాన్‌కు సౌండ్‌ ఎక్కువ.. గాలి తక్కువ

ఓడిపోయినా దశాబ్దకాలంగా ఒంటరి పోరాటం చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను నోరు తెరిచి ఏమీ అడగలేదు.

Updated : 31 Mar 2024 09:39 IST

ఆ పార్టీ నాయకులు ఓట్లు అడగడానికొస్తే.. మా కోసం ఏం చేశారని నిలదీయండి 
కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి
వారాహి విజయభేరి సభలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

మీ ఆశీర్వాదం కావాలి..

డిపోయినా దశాబ్దకాలంగా ఒంటరి పోరాటం చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను నోరు తెరిచి ఏమీ అడగలేదు. ఈ రోజు అడుగుతున్నాను. నా పిఠాపురం వాసులను, ఉప్పాడ కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల ప్రజలను అడుగుతున్నాను. 54 గ్రామాల ప్రజల్ని పేరుపేరునా అడుగుతున్నాను. నేను మీ కోసం నిలబడతాను. మీ ఆశీర్వాదం కావాలి. నన్ను గెలిపించండి. నియోజకవర్గ ప్రజల్ని గుండెల్లో పెట్టుకోవడానికి ఇక్కడికొచ్చా.. ఆదర్శంగా తీర్చిదిద్ది పిఠాపురం ఖ్యాతిని దేశవ్యాప్తం చేస్తా.

 పవన్‌ కల్యాణ్‌


ఈనాడు, కాకినాడ: వైకాపా ఫ్యానుకు సౌండ్‌ ఎక్కువ... గాలి తక్కువ.. ఆ పార్టీని నమ్మొద్దని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పాతికేళ్ల భవిష్యత్తు కావాలా? రూ.5 వేల జీతం కావాలా? ప్రజలే నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. ఐదేళ్ల పాటు ఇబ్బంది పెట్టిన వైకాపా కావాలా.. మీ కోసం నిలబడే కూటమి కావాలా తేల్చుకోవాలని కోరారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో వారాహి విజయభేరి బహిరంగ సభలో శనివారం రాత్రి ఆయన ప్రసంగించారు. ‘నన్ను పదేళ్లుగా చూస్తున్నారు... ఓడిపోతే ఎవరైనా ఇంట్లో కూర్చుంటారు.. వేరెవరైనా పార్టీ మార్చేస్తారు.. జగన్‌ చెల్లెలు షర్మిల కూడా తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కానీ నేను మీరిచ్చిన మనోబలంతో ఈ దశాబ్ద కాలం గడిపాను. ఉప్పాడ తీరంలో సముద్రం కోతలా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ జనసేన నిలబడింది. మీ వెన్నంటి నడవడానికే నేను, పార్టీ నిలబడి ఉన్నాం’ అని పవన్‌కల్యాణ్‌ అన్నారు. 

‘నేను ఓ ఐదు వేల రూపాయల ఆదాయం వచ్చే మార్గం చెప్పాలని మా అన్నయ్యను అడిగాను. ఆయన తిట్టి నన్ను యాక్టింగ్‌ స్కూల్‌లో చేర్చారు. అదే నా స్కిల్‌ డెవలప్‌మెంట్‌. ఈరోజు మీ గుండెల్లో నన్ను నిలిపింది ఆ నైపుణ్యమే. అందుకే నేను పిఠాపురం నుంచి మాట ఇస్తున్నాను. యువతకు ఉపాధి కోసం పిఠాపురంలో 20 సెక్టార్లలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ తెచ్చే బాధ్యతను తీసుకుంటా. వర్మగారు వాళ్ల నాయకులతో ఒక్కటే చెప్పారట.. పవన్‌ కల్యాణ్‌ అన్ని కులాల మనిషి అని. నేనూ అలాగే పనిచేస్తా’ అని పవన్‌ స్పష్టంచేశారు.

భవిష్యత్తు మనదేనని తెలిసే ఈ కక్ష

‘జగన్‌ మాట్లాడితే పేదలకు పెత్తందార్లకు పోటీ అంటారు. వాళ్ల ఇంట్లో ఎవరికీ డబ్బులు లేవంట పాపం. ఈ ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అని ఆయన అంటున్నారు. జగన్‌ పేదనా? రూ.200 కోట్ల నుంచి రూ.400 కోట్ల ఆస్తి ఉన్న వాళ్ల ఎమ్మెల్యేలు పేదలా? వాళ్ల అభ్యర్థులు అంతంతమాత్రం అంటే ఎంతెంత మాత్రమో అర్థం కావడం లేదు. సాక్షి పేపర్‌, భారతి సిమెంట్‌, సజ్జల, 60 నియోజకవర్గాల్లో అడ్డగోలుగా దోచేసిన మిథున్‌రెడ్డి పేదవాళ్లా. రూ.20 వేల కోట్లు దోచేసిన జగన్‌ పేదా? 600 కోట్ల రూపాయలు సిద్ధం బోర్డులకే ఖర్చు పెట్టిన జగన్‌ను పేదవాడంటారా? కాకినాడలో మాఫియా డాన్‌ దగ్గర డబ్బులు లేవంట. నన్ను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుంచి మిథున్‌రెడ్డి వచ్చారు. మండలానికి ఒక నాయకుడిని పెట్టారు. పవన్‌ కల్యాణ్‌ దగ్గర శక్తి ఏముంది.. పట్టుమని పాతిక మంది ఎంపీలను నిలబెట్టలేని పరిస్థితి. కనీసం ఇద్దరు ఎంపీలను గెలిపించుకోవడానికి తపన పడుతున్నాను. నా మీద ఎందుకీ కక్ష.. భవిష్యత్తు మనదని తెలిసే ఇలా చేస్తున్నారు’ అని పవన్‌ చెప్పారు.

219 దేవాలయాల్ని అపవిత్రం చేశారు

‘వైకాపా పాలనలో అవినీతి లేదా? అవినీతి నిరోధకశాఖ టోల్‌ఫ్రీ నంబరు ఇస్తే నాలుగేళ్లలో 8 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. అందులో 2 లక్షల ఫిర్యాదులు వాళ్ల మంత్రి వర్గం, సిబ్బంది మీదే. మరో 4 లక్షలు వారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మీదనే వచ్చాయి. జగన్‌ పాలనలో 219 దేవాలయాలను అపవిత్రం చేశారు. వైకాపా నాయకులు, వంగా గీత వస్తే... ఇన్ని దేవాలయాలను ధ్వంసం, అపవిత్రం చేస్తే ఎంతమందిని పట్టుకున్నారని అడగండి. పిఠాపురంలో విగ్రహాలను అపవిత్రం చేస్తే ఆ దోషులను ఎందుకు పట్టుకోలేదని అడగండి.. కాకినాడలో ఇటీవల శివాలయం పూజారిని చొక్కా పట్టుకుని వైకాపా నాయకుడి అనుచరుడు భక్తులు చూస్తుండగానే కొట్టాడు. భీమవరంలో యజ్ఞోపవీతం తెంపేశారు. అంత అహంకారులు వీళ్లు’ అని ధ్వజమెత్తారు. ‘వైకాపా హయాంలో కాకినాడ పోర్టు డ్రగ్స్‌ అక్రమ బియ్యం, డీజిల్‌ మాఫియాకు హబ్‌గా మారింది. ఎన్నికల కోసం కాకినాడ పోర్టులోని కంటెయినర్లలో డబ్బు దాచారన్న ప్రచారం నడుస్తోంది’ అని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని