అవినాష్‌ చేతిలో జగన్‌ గుట్టు

‘మీ చిన్నాన్న వివేకా హత్యకేసులో నిందితుడైన అవినాష్‌రెడ్డికి ఎంపీ టికెట్‌ ఇస్తారా? పైగా ఆయనకు ఓట్లేయాలని ప్రజలను అడుగుతారా? ఇంతలా దిగజారడానికి సిగ్గులేదా? నిందితుడిని కాపాడుకోవడానికి బాధితులపై కేసులు పెట్టిస్తారా? మీ గుట్టు అవినాష్‌రెడ్డి చేతిలో ఉంది కాబట్టే ఇలా చేశారు.

Published : 31 Mar 2024 05:36 IST

అందుకే ఆయనంటే సీఎంకు భయం
రాష్ట్రాన్ని కాపాడటం ఎన్డీయేతోనే సాధ్యం
మా వెనుక నడిస్తే స్వర్ణయుగం... లేదంటే రాతియుగం
నాది ఎస్వీయూ... జగన్‌ది రహస్య విద్యాలయం
ప్రొద్దుటూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి ప్రజాగళం సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు-కడప, తిరుపతి, ఈనాడు డిజిటల్‌- తిరుపతి: ‘మీ చిన్నాన్న వివేకా హత్యకేసులో నిందితుడైన అవినాష్‌రెడ్డికి ఎంపీ టికెట్‌ ఇస్తారా? పైగా ఆయనకు ఓట్లేయాలని ప్రజలను అడుగుతారా? ఇంతలా దిగజారడానికి సిగ్గులేదా? నిందితుడిని కాపాడుకోవడానికి బాధితులపై కేసులు పెట్టిస్తారా? మీ గుట్టు అవినాష్‌రెడ్డి చేతిలో ఉంది కాబట్టే ఇలా చేశారు. ఏదైనా తేడా వస్తే వివేకా హత్యకేసు మీదాకా వస్తుందని భయమా?’ అని జగన్‌ను చంద్రబాబు ప్రశ్నించారు. వీటన్నింటికీ సమాధానం చెప్పాకే ఓట్లు అడగాలని సవాలు విసిరారు. వైయస్‌ఆర్‌ జిల్లా  ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా నాయుడుపేట, శ్రీకాళహస్తిలో శనివారం నిర్వహించిన ప్రజాగళం సభల్లో ఆయన మాట్లాడారు. సీఎం జగన్‌ అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్‌కు నీరు, ప్రాజెక్టుల విలువ తెలియదని మండిపడ్డారు. ఈ అయిదేళ్లలో రాయలసీమకు జగన్‌ ఏం చేశారో చెప్పాలని చంద్రబాబు డిమాండు చేశారు. తెదేపా హయాంలో రాయలసీమకు కియాను తీసుకొచ్చామని, కరవు సీమలో తయారైన 12 లక్షల కార్లు ప్రపంచంలోని పలు దేశాల్లో పరుగులు తీస్తున్నాయన్నారు. ‘మా హయాంలో పరిశ్రమలు వచ్చాయి. జగన్‌ వచ్చి అమరరాజ బ్యాటరీస్‌, జాకీలను తరిమేశారు’ అని చంద్రబాబు దుయ్యబట్టారు. ‘సీఎం ఎక్కడికి వెళ్లినా ఖాళీ బిందెలతో జనం నిరసనలు తెలుపుతున్నారు. కర్నూలులో వారానికోసారి నీరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లిళ్లు చేసుకోవడం మానేశారు’ అని చెప్పారు. ‘క్విట్‌ జగన్‌... సేవ్‌ రాయలసీమ’ నినాదంతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు.

దోపిడీ... బాదుడు ఉండవు

రాష్ట్రాన్ని కాపాడటం ఎన్డీయేతోనే సాధ్యమని చంద్రబాబు చెప్పారు. ‘మమ్మల్ని గెలిపిస్తే... రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. మీ బిడ్డలకు ఉపాధి దొరుకుతుంది. పంటలకు గిట్టుబాటు ధర, నీళ్లు వస్తాయి. విద్యుత్తు ఛార్జీలు, మద్యం ధరలను నియంత్రిస్తాం. సహజవనరుల దోపిడీ, ధరల బాదుడు ఉండవు’ అని చంద్రబాబు స్పష్టంచేశారు. ఫ్యాన్‌ను ముక్కలు చేసేందుకు యువత సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

నాలాగా ఎండలో నిల్చో చూద్దాం...

‘నా వయసు గురించి జగన్‌ మాట్లాడుతున్నారు. నాలాగా రెండు గంటలు ఎండలో నిల్చో జగన్‌... నీ కథ తేలిపోతుంది. నేను ఎస్వీ విశ్వవిద్యాలయంలో ఎంఏ అర్థశాస్త్రం చదివా. మీరు ఎక్కడ చదివారు? రహస్య విశ్వవిద్యాలయంలో చదివారా? జగన్‌... మీరు గోళీలు ఆడుకుంటున్న సమయంలో... మీ నాన్నకంటే ముందే నేను సీఎం అయ్యాను. ఒకసారి చరిత్ర చూడండి. తెదేపా హయాంలోనే అభివృద్ధి జరిగింది. 14 ఏళ్లు సీఎంగా ఉంటే ఎనిమిది సార్లు డీఎస్సీ కింద ఖాళీల్ని భర్తీ చేశాం. మీరు అయిదేళ్లలో ఎన్ని డీఎస్సీలు పెట్టారు’ అని ప్రశ్నించారు.

ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది

‘జగన్‌ అవినీతి పాలనలో అభివృద్ధి నిలిచిపోయింది. మిగతా రాష్ట్రాలు జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతుంటే ఏపీ వెనకబడింది. ఈ రాతియుగం నుంచి స్వర్ణయుగానికి తీసుకెళ్లేందుకు నేనే చోదకుడిని అవుతా. యువత భవిష్యత్తుకు నాదీ గ్యారంటీ. మహిళలకు ఆర్టీసీబస్సుల్లో ఉచిత ప్రయాణమే కాదు.. జీవన పయనంలోనూ తోడ్పాటు అందిస్తా’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘దళితులంటే జగన్‌కు చిన్నచూపు. అందుకే వారిలో కొందరికి టికెట్లివ్వలేదు. మరికొందరి స్థానాల్ని మార్చేశారు’ అని విమర్శించారు.


వాలంటీర్లకు న్యాయం చేస్తా..

‘వాలంటీర్లూ జగన్‌ ఉచ్చులో పడకండి. రాజీనామాలు చేసి వైకాపా కోసం పనిచేస్తే మళ్లీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. వారు వచ్చేదీ లేదు... ఇచ్చేదీ లేదు. మీరు తటస్థంగా ఉండాలి. మేం గెలిస్తే మీకు న్యాయం చేస్తా. చదువుకున్నవారికి నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష సంపాదించే మార్గం చూపిస్తా’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘వైకాపా పాలనలో స్కీం అంటే అందులో పెద్ద స్కాం ఉంటుంది. తిరుపతిలో టీడీఆర్‌ బాండ్ల పేరుతో దోచేశారు. విశాఖ, గుంటూరు, తణుకు, విజయవాడ, తిరుపతిల్లో రూ.25 వేల కోట్ల కుంభకోణం జరిగింది. తెదేపా రాగానే వాటిని రద్దుచేస్తాం. జగన్‌ అప్పుల అప్పారావులా మారి లక్షల కోట్లు రుణాలు తెచ్చారు. అందుకోసం తహసీల్దారు కార్యాలయాలు, కలెక్టరేట్‌లు, ఆసుపత్రులను తనఖా పెట్టారు. ఇక మిగిలింది ప్రజల ఇళ్లు, ఆస్తులే’ అని ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని