కాంగ్రెస్‌లో చేరిన కడియం, కావ్య

భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఆదివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. వారిద్దరికీ పార్టీ రాష్ట్ర ఇంఛార్జి దీపా దాస్‌మున్షీ కాంగ్రెస్‌ కండువాలు కప్పారు.

Published : 01 Apr 2024 03:18 IST

ఈనాడు, హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఆదివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. వారిద్దరికీ పార్టీ రాష్ట్ర ఇంఛార్జి దీపా దాస్‌మున్షీ కాంగ్రెస్‌ కండువాలు కప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి కృషి చేయాలని వారికి రేవంత్‌రెడ్డి సూచించారు. వరంగల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా కావ్య పోటీచేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై నేతలు చర్చించారు. మాజీ ఎమ్మెల్సీ బి. మోహన్‌రెడ్డి కూడా దీపా దాస్‌మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, జహీరాబాద్‌ ఎంపీ అభ్యర్థి సురేశ్‌ షెట్కార్‌, ఆ ప్రాంత ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నేతలంతా ఐక్యంగా పార్టీ విజయం కోసం పోరాడాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజాపాలన, వంద గ్యారంటీల అమలుకు చిత్తశుద్ధితో తీసుకున్న చర్యల గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని తెలిపారు. ఏప్రిల్‌ 6న తుక్కుగూడలో జనజాతర పేరుతో జరిగే కాంగ్రెస్‌ సభపై గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు.

మాయమాటల్ని ప్రజలు నమ్మరు: మహేశ్‌కుమార్‌గౌడ్‌

అధికారం పోయాక భారాస నేత కేసీఆర్‌కు రైతులు గుర్తొచ్చారని, ఆయన మాయ మాటల్ని తెలంగాణ ప్రజలెవరూ నమ్మబోరని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ, ‘‘రైతు బంధు, పంటల బీమా గురించి కేసీఆర్‌ అన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నారని తెలిపారు. ఆయన హయాంలో రైతుల ఆత్మహత్యలలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని, వరి వేస్తే ఉరి వేసినట్టే అని రైతులను భయపెట్టిన చరిత్ర ఆయనదని అన్నారు. కరవుకు కారణం కాంగ్రెస్‌ అని కేసీఆర్‌ మాట్లాడడం ఆయన దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని