రెండంచెల వ్యూహం.. గెలుపే ధ్యేయం

తెలంగాణలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ వలసలతో లోక్‌సభ ఎన్నికల్లో సమీకరణాలు మారనున్నాయి.

Published : 01 Apr 2024 03:19 IST

ముఖ్య నాయకులను చేర్చుకునేలా కాంగ్రెస్‌ వ్యూహం
ఎక్కువ లోక్‌సభ స్థానాల్లో విజయంపై దృష్టి
అధిక పురపాలికల స్వాధీనానికి యత్నం
వలసలతో మారుతున్న రాజకీయ సమీకరణాలు
ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ వలసలతో లోక్‌సభ ఎన్నికల్లో సమీకరణాలు మారనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎక్కువ పురపాలక సంఘాలను, నగర పాలికలను తమ అధీనంలోకి తెచ్చుకోవడంతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్లు, నియోజకవర్గాలపై ప్రభావం చూపగల నాయకులపై కాంగ్రెస్‌ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. తెలంగాణలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకొనేందుకు కాంగ్రెస్‌ రెండంచెల వ్యూహాన్ని అనుసరిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో మరింత మెజార్టీ సాధించడం, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడానికి వీలుగా బలమైన నాయకులను చేర్చుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 9 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో మెజార్టీ వచ్చింది. ఇందులో పెద్దపల్లి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, నల్గొండ, భువనగిరి, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, జహీరాబాద్‌ ఉన్నాయి. మిగిలిన ఎనిమిదింటిలో హైదరాబాద్‌ లోక్‌సభను మినహాయిస్తే ఆదిలాబాద్‌లో మూడో స్థానంలో ఉండగా, మిగిలిన ఆరింటిలో రెండో స్థానంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ వచ్చిన స్థానాల్లో వరంగల్‌ మినహా మిగిలిన అన్నిచోట్లా శాసనసభ ఎన్నికలకు ముందు చేరినవారికి, మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యం ఇచ్చింది. మెజార్టీ వచ్చిన స్థానాల్లో కూడా  ప్రత్యర్థులు బలంగా ఉన్నచోట గట్టి అభ్యర్థిని రంగంలోకి దించడం..,  ఇతరపార్టీల నుంచి వచ్చే ముఖ్యనాయకులను చేర్చుకొని ఆ ప్రాంతంలో పార్టీని మరింత పటిష్ఠంగా చేసేలా చర్యలు చేసుకుంటోంది.

నియోజకవర్గాల వారీగా నజర్‌

వరంగల్‌ లోక్‌సభ స్థానంపై పార్టీ ప్రత్యేకదృష్టి పెట్టింది. ఇందులో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరిని చేర్చుకుంది. ఆయన కుమార్తె కావ్యకు వరంగల్‌ లోక్‌సభ టికెట్‌ ఇవ్వనుంది. వరంగల్‌ పరిధిలోని వర్థన్నపేట, పరకాల మున్సిపల్‌ ఛైర్మన్లు కాంగ్రెస్‌ కండువా కప్పుకోగా.. డీసీసీబీ ఛైర్మన్‌ కూడా భారాస నుంచి కాంగ్రెస్‌లో చేరారు. వరంగల్‌ మేయర్‌ ఇప్పటికే ముఖ్యమంత్రిని కలిశారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నుంచి భారాస సిటింగ్‌ ఎంపీ పోటీలో ఉండటం, భాజపా నుంచి డీకే అరుణ బరిలోకి దిగడంతో నియోజకవర్గంపై ప్రభావం చూపగల నాయకులను చేర్చుకొంది. భాజపాకు చెందిన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, భారాసకు చెందిన మహబూబ్‌నగర్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ స్వర్ణ సుధాకర్‌రెడ్డితో పాటు స్థానికసంస్థలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు హస్తం గూటికి చేరారు. జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలో భారాస కంటే కేవలం 14 వేల ఓట్లే కాంగ్రెస్‌కు ఎక్కువగా వచ్చాయి. భారాస సిటింగ్‌ ఎంపీ బీబీపాటిల్‌ భాజపాలో చేరి ఆ పార్టీ అభ్యర్థి అయ్యారు. ఇక్కడ పార్టీ పటిష్ఠానికి కామారెడ్డి మున్సిపల్‌ ఛైర్మన్‌పై అవిశ్వాసం పెట్టి ఈ పురపాలికను కైవసం చేసుకొంది. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాలకు భారాస నుంచి వచ్చిన వారిని పోటీకి దింపింది.

ఆదిలాబాద్‌పై పట్టు బిగించే దిశగా..

గత డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ లోక్‌సభ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్లను పరిశీలిస్తే కాంగ్రెస్‌ మూడో స్థానానికి పరిమితమైంది. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి భాజపా అభ్యర్థి విజయం సాధించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో భారాసకు 4.64 లక్షలు, భాజపాకు 4.47 లక్షలు, కాంగ్రెస్‌కు 2.51 లక్షల ఓట్లు వచ్చాయి. 7 అసెంబ్లీ స్థానాలకు గాను.. నాలుగు భాజపా, రెండు భారాస, కాంగ్రెస్‌ ఒకటి గెలుచుకొన్నాయి. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆదిలాబాద్‌ను దక్కించుకోవడానికి కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక్కడి అభ్యర్థిగా ఆత్రం సుగుణను ఎంపిక చేసింది. ఈమె ఉపాధ్యాయురాలిగా ఉంటూ తెలంగాణ ఉద్యమంతో పాటు.. మానవ హక్కులు, ఉపాధ్యాయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ లోక్‌సభ పరిధిలో సిర్పూరు నుంచి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కొన్నాళ్ల కిందట కాంగ్రెస్‌లో చేరగా, తాజాగా ముథోల్‌ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి చేరారు. ఈ రెండుచోట్ల భాజపా గెలవగా, భారాస సమీప ప్రత్యర్థిగా ఉంది. కాంగ్రెస్‌కు సిర్పూరులో 8500, ముథోల్‌లో 15,500 ఓట్లు వచ్చాయి. ఇక్కడ పట్టున్న మాజీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరడం తమకు లాభిస్తుందని పార్టీ భావిస్తోంది. నిర్మల్‌లో కూడా ప్రభావం చూపగల భారాస నాయకులను తమవైపు తిప్పుకోవడం, భాజపాలో అభ్యర్థి ఎంపిక విషయంలో ఉన్న అసంతృప్తిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా పట్టు బిగించాలని ప్రయత్నిస్తోంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి

అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రభావం చూపని కాంగ్రెస్‌.. లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలనే పట్టుదలతో ఉంది. సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌.. ఇక్కడ మొదటి స్థానంలో ఉన్న భారాస కంటే బాగా వెనకబడి ఉంది. ఈ స్థానం నుంచి భాజపా సిటింగ్‌ ఎంపీ, రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మళ్లీ బరిలోకి దిగారు. ఇక్కడ భారాసకు 4.63 లక్షలు రాగా, కాంగ్రెస్‌కు 2.8 లక్షలు, భాజపాకు 2.16 లక్షలు, ఎంఐఎంకు 62 వేల ఓట్లు వచ్చాయి. సిటింగ్‌ ఎంపీ ఉన్న భాజపా మూడో స్థానంలో నిలిచినా, మొదటి, రెండో స్థానానికి 1.80లక్షల ఓట్ల తేడా ఉంది. దీంతో భారాస తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్‌ను లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దించింది. మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ముందే కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్‌ లోక్‌సభ టికెట్‌ కోసం ప్రయత్నించారు. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ కొన్నాళ్ల కిందటే చేరగా, తాజాగా మేయర్‌, పలువురు కార్పొరేటర్లు, ద్వితీయశ్రేణి నాయకులు చేరారు. ఇక్కడ ప్రధాన పోటీదారుగా మారడానికి కాంగ్రెస్‌ గట్టిగా ప్రయత్నిస్తోంది.

నిజామాబాద్‌లో పోటాపోటీ

నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో భారాస, కాంగ్రెస్‌, భాజపాలకు పోటాపోటీగా ఓట్లు వచ్చాయి. ఈ లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో మూడు భారాస, కాంగ్రెస్‌, భాజపా రెండేసి గెలుచుకొన్నాయి. భారాసకు 4.17 లక్షలు, కాంగ్రెస్‌కు 4.08 లక్షలు, భాజపాకు 3.65 లక్షల ఓట్లు వచ్చాయి. త్రిముఖ పోటీ ఉండే ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని బరిలోకి దించింది. ఈయన జగిత్యాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికల్లో జగిత్యాలలో ఆధిపత్యం సాధించడంతో పాటు తక్కువ ఓట్లు వచ్చిన నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి కొందరు ముఖ్యుల్ని చేర్చుకొనే పనిలో ఉంది. ఆర్మూర్‌ పురపాలికపై అవిశ్వాసం పెట్టి కైవసం చేసుకొంది.

కరీంనగర్‌ అభ్యర్థి ఎంపికపై మరింత కసరత్తు

కరీంనగర్‌ లోక్‌సభలో త్రిముఖ పోరు నెలకొంది. ఇక్కడి 7 అసెంబ్లీ సెగెంట్లలో నాలుగు కాంగ్రెస్‌, మూడు భారాస కైవసం చేసుకొన్నాయి. ఓట్లపరంగా చూసినపుడు భారాసకు 5.17 లక్షలు, కాంగ్రెస్‌కు 5.12 లక్షలు రాగా, భాజపాకు 2.5 లక్షలు వచ్చాయి. అయితే భాజపా నుంచి సిటింగ్‌ ఎంపీ బండి సంజయ్‌, భారాస తరఫున మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ పోటీ చేస్తుండటంతో అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చొప్పదండి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ కాంగ్రెస్‌లో చేరగా, తాజాగా జమ్మికుంట మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ చేరారు. మరికొందరి చేరికల కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.

సీనియర్‌ నేతలపై గాలం

కొన్ని ముఖ్య నియోజకవర్గాల్లో సీనియర్‌ నేతలపై కాంగ్రెస్‌ దృష్టి పెట్టింది. మెదక్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో వచ్చిన ఓట్లను పరిగణనలోకి తీసుకొంటే కాంగ్రెస్‌ రెండో స్థానంలో ఉంది. ఆ పార్టీ కంటే భారాసకు 2.4 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఇక్కడ నీలం మధును కాంగ్రెస్‌ బరిలోకి దించింది. ఇక్కడ ముఖ్యనాయకులు నర్సాపూర్‌ మాజీ ఎమ్మెల్యే, భారాస సీనియర్‌ నాయకుడు మదన్‌రెడ్డి, మరో నాయకుడు ఎలక్షన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌ను కలిసి.. పార్టీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు బాగా తక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో వీటిపై ఎక్కువగా కేంద్రీకరించే ఆలోచన చేస్తోంది. ఇక చేవెళ్ల లోక్‌సభ పరిధిలో భారాస కంటే కాంగ్రెస్‌కు అసెంబ్లీ ఎన్నికలలో లక్ష ఓట్లు తక్కువ వచ్చాయి. ఈక్రమంలో రంగారెడ్డి, వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్లు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో సహా అనేక మందిని చేర్చుకుంది. భారాస సిటింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి ఆయనకే సీటు ఇచ్చింది. వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ పట్నం సునీతారెడ్డిని మల్కాజిగిరి నుంచి బరిలోకి దింపింది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి పూర్తి స్థాయిలో మల్కాజిగిరిపై కేంద్రీకరించారు. ఈ రెండు లోక్‌సభల పరిధిలో పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ రెండు చోట్లా భాజపా తరఫున బలమైన అభ్యర్థులు బరిలో ఉండటంతో కాంగ్రెస్‌ సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని