ఇది వచ్చిన కరవు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరవు

రాష్ట్రంలో ప్రస్తుత కరవు పరిస్థితులు ప్రకృతి ప్రకోపం వల్ల వచ్చినవి కావని.. అసమర్థ పాలనతో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిందని మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు.

Published : 01 Apr 2024 03:19 IST

వంద రోజుల్లోనే 200 మంది రైతుల ఆత్మహత్య
ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి
అన్ని పంటలకు రూ.500 బోనస్‌ చెల్లించేదాకా ఉద్యమం
ఏప్రిల్‌ 2న కలెక్టర్లకు వినతిపత్రాలు
6న నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు
భారాస అధినేత కేసీఆర్‌
జనగామ, సూర్యాపేట జిల్లాల్లో పంటల పరిశీలన

ఈనాడు, నల్గొండ: రాష్ట్రంలో ప్రస్తుత కరవు పరిస్థితులు ప్రకృతి ప్రకోపం వల్ల వచ్చినవి కావని.. అసమర్థ పాలనతో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిందని మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు. కొత్త సర్కారు వచ్చిన వంద రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్యహత్య చేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా కరవు పరిస్థితులతో 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని.. ఎకరాకు రూ.25 వేల చొప్పున ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇటీవలి ఎన్నికల్లో హామీ ఇచ్చినవిధంగా ప్రస్తుత సీజన్‌ నుంచే ప్రతి పంటకూ రూ.500 చొప్పున బోనస్‌ చెల్లించాలన్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో భారాస కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆదివారం జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించిన అనంతరం సూర్యాపేటలో విలేకరుల సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు.‘‘తెలంగాణలో రైతులు మళ్లీ ఆత్మహత్య చేసుకునే దుస్థితి వస్తుందనుకోలేదు. గత ఏడెనిమిదేళ్లు వ్యవసాయ స్థిరీకరణ, రైతు కేంద్రంగా పాలన సాగించాం. వారికి అనేక పద్ధతుల ద్వారా సాగునీళ్లివ్వడం, సరైన సమయంలో పెట్టుబడి సాయం అందించడం, 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడంతో పాటు పంట ఉత్పత్తుల కొనుగోలుకు రాష్ట్రవ్యాప్తంగా 7,600 కేంద్రాలు ఏర్పాటు చేశాం. నీళ్లిస్తారని నమ్మి పంటలు వేశామని, ఇప్పుడు ప్రభుత్వం కాల్వలకు నీళ్లు వదలకపోవడంతోనే పంటలు ఎండిపోయాయని రైతులు నా పర్యటనలో చెప్పారు. దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉన్న రాష్ట్రంలో ఇంత స్వల్పకాలంలోనే ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాలి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మిషన్‌ భగీరథ నీళ్లు రావడం లేదు. మళ్లీ ట్యాంకర్లు సందడి చేస్తున్నాయి. బిందెలు పట్టుకొని ఆడబిడ్డలు బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది. అగ్రగామి రాష్ట్రానికి ఎందుకు చెదలు పట్టాయో ఆలోచించాలి.

మిషన్‌ భగీరథపై పట్టింపేదీ?

‘‘ఐదారేళ్లపాటు మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీళ్లు అందించాం. ఇప్పుడు మిషన్‌ భగీరథ నిర్వహణలో లోపాలు ఎందుకు వస్తున్నాయి? మోటార్లు నడవాలంటే 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తు ఉండాలి. రైతుల మోటార్లు ఎందుకు కాలిపోతున్నాయి? గత పదేళ్లుగా రాష్ట్రంలో మాయమైన జనరేటర్లు, ఇన్వర్టర్లు, క్రేన్లు, బోర్లు ఇప్పుడు ప్రత్యక్షమవుతున్నాయి. ఇంకా మూడున్నర నెలలు గడిస్తే గానీ ప్రాజెక్టులకు వరద ప్రారంభం కాదు. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఏంటి? హైదరాబాద్‌కు ఒక్క అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌పై ఆధారపడకుండా సాగర్‌ నుంచి డెడ్‌ స్టోరేజీలోనూ నీటిని తీసుకునేలా రూ.1,450 కోట్లతో సుంకిశాలను ప్రారంభించాం. 70-75 శాతం పనులు చేశాం. దాన్ని పూర్తి చేస్తే హైదరాబాద్‌కు తాగునీటి కొరత తీర్చవచ్చు. మా హయాంలో హైదరాబాద్‌ను పవర్‌ ఐలాండ్‌ సిటీగా మార్చాం. కొంతమంది ఐటీ పెట్టుబడుదారులు న్యూయార్క్‌, లండన్‌లలో కరెంటు పోతుంది కానీ, హైదరాబాద్‌లో పోదని చెప్పేవాళ్లు. జాతీయ గ్రిడ్‌కు రాష్ట్రాన్ని అనుసంధానించడం వల్ల దేశంలో ఎక్కడ కరెంటు ఉన్నా రాష్ట్రంలో అవసరం ఉన్న సమయంలో వాడుకునేవాళ్లం. రాష్ట్రం ఏర్పడే సమయంలో 7,600 మెగావాట్ల సామర్థ్యం ఉంటే.. 18 వేలకు పెంచాం. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అదనంగా 1,600 మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీతో పాటు 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్‌ కేంద్రం అందుబాటులో ఉంది. అసమర్థ విధానాల వల్లే ప్రస్తుతం విద్యుత్తు వ్యవస్థ ఇలా తయారైంది. దీనికి నూటికి నూరు శాతం కాంగ్రెస్‌ ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

రైతులపై ప్రభుత్వానికి ప్రేమ లేదు

కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు నేను మాట్లాడలేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అవుతోంది. ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 3.5 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. తుంగతుర్తిలో 25 వేలు, సూర్యాపేటలో 20 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రాళ్లవానతో పంటలు ఎండిపోతే ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి ఎవరూ రైతులను పరామర్శించరు. ఈ ప్రభుత్వానికి రైతులపై ప్రేమ లేదు. మా పాలనలో ఖమ్మంలో రాళ్లవానతో రైతులకు పంటనష్టం జరిగితే ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.500 కోట్ల వరకు ఇచ్చాం. అప్పుడు మేం ఇచ్చిన రూ.10 వేలు తక్కువంటూ కాంగ్రెస్‌ నానా యాగీ చేసింది. ఇప్పుడు రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున ఇవ్వాలి. రణరంగమైనా ప్రభుత్వం మెడలు వంచి పరిహారం ఇప్పిస్తాం. నాగార్జునసాగర్‌లో కనీస నీటిమట్టానికి ఎగువన 7 టీఎంసీలు, దిగువన 7 టీఎంసీలు.. మొత్తం 14 టీఎంసీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఎడమ కాల్వ పరిధిలో నీళ్లిచ్చే అవకాశం ఉన్నా కేఆర్‌ఎంబీ పేరు చెప్పి తాత్సారం చేస్తున్నారు. ముఖ్యమంత్రికి దిల్లీ యాత్రలు సరిపోతున్నాయి తప్పితే రైతుల బాధలు పట్టడం లేదు. ‘సాగర్‌’ను కేఆర్‌ఎంబీకి అప్పజెప్పి.. ప్రస్తుత ఎడమ కాల్వ ఆయకట్టు దుస్థితికి కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమైంది. గత పదేళ్లు పచ్చగా ఉన్న పల్లెసీమలో ప్రస్తుతం బోరుబండ్ల హోరు వినిపిస్తోంది. చిల్లర డ్రామాల కోసం కాళేశ్వరం నీళ్లను కిందకు వదిలారు. గతంలో ఎస్సారెస్పీలో నీళ్లు లేకపోతే సింగూరు నుంచి నిజాంసాగర్‌ ద్వారా ఆయకట్టుకు నీళ్లిచ్చాం. ఇప్పుడు నీళ్లిచ్చే వెసులుబాటు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. గతంలో సాగర్‌ కుడివైపు కుంగితే పునరుద్ధరించారు. కాళేశ్వరంపై ప్రస్తుత ప్రభుత్వం ప్రళయం వచ్చినట్లు గందరగోళం సృష్టించింది. పారిశ్రామిక, ఐటీ సెక్టార్లలో తెలంగాణ గత మూడేళ్లలో అద్భుత ప్రతిభ కనబరిచిందని, 2019 నుంచి 2021 వరకు 15 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిందని అంతర్జాతీయ లేబర్‌ ఆర్గనైజేషన్‌(ఐఎల్‌వో) చెప్పింది.

రుణమాఫీ ఏమైంది?

డిసెంబరు 9 నాటికి రుణాలన్నీ మాఫీ చేస్తామని రేవంత్‌ అన్నారు. డిసెంబరు 9 గడిచి ఎన్నాళ్లైంది? ముఖ్యమంత్రి ఎక్కడ నిద్రపోతున్నారు? రైతులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దు. వారికి భారాస అండగా ఉంటుంది. పంట నష్టంపై తక్షణం జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వం లెక్కలు తీయించాలి. మిషన్‌ భగీరథ సరఫరాను పునరుద్ధరించాలి. ఏప్రిల్‌ 2న అన్ని జిల్లాల్లో రూ.500 బోనస్‌పై కలెక్టర్లకు భారాస శ్రేణులు వినతిపత్రం ఇవ్వాలి. 6న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ దీక్ష చేయాలి. ఎస్‌ఎల్‌బీసీ మరో 20 ఏళ్లయినా పూర్తి కాదు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ పాపమే ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి కారణం’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని