మ్యాచ్‌ ఫిక్సింగ్‌తో గెలిచేందుకు మోదీ కుట్ర

వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకొని మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలని కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు.

Updated : 01 Apr 2024 05:07 IST

ఎన్డీయేకు 400 సీట్లిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు
దీన్ని అడ్డుకోవడానికి అంతా భాజపాకు వ్యతిరేకంగా ఓటేయాలి
దిల్లీ రాంలీలా మైదానంలో రాహుల్‌ పిలుపు
‘ఇండియా’ కూటమి సభకు హాజరైన అగ్రనాయకులు

ఈనాడు, దిల్లీ: వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకొని మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలని కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. ఒకవేళ వారు చెబుతున్నట్లు 400 సీట్లు గెలుచుకుంటే రాజ్యాంగాన్ని రద్దుచేయడం ఖాయమని హెచ్చరించారు. అదే జరిగితే పేదల హక్కులు, అధికారాలు,  రిజర్వేషన్లు పోవడం తథ్యమన్నారు. ఆ తర్వాత ఈ దేశం కూడా చీలికలు పేలికలు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల దేశ ప్రజలు వచ్చే ఎన్నికలను కేవలం ఓటు కోసం జరిగే ఎన్నికల్లా భావించకుండా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించే మహత్తరకార్యంగా భావించి ఓటేయాలని పిలుపునిచ్చారు. ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌లను  వ్యతిరేకిస్తూ ఆదివారం ఇక్కడి రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి పార్టీలు ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించు’ పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘మన ముందు ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో అంపైర్‌(ఎన్నికల కమిషనర్ల)ను నరేంద్ర మోదీయే ఎంపిక చేశారు. మ్యాచ్‌ ప్రారంభంకాక ముందే మా టీంలోని ఇద్దరు ఆటగాళ్లను అరెస్ట్‌ చేసి ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో మోదీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు ప్రయత్నిస్తున్నారు. ఈవీఎంలు, మ్యాచ్‌ ఫిక్సింగ్‌, సామాజిక మాధ్యమాలు, సాధారణ మీడియాపై ఒత్తిడి తెచ్చి, కొనుగోలు చేసినప్పటికీ వాళ్లు 180 సీట్లు దాటే పరిస్థితి లేదు. అందుకే ఎన్నికల మధ్యలో అతిపెద్ద ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలన్నీ బంద్‌ చేశారు. మరోవైపు నేతలను భయపెడుతున్నారు. డబ్బులిచ్చి ప్రభుత్వాలను కూలగొడుతున్నారు. నరేంద్రమోదీ, దేశంలోని ముగ్గురు నలుగురు ధనవంతులు కలిసి ఈ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేస్తున్నారు.

దీని ప్రధాన లక్ష్యం రాజ్యాంగాన్ని మార్చడమే. ఇప్పుడు మేం చేస్తున్న పోరాటం రాజ్యాంగాన్ని రక్షించడానికి చేస్తున్నదే. రాజ్యాంగం పోతే పేదల హక్కులు, రిజర్వేషన్లు పోతాయి. ప్రస్తుతం దేశంలో 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం తాండవిస్తోంది.  కులగణన, పంటల కనీసమద్దతు ధరకు చట్టబద్ధత, ఉద్యోగాల కల్పన అంశాలు ఇప్పుడు దేశంలో ప్రధాన సమస్యలు. ఒకవేళ మీరు ధైర్యంగా ఓటేయకపోతే వారి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కుట్ర అమలైపోతుంది. ఎప్పుడైతే అది సాకారమవుతుందో ఆ వెంటనే రాజ్యాంగం ఖతమైపోతుంది. కేవలం ఎన్నికలకు ఒకటి రెండు నెలల ముందు హేమంత్‌ సోరెన్‌, కేజ్రీవాల్‌ను జైలుపాలు చేసి ప్రతిపక్షాలను భయపెట్టే ప్రయత్నం చేశారు. మా బ్యాంకు ఖాతాలను కూడా ఆరునెలల ముందో, ఎన్నికలైన తర్వాతో బంద్‌ చేసి ఉండొచ్చు. కానీ ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోరాడకూడదన్న లక్ష్యంతో ఈ పనులన్నీ ఎన్నికల సమయంలోనే చేశారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకొని రాజ్యాంగాన్ని రద్దుచేసి అధికారంలో ఉండటానికి ఈ పనులన్నీ చేస్తున్నారు. ఈ ఎన్నికలు ఓటు కోసం జరిగేవికాదు. దేశాన్ని, రాజ్యాంగాన్ని, పేదలు, రైతుల, బడుగువర్గాల హక్కులను రక్షించే ఎన్నికలు అన్న మాటను అందరూ గుర్తుంచుకోండి’’ అని రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు.

ఇండియా కూటమి తరఫున అయిదు డిమాండ్లు చేస్తున్నాం: ప్రియాంకా గాంధీ

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ రాముడు సత్యం కోసం పోరాడినప్పుడు ఆయన వద్ద అధికారం, వనరులు లేవని గుర్తుచేశారు. రథం, వనరులు, సేన, బంగారం అన్నీ రావణుడి దగ్గరే ఉండేవని, రాముడి వద్ద మాత్రం ఆశ, విశ్వాసం, సత్యం, ప్రేమ, పరోపకారం, వినయం, ధైర్యం, సాహసం మాత్రమే ఉన్నాయని చెప్పారు. వాటి ఆధారంగానే ఆయన రావణుడిపై గెలిచారని గుర్తు చేశారు. అధికారం శాశ్వతం కాదని, అధికారం పోయిన వెంటనే అహంకారం అణగిపోతుందని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. ఈ సభావేదిక మీది నుంచి ఇండియా కూటమి తరఫున అయిదు డిమాండ్లు చేస్తున్నట్లు ప్రకటించారు. అవి.. 1. కేంద్ర ఎన్నికల సంఘం ఈ లోక్‌సభ ఎన్నికల్లో అన్ని పార్టీలకూ సమానావకాశాలు కల్పించాలి. 2.ఎన్నికల్లో గందరగోళం సృష్టించడానికి ప్రతిపక్షాలపై ఐటీ, ఈడీ, సీబీఐలాంటి సంస్థల ద్వారా చేయిస్తున్న దాడులను ఎన్నికల సంఘం నిరోధించాలి. 3.హేమంత్‌ సోరెన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ను వెంటనే విడుదల చేయాలి. 4. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల ఆర్థిక వనరులను స్తంభింపజేసే బలవంతపుచర్యలను వెంటనే నిలిపేయాలి. 5. ఎన్నికల బాండ్ల ద్వారా భాజపా చేసిన బలవంతపు వసూళ్లపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ జరిపించాలి.

కూటమి అధికారంలోకి వస్తే దిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా: సునీతా కేజ్రీవాల్‌

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశ రాజధానికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామని కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్‌ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు.  ‘కేజ్రీవాల్‌ ఎందుకు రాజీనామా చేయాలి? ఆయన అరెస్టు న్యాయమా? కేజ్రీవాల్‌ సింహం లాంటివాడు..ఆయన్ను ఎక్కువ రోజులు లోపల ఉంచలేరు’ అని సునీత వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ హాజరయ్యారు. ఎన్సీపీ(ఎస్‌పీ) అధినేత శరద్‌పవార్‌, ఎన్‌సీ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె.స్టాలిన్‌, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌, ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి చంపయీ సోరెన్‌, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌, టీఎంసీ నేత డెరెక్‌ఒబ్రెయిన్‌, డీఎంకే నేత తిరుచ్చిశివ, హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పన సోరెన్‌ తదితరులు ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. పంజాబ్‌, దిల్లీ నుంచి ఆప్‌ కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.


ప్రతివ్యవస్థను దెబ్బతీస్తున్నారు: ఖర్గే

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ వ్యవహారశైలిని, ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలను తూర్పారబట్టారు. ఆర్‌ఎస్‌ఎస్‌ విషంలాంటిదని, ఒకసారి రుచి కోసం నాలుకకు అంటించుకున్నా ప్రాణం పోవడం ఖాయమని హెచ్చరించారు. ఈ దేశాన్ని రక్షించడానికి, భిన్నత్వంలో ఏకత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగానికి కాపాడటానికే ప్రతిపక్షాలు ఇక్కడ సమావేశమైనట్లు చెప్పారు. ‘‘మోదీ ప్రజాస్వామ్యాన్ని కాకుండా నియంతృత్వాన్ని కోరుకుంటున్నారు. రూ.44 లక్షలకు లెక్కలు చెప్పలేదన్న కారణంతో వడ్డీపై వడ్డీవేసి మాపై రూ.3,567 కోట్ల పెనాల్టీ వేశారు. అందుకే మేం ప్రచారం చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రజాస్వామ్యంలోని ప్రతి వ్యవస్థనూ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈడీ, సీబీఐ, సీవీసీ, ఐటీలాంటి సంస్థలను ఇష్టానుసారం దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షనేతలతోపాటు, పార్టీ అధ్యక్షులనూ భయపెడుతున్నారు. ఇలాంటి మోదీని అధికారం నుంచి తప్పించకపోతే ఈ దేశంలో సుఖసంతోషాలకు తావుండదు. నియంతృత్వాన్ని కోరుకొనేవారిని ఈ దేశం నుంచి వెళ్లగొట్టాలి. మోదీని ఓడించేంతవరకూ ఎవ్వరూ శాంతించవద్దు. 140 కోట్ల ప్రజల రక్షణ కోసం చేస్తున్న ఈ పోరాటానికి అందరూ మద్దతు పలకాలి’’ అని పిలుపునిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని