తెదేపా వల్ల పింఛన్లు ఆగిపోయాయని చెప్పండి.. వాలంటీర్లకు వైకాపా వాట్సప్‌ సందేశాలు

ఎన్నికలు దగ్గర పడేకొద్దీ వైకాపా మరింతగా బరితెగిస్తోంది. ప్రభుత్వ పథకాల పంపిణీకి వాలంటీర్ల సేవలు వినియోగించుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన ఆదేశాలకు వక్రభాష్యం చెబుతూ.. ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందే కుట్రను కొనసాగిస్తోంది.

Updated : 01 Apr 2024 07:34 IST

విపక్షాలపై దుష్ప్రచారానికి కొత్త ఎత్తుగడ
అధికార పార్టీ నేతల తీరును ఖండించిన ప్రతిపక్షాలు

ఈనాడు, అమరావతి: ఎన్నికలు దగ్గర పడేకొద్దీ వైకాపా మరింతగా బరితెగిస్తోంది. ప్రభుత్వ పథకాల పంపిణీకి వాలంటీర్ల సేవలు వినియోగించుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన ఆదేశాలకు వక్రభాష్యం చెబుతూ.. ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందే కుట్రను కొనసాగిస్తోంది. వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయించవద్దని ఎన్నికల సంఘం తాజాగా ఆదేశాలిస్తే.. దానికి తెదేపానే కారణమంటూ వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఆదివారం కూడా దుష్ప్రచారం చేసింది. తెదేపా వల్ల పింఛన్ల పంపిణీ ఆగిపోయిందంటూ ప్రచారం చేయాల్సిందిగా ‘యూనిటీ ఆఫ్‌ వాలంటీర్స్‌’ వంటి వాట్సప్‌ గ్రూపులను ఏర్పాటుచేసి వాలంటీర్లను ప్రేరేపిస్తోంది. ‘వాలంటీర్లు పింఛన్లు ఇవ్వకుండా తెదేపా వారు ఆపేశారు. వాలంటీర్లను తీసేస్తారు. ఇక ఎవరికీ పింఛను ఇవ్వరనీ వార్డుల్లో అందరికీ చెప్పాలి’ అంటూ ఆ గ్రూప్‌లో సందేశాలు వెళ్లాయి. మండలస్థాయి అధికారుల (ఎంఎల్‌ఓ) ద్వారా వాలంటీర్లకు ఆ సందేశాలు వెళుతున్నట్లు సమాచారం. వాలంటీర్లలో అత్యధికులు వైకాపా కార్యకర్తలే కావడం, ఈ ఎన్నికల్లో వారు ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వంటి సంఘటనల నేపథ్యంలో ఎన్నికల సంఘం వారిని సంక్షేమ పథకాల పంపిణీకి దూరంగా ఉంచింది. కానీ దీన్ని తెదేపాకు అంటగట్టి, పింఛనుదారుల్లో ఆ పార్టీపై వ్యతిరేకత పెంచేందుకు వైకాపా కుట్ర పన్నింది. దీన్ని కూడా వాలంటీర్ల ద్వారానే అమలుచేస్తోంది.


ఈసీ వంకతో పింఛను ఎగ్గొట్టాలని జగన్‌ కుట్ర

తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌

ఎన్నికల సంఘాన్ని వంకగా చూపి వృద్ధులు, దివ్యాంగులు తదితరులకు ఏప్రిల్‌ నెల పింఛను ఇవ్వకుండా ఎగ్గొట్టాలనేదే జగన్‌రెడ్డి కుట్రని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ధ్వజమెత్తారు. వాలంటీర్లను ఎన్నికల ప్రచారంలో వినియోగించకూడదని ఎన్నికల సంఘం పదేపదే చెప్పినా అధికార పార్టీ నేతలు నిబంధనలను తుంగలో తొక్కారని ఆదివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. ‘‘రాజకీయ లబ్ధి కోసమే వైకాపా నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. వృద్ధాప్య పింఛను ప్రవేశపెట్టిందే ఎన్టీఆర్‌. దాన్ని రూ.2వేలకు పెంచింది చంద్రబాబు. విషప్రచారాల్ని తిప్పి కొడతాం. ఒక్క పింఛను కూడా ఆగనివ్వం. చివరి లబ్ధిదారుడికి అందేదాకా ఊరుకోం’’ అని సత్యప్రసాద్‌  పేర్కొన్నారు.


సోమవారం నుంచి ఇవ్వకపోతే ఉద్యమిస్తాం

సోమవారం నుంచి పింఛన్లు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందని తెలిసీ పింఛన్ల పంపిణీ కోసం ఖజానాలో నగదు ఎందుకు ఉంచలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో 20 లక్షల మందికి అదనంగా పింఛను అందిస్తే జగన్‌ 7 లక్షల మందిని తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలతో చంద్రబాబుకు ఏం సంబంధమని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. ‘‘జగన్‌రెడ్డి మార్గదర్శకత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్‌రెడ్డి తెదేపా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. పింఛను పంపిణీలో అవకతవకలు జరిగినా, ఏ లబ్ధిదారుడికి అందకపోయినా ఈసీ ఉత్తర్వుల్ని ఉల్లంఘించినట్టే’’ అని రామయ్య తెలిపారు.


పింఛను సొమ్మునూ అస్మదీయులకు దోచిపెట్టిన జగన్‌

దొడ్డిదారిలో రూ.1,500 కోట్ల బిల్లుల చెల్లింపు

తెదేపా నేతల ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఏప్రిల్‌లో చెల్లించాల్సిన పింఛను మొత్తంలో సుమారు రూ.1,500 కోట్లను వైకాపా ప్రభుత్వం దారిమళ్లించిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. సీఎం జగన్‌, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి కుమ్మక్కై పురపాలకశాఖ ద్వారా దొడ్డిదారిలో తమ అస్మదీయ కంపెనీలకు బిల్లులు చెల్లించారని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగా పింఛన్ల పంపిణీని ఆలస్యం చేసి, తెదేపా వల్లే ఇలా జరిగిందని విషప్రచారం చేయాలని చూస్తున్నారని ఆదివారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎన్నికల కోడ్‌ను కూడా లెక్కచేయకుండా వాలంటీర్లు వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తున్నారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే ఎన్నికల సంఘం వారిని దూరం పెట్టింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. తన తప్పుల్ని ఇతరుల మీదకు నెట్టడంలో జగన్‌ సిద్ధహస్తుడు. తెదేపా వల్లే ఇంటింటికీ పింఛన్లు రావడం లేదని ప్రజల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారు’’ అని అచ్చెన్న దుయ్యబట్టారు.


3 నుంచి పింఛన్ల పంపిణీ అని సాక్షిలో ప్రచురించలేదా?

పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షి పత్రికలో కట్టుకథలు అల్లుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 28న సాక్షిలో ‘ఏప్రిల్‌ 3 నుంచి పింఛన్ల పంపిణీ’ అని ప్రచురించింది నిజం కాదా అని నిలదీశారు. అప్పటికి ఎన్నికల సంఘం ఆదేశాలు కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ‘‘అసలు ప్రభుత్వ ఖజానాలో నిధులెందుకు ఉంచలేదు? వాటిని అస్మదీయ కంపెనీలకు బిల్లుల చెల్లింపు కోసం ఖర్చుచేసింది నిజం కాదా’’ అని మాల్యాద్రి ప్రశ్నించారు.


కావాలనే జాప్యమయ్యేలా ప్రభుత్వం కుట్ర

ఆందోళన చేపడతామని షర్మిల హెచ్చరిక

‘వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే పింఛన్లు పంపిణీ చేయలేరా? ఇతర ప్రభుత్వ ఉద్యోగులు లేరా? రెండు, మూడు రోజుల్లో పంపిణీ పూర్తిచేయకపోతే మీ కార్యాలయం ముందు ఆందోళన చేస్తా’ అని సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డిని ఉద్దేశించి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. ఆదివారం ఫోన్లో ఆమె సీఎస్‌తో మాట్లాడారు. పింఛన్ల పంపిణీకి పది రోజుల సమయం పడుతుందని సీఎస్‌ చెప్పడంపై షర్మిల అభ్యంతరం తెలిపారు. అదే జరిగితే ఇందులో ప్రభుత్వం కుట్ర ఉన్నట్లు అనుమానించాల్సి ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్‌ సూచనల ప్రకారం వెంటనే పింఛన్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. పింఛనుదారుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు డీబీటీ ద్వారానూ పింఛన్లు ఒక్కరోజులో పంపిణీ చేయొచ్చు కదా అని షర్మిల ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా వాలంటీర్ల వ్యవస్థను అధికార పార్టీ వాడుకోవడాన్ని ఎన్నికల సంఘం నియంత్రించడం శుభ పరిణామమని వ్యాఖ్యానించారు.


పంపిణీకి ఆటంకం లేకుండా చూడండి

సీఈఓకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ

పింఛన్ల పంపిణీలో ఆటంకం కలగకుండా సకాలంలో తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనాకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆదివారం లేఖ రాశారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి వినియోగించరాదని ఈసీ ఆదేశించిన నేపథ్యంలో వారికి ప్రత్యామ్నాయంగా గ్రామ సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బందితో అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు నగదు పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్లను వినియోగించవద్దని ఈసీ ఆదేశించిన నేపథ్యంలో పింఛను ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనాకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆదివారం లేఖ రాశారు. గ్రామ, వార్డు సచివాలయ, రెవెన్యూ ఉద్యోగుల ద్వారా గతంలో మాదిరిగా నేరుగా పింఛను అందజేయాలని సూచించారు.


ఉద్దేశపూర్వకంగానే చెల్లింపుల్ని ఆలస్యం చేస్తున్నారు

సీఎస్‌పై చర్యలు తీసుకోవాలి

భాజపా నేత రమేశ్‌నాయుడి డిమాండ్‌

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) కేఎస్‌.జవహర్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే పింఛన్‌ చెల్లింపుల్ని ఆలస్యం చేస్తూ రాజకీయంగా వైకాపాకు లబ్ధి చేకూర్చాలని చూస్తున్నారని భాజపా రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్‌నాయుడు ఆరోపించారు. తద్వారా ప్రతిపక్షాలపై వ్యతిరేకత పెంచాలనే కుట్రకు ఆయన తెరలేపడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ‘‘1.20 లక్షల మంది సచివాలయ సిబ్బంది ఉండి కూడా సకాలంలో పింఛన్లు చెల్లించలేకపోవడం కచ్చితంగా రాజకీయ కుట్రే. దీనికి కర్త, కర్మ అయిన జవహర్‌రెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి’’ అని రమేశ్‌నాయుడు ‘ఎక్స్‌’ వేదికగా ఆదివారం డిమాండ్‌ చేశారు.


రూ.1,600 కోట్లు లేవా?

తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇవ్వాల్సిన పింఛను సొమ్మును అస్మదీయ కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన సీఎం జగన్‌.. తెదేపాపై బురద జల్లుతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. పింఛన్ల పంపిణీకి రూ.1,600 కోట్లు కూడా లేవా అని ప్రశ్నించారు. ఏపీఎండీసీ బాండ్ల ద్వారా వచ్చిన రూ.ఏడు వేల కోట్లు, మార్చిలో వచ్చిన రూ.17 వేల కోట్ల ఆదాయం, కేంద్రం ఇచ్చే పన్ను వాటా, గ్రాంట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ వద్దనే ఈసీ చెప్పింది కానీ ప్రజలకు అసలుకే ఇవ్వొద్దని కాదని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ఖజానాలో డబ్బుల్లేకే ఏప్రిల్‌ 2న ఆర్బీఐ నుంచి అప్పుతెచ్చి మూడో తేదీ నుంచి పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి రాకపోయినా అప్పు కోసం మార్చి 28వ తేదీనే ఇండెంట్‌ పెట్టారు. ఆ విషయాన్ని తొక్కిపెడుతూ తెదేపాపై వైకాపా వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారు. చివరకు పేదలకు ఇచ్చే పింఛను కోసం కూడా ఆర్బీఐ ఇచ్చే అప్పు మీదే ఆధారపడాల్సిన పరిస్థితికి రాష్ట్రాన్ని తెచ్చారు’’ అని విజయ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్లు పంపిణీ చేయాలనే ఉద్దేశం ఉంటే 13,500 మంది పంచాయతీ కార్యదర్శులు, 1.25 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, మండల, పంచాయతీ ఉద్యోగులు చాలరా అని ప్రశ్నించారు. వాలంటీర్ల మీద పర్యవేక్షణ పేరుతో ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీలకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.274 కోట్లు దోచిపెట్టిందని విమర్శించారు.


పది రోజులు కావాలా?

-ధూళిపాళ్ల నరేంద్ర

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో ఉన్న 60 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు పంచడానికి 1.65 లక్షల మంది వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది చాలరా అని తెదేపా సీనియర్‌నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ మండిపడ్డారు. ఒక్కో సచివాలయ ఉద్యోగి.. 40 మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను ఇవ్వడానికి 10 రోజులు కావాలా అని సీఎస్‌ను ఆదివారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. రాజకీయ ప్రేరేపితమైన ఇలాంటి వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని, ఇంటింటికీ వెళ్లి పింఛను పంచేలా ఆదేశాలివ్వాలని కోరారు.


వాలంటీర్‌ వ్యవస్థపై ఈసీ పునరాలోచించాలి

స్పీకర్‌ తమ్మినేని సీతారాం

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: వాలంటీర్లను తొలగించాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు ఇవ్వడం మంచిదేనని కానీ వారి సేవలు ఎవరు అందిస్తారో తెలియజేయాలని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థపై పునరాలోచన చేయాలని ఎన్నికల కమిషన్‌కు సూచించారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని స్పీకర్‌ క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ‘ప్రభుత్వం వాలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రజలకు సేవలు అందిస్తోంది. వారిని తొలగించాలనడం సబబు కాదు. వారంతా రాజీనామా చేస్తే వారి విధులు ఎవరు చేపట్టాలో ఎన్నికల కమిషన్‌ స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పింది’ అని తమ్మినేని పేర్కొన్నారు. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారని, స్వచ్ఛంద సేవకులుగా వారికి ప్రభుత్వం గౌరవవేతనం మాత్రమే ఇస్తోందని తెలిపారు. వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు పంపిణీ చేయకూడదని తీసుకున్న నిర్ణయంపై ఎన్నికల కమిషన్‌ మళ్లీ ఆలోచించాలని వైకాపా టెక్కలి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని