కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ పథకమూ ఆగదు

వైకాపా దోపిడీని అరికడితే సంక్షేమ పథకాలను అప్పులు లేకుండానే అమలు చేయవచ్చని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.

Updated : 01 Apr 2024 05:36 IST

వైకాపాను తరిమి కొట్టాలి
వాళ్ల దోపిడీని అరికడితే అప్పులు లేకుండానే పాలన సాగించొచ్చు
పిఠాపురం ఆత్మీయ సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌


‘వచ్చేది కూటమి ప్రభుత్వమే. మనం కచ్చితంగా గెలుస్తున్నాం. భారీ మెజారిటీతో ఎక్కువ సీట్లు సాధించబోతున్నాం. జనసేన- తెదేపా-భాజపా.. మూడు పార్టీలకు చెందిన ప్రతి కార్యకర్త, నాయకుడు.. 40 రోజుల మండల దీక్ష చేసినట్లు, రంజాన్‌ మాసంలో ఉపవాసం ఉన్నట్లు నిష్ఠగా మన ప్రభుత్వ స్థాపనకు పనిచేద్దాం. ఘన విజయాన్ని సాధిద్దాం’


‘మూడు పార్టీల పొత్తుతో ఎన్నికలను ఎదుర్కోవాలంటే సీట్ల కేటాయింపులో ఎన్నో షరతులు.. అలకలు.. మరెన్నో సంఘర్షణలుంటాయి. కానీ వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని బయట పడేయాలనే ఒకే ఒక లక్ష్యంతో జనసేన-తెదేపా-భాజపాల మధ్య ఎలాంటి అరమరికలూ లేకుండా పొత్తు కుదిరింది’

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌


ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, పిఠాపురం: వైకాపా దోపిడీని అరికడితే సంక్షేమ పథకాలను అప్పులు లేకుండానే అమలు చేయవచ్చని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. వైకాపా పాలనలో ఉన్న మద్యం, గంజాయి, ఇసుక, భూమాఫియా లాంటి వాటిని నియంత్రిస్తే అన్ని పథకాలకూ డబ్బులు సర్దుబాటు అవుతాయని తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన-తెదేపా-భాజపా నాయకుల ఆత్మీయ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. వచ్చే కూటమి ప్రభుత్వంలో ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగిపోదని ప్రజలకు చెప్పాలని పిలుపునిచ్చారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు సహాయం చేశానని, సినిమాలు చేసి.. ఆ డబ్బును ఆపదలో ఉన్నవారికి పంచానని చెప్పారు. వచ్చే కూటమి ప్రభుత్వంలో   సంపద సృష్టించి ప్రతి పథకాన్నీ అమలుచేస్తామన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇస్తున్న దానికంటే ఎక్కువగానే ఇస్తాం తప్ప పథకాలను నిలిపివేసే ప్రసక్తే లేదన్నారు.

చంద్రబాబును జైల్లో పెడితే చాలా బాధపడ్డా..

నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం.. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి, సైబరాబాద్‌ లాంటి ప్రత్యేక నగరాన్ని తయారుచేసిన తెదేపా అధినేత చంద్రబాబును వైకాపా ప్రభుత్వం అకారణంగా జైల్లో పెట్టినప్పుడు చాలా బాధపడ్డానని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. భాజపా కూడా పొత్తులోకి రావడం ఆనందం కలిగించిందన్నారు.

రాష్ట్రం కోసమే ఇదంతా..

‘పొత్తుల వల్ల మా పార్టీ నాయకులు కూడా నలిగిపోయారు. చాలామంది ఎన్నికల్లో పోటీచేయలేకపోతున్నామని బాధపడ్డారు. కానీ రాష్ట్రం కోసం పెద్దమనసుతో అర్థం చేసుకున్నారు.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గొప్పగా ఉండాలంటే మూడు పార్టీలు కలిసి పాలన సాగించాలని భావించా’ అని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. భాజపా పెద్దలు ఎంపీ స్థానాలు ఎక్కువ కావాలని కోరితే కాదనకుండా ముందుకు వెళ్లామన్నారు. 2024లో జనసేన బలం పెరిగిందని తెలిసినా గందరగోళం లేకుండా ముందడుగు వేయాలనే తలంపుతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న లక్ష్యంతో పొత్తులకు చొరవ చూపామన్నారు. భాజపా, తెదేపాలా బలమైన పునాదులు, సమూహాన్ని క్రమశిక్షణతో నడిపించే వ్యవస్థ జనసేన పార్టీ ఇంకా సంపాదించలేదన్నారు. మనకు యువబలం, పోరాడేతత్వం మెండుగా ఉన్నా.. ఎన్నికల సమయంలో దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న పార్టీల ఎత్తుగడలను పసిగట్టడం, సమన్వయం చాలా కీలకమని అభిప్రాయపడ్డారు.

వర్మ గౌరవానికి భంగం కలగనివ్వబోం..

పిఠాపురంలో తన గెలుపు బాధ్యత తీసుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్యాద తగ్గకుండా, గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటానని పవన్‌ కల్యాణ్‌ భరోసా ఇచ్చారు. వర్మ నాయకత్వ పటిమ, సమర్థత, ప్రతిభను తాను పూర్తిగా అర్థం చేసుకున్నానని చెప్పారు. చంద్రబాబు గీసిన గీత దాటనని వర్మ చెప్పడం తనకు సంతోషం కలిగించిందన్నారు. గెలిచాక ఒంటెద్దు పోకడలకు పోనని.. పిఠాపురం నియోజకవర్గంలోని మూడు పార్టీల మండల నాయకులను, నియోజకవర్గ నేతలను సమన్వయం చేసుకుంటానని వివరించారు. పిఠాపురం అభివృద్ధికి ఏం చేయాలన్న దానిపై మూడుపార్టీల నాయకులం ఎప్పటికప్పుడు చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారు. సమావేశంలో తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌.వర్మ, కాకినాడ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌, పిఠాపురం నియోజకవర్గ భాజపా ఇన్‌ఛార్జి కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని