ఏపీ కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి

రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక దాదాపుగా కొలిక్కి వచ్చినట్లు తెలిసింది.

Updated : 01 Apr 2024 04:48 IST

నేడు తుది జాబితా ఖరారు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక దాదాపుగా కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఈ వ్యవహారమై కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ ఆదివారం దిల్లీలో సమావేశమై చర్చించగా.. కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ ఆమోదంతో సోమవారం అభ్యర్థుల తుది జాబితా ఖరారు చేయనున్నారు. తొలివిడతగా కొన్ని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులనూ ప్రకటించే అవకాశముంది. ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ నేతృత్వంలో నిర్వహించిన స్క్రీనింగ్‌ కమిటీ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పాల్గొని అశావహుల జాబితాను కమిటీ ముందుంచారు. అసెంబ్లీ, లోక్‌సభకు 1,500 మందికిపైగా దరఖాస్తు చేశారు. వివిధ దశల్లో పరిశీలన తరువాత ఎంపిక చేసిన పేర్లపై స్క్రీనింగ్‌ కమిటీ సమగ్రంగా చర్చించింది. కమిటీ సభ్యులు సూరత్‌హెగ్డే, మాణికం ఠాగూర్‌, మేయప్పన్‌, షర్మిల, రఘువీరారెడ్డి, కొప్పుల రాజుల అభిప్రాయాలను ఛైర్మన్‌ మిస్త్రీ తెలుసుకున్నారు. కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేసే విషయంపైనా సమావేశంలో చర్చకు వచ్చింది. పోటీకి ఆమె సుముఖత వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అధికారికంగా ప్రకటించేవరకూ ఈ విషయంలో మీడియాతో మాట్లాడకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. ఇండియా కూటమిలో భాగమైన సీపీఎం, సీపీఐలకు కేటాయించే సీట్లపైనా చర్చ జరిగింది. అరకు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నట్లు సీపీఎం శనివారమే ప్రకటించింది. గుంటూరు నుంచి లోక్‌సభకు సీపీఐ అభ్యర్థిని బరిలో దింపాలని ఆ పార్టీ నిర్ణయించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని