నేడు నలుగురు లోక్‌సభ అభ్యర్థుల ఖరారు!

రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థులను సోమవారం ఖరారు చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

Published : 01 Apr 2024 04:58 IST

సీఈసీ సమావేశానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థులను సోమవారం ఖరారు చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) సమావేశానికి హాజరయ్యేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం దిల్లీ వెళ్లనున్నారు. కమిటీ సభ్యుడు, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా వెళ్లే అవకాశాలున్నాయి. వాస్తవానికి తెలంగాణ అభ్యర్థులను ఆదివారమే ఖరారు చేస్తారని రెండురోజుల క్రితం రాష్ట్రనేతలకు సమాచారం వచ్చింది. ఇందుకోసం దిల్లీ వెళ్లడానికి సీఎం సిద్ధమవగా సోమవారం జరిగే సీఈసీ సమావేశంలో చర్చిస్తారనే సమాచారం రావడంతో ఆగిపోయారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదివారం దిల్లీ వెళ్లారు. ఆయన కూడా సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను ఇప్పటికే మూడు దఫాలుగా 13 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. మిగిలిన 4 స్థానాలకు ప్రకటించాలి. వరంగల్‌ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య పేరును పార్టీ పరిశీలిస్తోంది. అభ్యర్థులను ఖరారు చేయడానికి ముందే పార్టీలో చేరితే బాగుంటుందనే ప్రతిపాదన రావడం వల్లనే వారు ఆదివారం కాంగ్రెస్‌ కండువా ధరించినట్లు తెలుస్తోంది. కరీంనగర్‌, హైదరాబాద్‌, ఖమ్మం స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 6న తుక్కుగూడలో జరిగే జనజాతర బహిరంగ సభలో కాంగ్రెస్‌ జాతీయ మ్యానిఫెస్టోను పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్‌గాంధీ విడుదల చేయనున్నారు. ఈ సభ ఏర్పాట్లపైనా సీఈసీ సమావేశంలో అగ్రనేతలతో సీఎం, డిప్యూటీ సీఎం చర్చిస్తారని తెలుస్తోంది.

ఇన్‌ఛార్జుల నియామకం...

వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం తెలంగాణలోని 17 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను నియమించినట్లు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ తెలిపారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి- నల్గొండ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి- ఖమ్మం, పొన్నం ప్రభాకర్‌- కరీంనగర్‌, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు- పెద్దపల్లి, దామోదర్‌ రాజనర్సింహ- జహీరాబాద్‌, తుమ్మల నాగేశ్వరరావు- మహబూబాబాద్‌, జూపల్లి కృష్ణారావు- నాగర్‌కర్నూల్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి- సికింద్రాబాద్‌, కొండా సురేఖ- మెదక్‌,  సీతక్క- ఆదిలాబాద్‌, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి- భువనగిరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి- వరంగల్‌, సుదర్శన్‌రెడ్డి- నిజామాబాద్‌, మాజీ ఎమ్మెల్యేలు సంపత్‌కుమార్‌-మహబూబ్‌నగర్‌, మైనంపల్లి హనుమంతరావు- మల్కాజిగిరి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి- చేవెళ్ల, పార్టీ నేత ఒబెదుల్లా కొత్వాల్‌- హైదరాబాద్‌ ఇన్‌ఛార్జులుగా ఉంటారని ఆమె తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని