రాష్ట్రంలో 12 కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తాం

రాష్ట్రంలో భాజపా 12 కంటే ఎక్కువ లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించి తీరుతుందని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి అభయ్‌కుమార్‌ పాటిల్‌ పేర్కొన్నారు.

Published : 01 Apr 2024 04:58 IST

భాజపా ఎన్నికల ఇన్‌ఛార్జి అభయ్‌కుమార్‌ పాటిల్‌

గోషామహల్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో భాజపా 12 కంటే ఎక్కువ లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించి తీరుతుందని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి అభయ్‌కుమార్‌ పాటిల్‌ పేర్కొన్నారు. పార్టీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డితో కలిసి ధూల్‌పేటలో ఆదివారం గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఇంట్లో సమావేశమయ్యారు. రాజాసింగ్‌ కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనతో గంటకుపైగా చర్చలు జరిపారు. అనంతరం అభయ్‌కుమార్‌ పాటిల్‌ మాట్లాడుతూ.. రాజాసింగ్‌తో చాలా విషయాలు మాట్లాడామని, అంతర్గత సమస్యలు త్వరలోనే సమసి పోతాయని పేర్కొన్నారు. త్వరలోనే పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటారని తెలిపారు. ఆయన అసంతృప్తితో ఉన్నారన్న వార్తల్లో నిజం లేదని, రాజాసింగ్‌ అభిప్రాయాలు తెలుసుకున్నామన్నారు. పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి ఆయా సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తామని చెప్పారు. మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజాసింగ్‌ ఇతర రాష్ట్రాల్లోనూ భాజపా అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేస్తున్నారని, తెలంగాణలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ ఆయన ప్రచారం చేస్తారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని