ఆరు గ్యారంటీల అమలుపై చేతులెత్తేసిన కాంగ్రెస్‌: బండి సంజయ్‌

ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతులెత్తేసిందని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ మండిపడ్డారు.

Published : 01 Apr 2024 04:59 IST

తెలంగాణచౌక్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతులెత్తేసిందని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని కాంగ్రెస్‌ చెప్పిందని, ఇప్పటికే ఆ గడువు దాటిపోయిందని ఆయన అన్నారు. ఆదివారం రాత్రి కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మహిళల ఖాతాల్లో సాయం నెలకు రూ.2,500, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, చేయూత పెన్షన్‌ కింద రూ.4 వేలు, పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, రైతు భరోసా కింద అన్నదాతలకు ఏడాదికి రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.12 వేలు, ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్‌ లాంటి హామీల అమల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. రైతుల విషయంలో గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం అనుసరించిన పంథానే కాంగ్రెస్‌ పార్టీ కొనసాగిస్తోందని విమర్శించారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించి.. పరిహారం కింద రూ.10 వేల చొప్పున అన్నదాతల ఖాతాల్లో వేస్తామని చెప్పి వేయలేదన్నారు. సిరిసిల్ల, ఇతర ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున చెల్లించాలని భాజపా డిమాండ్‌ చేయగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.పది వేల చొప్పున ఇస్తామని ఉత్తర్వులు జారీ చేసిందని, ఇప్పటివరకు ఇవ్వలేదని విమర్శించారు. పార్టీలు మారే నాయకులకు ప్రజలు ఓటేయవద్దని కోరారు. రైతుల సమస్యలపై ఈ నెల 2న కరీంనగర్‌ కలెక్టరేట్‌ వద్ద రైతుదీక్ష చేస్తామని.. అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని