హస్తానికి ఓటేస్తే మోసాలను అంగీకరించినట్లే

రైతులకు రూ.15 వేల రైతుభరోసా, పంటకు రూ.500 బోనస్‌, రూ.2 లక్షల రుణమాఫీ, ఆసరా పింఛను రూ.4,000కు పెంపు, దివ్యాంగులకు రూ.6,000, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు రూ.లక్ష సాయంతో పాటు తులం బంగారం.. ఇవేవీ ఇవ్వకున్నా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓటేస్తే ఆ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసే మోసాలను అంగీకరించినట్లు అవుతుందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Published : 01 Apr 2024 05:00 IST

జిల్లాలను కుదించేందుకు కుట్ర
భాజపాతో భవిష్యత్తు ఉండదు
కామారెడ్డి భారాస కార్యకర్తల సమావేశంలో హరీశ్‌రావు

కామారెడ్డి అర్బన్‌, లింగంపేట, న్యూస్‌టుడే: రైతులకు రూ.15 వేల రైతుభరోసా, పంటకు రూ.500 బోనస్‌, రూ.2 లక్షల రుణమాఫీ, ఆసరా పింఛను రూ.4,000కు పెంపు, దివ్యాంగులకు రూ.6,000, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు రూ.లక్ష సాయంతో పాటు తులం బంగారం.. ఇవేవీ ఇవ్వకున్నా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓటేస్తే ఆ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసే మోసాలను అంగీకరించినట్లు అవుతుందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. భాజపావన్నీ అబద్ధాలేనని, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటేస్తే భవిష్యత్తు ఉండదని వ్యాఖ్యానించారు. జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కామారెడ్డిలో ఆదివారం నిర్వహించిన భారాస కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 33 జిల్లాలను 17కు కుదిస్తానని చెబుతున్నారు. కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్‌ వాటిని కుదించే కుట్ర చేస్తోంది. లీకులు, ఫేక్‌ వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. వంద రోజుల ఈ ప్రభుత్వ పాలనలో ఇప్పటికే 200 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకోగా, 38 మంది ఆటో కార్మికులు ప్రాణాలు విడిచారు. ఎన్నికల ముంగిట భాజపా ఇంధన ధరలను రూ.2 తగ్గించి ప్రజలను మోసం చేస్తోంది. రాముడు అందరివాడు. కానీ ఆ పార్టీ మాత్రం దేవుడి పేరుమీద రాజకీయం చేస్తోంది. ఎంపీ బీబీపాటిల్‌ భారాసకు ద్రోహం చేసి భాజపాలో చేరారు. ఆయనకు ఓటుతోనే ప్రజలు బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అయిదేళ్లకు మించి ఎక్కడా అధికారంలో లేదు. రాష్ట్రంలో తిరిగి భారాస ప్రభుత్వం వస్తుంది. జహీరాబాద్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం’’ అని కార్యకర్తలకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్‌, హన్మంత్‌షిండే, జాజాల సురేందర్‌, జనార్దన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం లింగంపేట మండలం లింగంపల్లి శివారులో ఎండిన వరి పొలాలను ఆయా నేతలతో కలిసి హరీశ్‌రావు పరిశీలించారు. కాంగ్రెస్‌తో కరవు వచ్చిందని, ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని