అరుణాచల్‌ అసెంబ్లీ బరిలో 133 మంది

అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో 133 మంది నిలిచారు. మొత్తం 60 స్థానాల్లో 10 ఏకగ్రీవం కాగా మిగిలిన 50 చోట్ల పోటీ నెలకొంది.

Updated : 01 Apr 2024 06:01 IST

50 నియోజకవర్గాల్లో పోటీ
మిగిలిన 10 ఏకగ్రీవం

ఈటానగర్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో 133 మంది నిలిచారు. మొత్తం 60 స్థానాల్లో 10 ఏకగ్రీవం కాగా మిగిలిన 50 చోట్ల పోటీ నెలకొంది. తొలి విడతలో భాగంగా ఇక్కడ ఏప్రిల్‌ 19వ తేదీన పోలింగ్‌ జరగనుంది. ఏకగ్రీవంగా ఎన్నికైన 10 స్థానాలను భాజపా కైవసం చేసుకుంది. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ముఖ్యమంత్రి పెమా ఖండూ సహా తొలిసారిగా ఎమ్మెల్యేలైన రాటు టెకీ, హేజ్‌ అప్పా ఉన్నారు. మిగిలిన 50 స్థానాల్లో భాజపా అభ్యర్థులను నిలిపింది. కాంగ్రెస్‌ కేవలం 19 సీట్లలోనే పోటీ చేస్తోంది. మేఘాలయకు చెందిన ఎన్‌పీపీ 20 చోట్ల బరిలో నిలిచింది. ఎన్సీపీ 14 చోట్ల పోటీ చేస్తోంది. పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌ (పీపీఏ) 11 చోట్ల బరిలో నిలిచింది. అరుణాచల్‌ డెమోక్రటిక్‌ పార్టీ నాలుగు సీట్లలో పోటీ చేస్తోంది. లోక్‌ జన్‌శక్తి పార్టీ ఒకచోట బరిలో నిలిచింది. 14 మంది స్వతంత్రులు పోటీ చేస్తున్నారు.

లోక్‌సభ బరిలో 14 మంది

రాష్ట్రంలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో 14 మంది పోటీ పడుతున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ పోలింగ్‌ 19వ తేదీన జరగనుంది. అరుణాచల్‌ వెస్ట్‌లో 8 మంది, ఈస్ట్‌లో ఆరుగురు బరిలో ఉన్నారు.

 • పోటీలో నిలిచిన అభ్యర్థుల్లో 80 మంది కొత్తవారే.
 • కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న 19 మందిలో 17 మంది తొలిసారి బరిలో దిగుతున్నవారే.
 • భాజపా 14 మంది కొత్తవారికి అవకాశమిచ్చింది.
 • ఎన్‌పీపీ 16 మంది కొంత వారిని బరిలో దింపింది.
 • అరుణాచల్‌ చరిత్రలోనే అత్యధికంగా ఈసారి 8 మంది మహిళలు పోటీ చేస్తున్నారు.
 • భాజపా తరఫున నలుగురు మహిళలు పోటీ చేస్తున్నారు.
 • కాంగ్రెస్‌ ముగ్గురు మహిళలకు టికెట్లిచ్చింది.

8.8లక్షల మంది ఓటర్లు

అరుణాచల్‌ ప్రదేశ్‌లో 8,86,848 మంది ఓటర్లున్నారు. 2,226 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 228 పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది కాలినడకనే వెళ్లాల్సి ఉంటుంది.

 • 480 పోలింగ్‌ కేంద్రాలకు మొబైల్‌, ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సరిగా ఉండదు.
 • 588 కేంద్రాలు క్లిష్టమైనవి. అందులో 443 కేంద్రాలు ప్రమాదకరమైనవి.
 • లాంగ్‌డింగ్‌లోని పుమావో ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రంలో అత్యధికంగా 1,462 మంది ఓటర్లున్నారు.
 • మాలోగామ్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఒకే ఓటరు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని