ప్రజల కోసమే ఒంటరి పోరాటం చేస్తున్నా: ఎంపీ రఘురామ

సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. రానున్న ఎన్నికలు జగన్‌మోహన్‌రెడ్డి కావాలా.. వద్దా.. అనే అంశం కోసమే జరగనున్నాయని అన్నారు.

Updated : 02 Apr 2024 08:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. రానున్న ఎన్నికలు జగన్‌మోహన్‌రెడ్డి కావాలా.. వద్దా.. అనే అంశం కోసమే జరగనున్నాయని అన్నారు. సోమవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌మోహన్‌రెడ్డిపై మోపిన 11 ఛార్జిషీట్‌లలో 3,000కు పైగా వాయిదాలు కోరితే, సీబీఐ న్యాయస్థానం అనుమతించిందని తెలిపారు. వేలసార్లు వాయిదాలు కోరిన వ్యక్తికి సంబంధించిన కేసుల విచారణ అతీగతీ లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్రం నుంచి ఏ ఒక్కరూ స్పందించకపోయినా తాను కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశానని తెలిపారు. అందుకే జగన్‌ తనను లేపేసే ప్రయత్నం చేశారని, అయినా వెంకటేశ్వరస్వామి దయ వల్ల బతికి బయటపడ్డానని తెలిపారు.

రాష్ట్రానికి జగన్‌ పాలన నుంచి విముక్తి కోసం ఎవరెంత కృషి చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు. 50 లక్షలమంది కార్యకర్తలున్న పార్టీలు కృషి చేయడం అభినందనీయమేనని పేర్కొంటూనే, నియంతను.. నువ్వెంత అని ప్రశ్నించి.. ప్రాణాలకు తెగించి ఒంటరి పోరాటం చేయడం ఎంత కష్టమో ప్రజలు ఆలోచించాలని చెప్పారు. ‘మా నాన్నమ్మ చనిపోతే నా సొంత ఊరుకు కూడా వెళ్లలేని దుస్థితిని కల్పించారు. ప్రజల కోసం అన్నీ ఓర్చుకున్నాను. సొంత నియోజకవర్గంలో ప్రధానమంత్రి పర్యటిస్తుండగా  జిల్లా కలెక్టర్‌ అతిథుల జాబితాలో నా పేరును చేర్చితే, జగన్‌రెడ్డి ప్రధాని కార్యాలయానికి నేరుగా ఫోన్‌ చేసి నా పేరును తొలగింపజేశారు. ఇటువంటి ప్రోటోకాల్‌ ఉల్లంఘన దేశంలో మరెక్కడా జరగలేదు’ అని రఘురామ తెలిపారు.

కూటమి కోసమే కృషి చేశా

కూటమిలో భాజపా కూడా కలవాలనే ఉద్దేశంతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బాహాటంగా కృషి చేస్తే, ఇదే విషయమై ఎవరికీ తెలియకుండా తాను ఎన్నో రోజులు దిల్లీలో గడిపానన్నారు. జగన్‌ ఎన్ని అరాచకాలకు, అక్రమాలకు పాల్పడినా తాను ఆయనకు ఎదురు నిలిచి పోరాటం చేశానని గుర్తు చేశారు. కొద్దిపాటి సమాచార లోపం వల్ల తనకు సీటు దక్కలేదని భావిస్తున్నానన్నారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తప్పకుండా న్యాయం చేస్తారనే పరిపూర్ణమైన విశ్వాసం ఉందని ఆయన తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో తప్పకుండా నాకు న్యాయం జరుగుతుందని విశ్వాసం ఉందని వెల్లడించారు. చంద్రబాబును ఉద్దేశించి ముసలోడు అంటూ జగన్‌ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన ఎండలో రోజుకు మూడు బహిరంగ సభలకు హాజరవుతుంటే, ఏసీ బస్సులో ప్రయాణిస్తూ, ప్రసంగించే సమయంలో అటువైపు, ఇటువైపు కూలర్లను పెట్టుకొని ఒక్క సభలో పాల్గొనే జగన్‌మోహన్‌రెడ్డి యువకుడా? అంటూ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని