రాష్ట్రంలో కరవుకు కారణం కేసీఆరే: కూనంనేని

ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న కరవు పరిస్థితులకు, కృష్ణా బేసిన్‌ ఎండిపోవడానికి మాజీ సీఎం కేసీఆరే కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.

Published : 02 Apr 2024 03:56 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న కరవు పరిస్థితులకు, కృష్ణా బేసిన్‌ ఎండిపోవడానికి మాజీ సీఎం కేసీఆరే కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. పంట నష్టానికి రూ.25 వేల పరిహారం డిమాండు చేస్తున్న కేసీఆర్‌ ఆయన ప్రభుత్వ హయాంలో ఎంత ఇచ్చారో ప్రజలకు చెప్పాలన్నారు. సోమవారం హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని మగ్దూం భవన్‌లో ఆయన మాట్లాడారు. ‘కరవు, వరదలు, నష్టం ప్రకృతిపై ఆధారపడి ఉంటాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం కరవు తెచ్చిందని చెప్పడం విడ్డూరంగా ఉంది. 2014- 2018 వరకు పూర్తిస్థాయి కరవుతో రూ.6 వేల కోట్లకుపైగా పంట నష్టం జరిగింది. 2017లో వరదలతో 12 లక్షల ఎకరాల వానాకాలం పంట, 5 లక్షల ఎకరాల యాసంగి పంటలను రైతులు నష్టపోయారు. ప్రస్తుతం అన్ని రకాల పంటలు కలిపి 10 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది. జూన్‌ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు కృష్ణా బేసిన్‌లో 1033 మి.మీ. వర్షం మాత్రమే పడటం.. జురాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు పై నుంచి చుక్క నీరు రాకపోవడంతో ప్రస్తుతం ఎండిపోయింది’ అని తెలిపారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని