ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇవ్వాలి

రాష్ట్రంలో అధికార యంత్రాంగమే ఇంటింటికీ వెళ్లి సామాజిక పింఛన్లు పంపిణీ చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ డిమాండ్‌ చేశారు.

Updated : 02 Apr 2024 06:18 IST

జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అధికార యంత్రాంగమే ఇంటింటికీ వెళ్లి సామాజిక పింఛన్లు పంపిణీ చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. ‘పింఛన్ల పంపిణీపై జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విపక్షాలపై దుష్ప్రచారం చేస్తోంది. ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లో వాలంటీర్లను వినియోగించవద్దని మాత్రమే చెప్పింది. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడాన్ని నిలిపి వేయమని ఎక్కడా చెప్పలేదు. ప్రభుత్వ విభాగాల్లో లక్షల మంది అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి నగదు అందజేయాలి. ఈ నెల 3వ తేదీలోగా పంపిణీ పూర్తి చేయాలి. లేకుంటే ఆందోళనలు చేపడతాం’ అని మనోహర్‌ స్పష్టం చేశారు.

3న తెనాలికి పవన్‌కల్యాణ్‌: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 3న తమ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ తెనాలి రానున్నారని నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. సాయంత్రం 4 గంటలకు వారాహి రోడ్‌షో, 6 గంటలకు బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని