5న జిల్లా కేంద్రాల్లో రైతు సత్యాగ్రహం

రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భాజపా కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 5న అన్ని జిల్లా కేంద్రాల్లో చేపట్టనున్న రైతు సత్యాగ్రహం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Published : 02 Apr 2024 03:58 IST

హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌పై అన్నదాతల్లో ఆగ్రహం
కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భాజపా కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 5న అన్ని జిల్లా కేంద్రాల్లో చేపట్టనున్న రైతు సత్యాగ్రహం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పదాధికారులు, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసనసభ ఎన్నికల్లో అనేక వాగ్దానాలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భాజపా అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేందుకు కిసాన్‌ మోర్చా శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో భాజపా జాతీయ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్‌ తివారి, జి.ప్రేమేందర్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అందరి సంక్షేమమే లక్ష్యంగా మోదీ పదేళ్ల పాలన

పదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనలో అన్ని వర్గాల సంక్షేమంతోపాటు దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన జరిగిందని జి.కిషన్‌రెడ్డి అన్నారు. ‘సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌’ను ఆచరణలో చూపడం ద్వారా మారుమూల ప్రాంతంలోని ప్రతి లబ్ధిదారుడికి కూడా ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయని చెప్పారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర నేతలు కాసం వెంకటేశ్వర్లు, రాంచందర్‌రావు, సుభాష్‌ ఇతర నేతలతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 60 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో వందకోట్ల మందికిపైగా ప్రజలు అనేక సౌకర్యాలకు దూరమయ్యారని, 2014 వరకు దేశంలో పాలనాపరమైన వైఫల్యం కొనసాగిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో పదేళ్లలో దేశం గణనీయమైన ప్రగతి సాధించిందని చెప్పారు. భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చారని, మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా రూపుదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. ట్రిపుల్‌ తలాక్‌ రద్దు, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, రామమందిర నిర్మాణం,   గంగా ప్రక్షాళన సహా అనే చరిత్రాత్మక నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుందని కిషన్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని