కేసీఆర్‌లో మొదలైన భయం

గతంలో ఉన్న టీఆర్‌ఎస్‌.. బీఆర్‌ఎస్‌గా మారి ఇప్పుడు వీఆర్‌ఎస్‌(స్వచ్ఛంద పదవీ విరమణ)కు వచ్చిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

Published : 02 Apr 2024 03:59 IST

అందుకే అబద్ధాలు చెబుతున్నారు
నీటిపారుదల రంగాన్ని నాశనం చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: గతంలో ఉన్న టీఆర్‌ఎస్‌.. బీఆర్‌ఎస్‌గా మారి ఇప్పుడు వీఆర్‌ఎస్‌(స్వచ్ఛంద పదవీ విరమణ)కు వచ్చిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటూ గెలవలేదని, అందుకే కేసీఆర్‌ మానసిక ఒత్తిడితో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. సోమవారం గాంధీభవన్‌లో ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌, మీడియా కమిటీ ఛైర్మన్‌ సామ రాంమోహన్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ‘భారాస పాలనలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పెద్ద పెద్ద నేతలు జైలుకు పోతారు. ఈ లోక్‌సభ ఎన్నికల తరవాత భారాస పార్టీ మిగలదనే భయం కేసీఆర్‌లో మొదలైంది. 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆరోపించారు. అది నిజం కాదు. భారాస నుంచి 200 మంది కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఆదివారం సూర్యాపేటలో కేసీఆర్‌ మాట్లాడిన ప్రతి మాటా అబద్ధమే. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు తప్ప భారాసలో ఎవరూ మిగలరు. సూర్యాపేటలో జనరేటర్‌ పెట్టుకొని సమావేశం పెట్టి, సాంకేతిక సమస్య ఏర్పడితే కరెంట్‌ పోయిందని కేసీఆర్‌ అబద్ధం చెప్పారు. జగన్‌తో దోస్తీ కట్టి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలపై కుట్ర చేశారు.

నీటిపారుదల రంగాన్ని సర్వనాశనం చేశారు...

కమీషన్ల కక్కుర్తి, అనాలోచిత విధానాలతో రాష్ట్రంలో నీటిపారుదల రంగాన్ని సర్వనాశనం చేసిందే కేసీఆర్‌. ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలి. గత అక్టోబరులో భారాస పాలనలోనే మేడిగడ్డ రిజర్వాయర్‌ నుంచి నీటిని సముద్రంలోకి వదిలేశారు. ఇప్పుడు నీరు ఇవ్వడం లేదని కేసీఆర్‌ మాట్లాడటం సిగ్గుచేటు. ఈ పెద్దమనిషి గతంలో సీఎంగా ఉన్నప్పుడు కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తామని ఒప్పుకొన్నారు. మేం అధికారంలోకి వచ్చాక  అప్పగించేది లేదని శాసనసభలో తీర్మానం చేశాం. 2023 జులై 2న అప్పటి సీఎం కేసీఆర్‌ సమీక్ష జరిపి గోదావరి, కృష్ణాలో నీళ్లు లేనందున పంటలకు సరఫరా తగ్గించి తాగునీటికే ఇవ్వాలని అధికారులకు చెప్పారు. ఇప్పుడు పంటలకు నీరివ్వడం లేదని విమర్శిస్తున్నారు. మిషన్‌ భగీరథ కోసం రూ.42 వేల కోట్ల అప్పులు తెచ్చి 99.9 శాతం ఇళ్లకు నల్లాలు బిగించి నీరిస్తున్నామని అప్పటి భారాస ప్రభుత్వం తెలిపింది. అది నిజమే అయితే ఇప్పుడు తాగునీటి ఎద్దడి ఎందుకు ఉంటుంది?

నాడు ఎన్టీపీసీకి సహకరించలేదు

రామగుండంలో తెలంగాణ కోసం ప్రత్యేకంగా 2,400 మెగావాట్ల ప్లాంటు నిర్మిస్తామని గత భారాస ప్రభుత్వాన్ని అడిగితే భూమి, నీరు ఇవ్వకుండా సతాయించిందని ఎన్టీపీసీ ఛైర్మన్‌ గురుదీప్‌ స్వయంగా పార్లమెంటరీ కమిటీకి చెప్పారు. కేసీఆర్‌ సహకరించి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా ఎన్టీపీసీ 2,400 మెగావాట్ల ప్లాంటు నిర్మించి రాష్ట్రానికి కరెంటు ఇచ్చేది. దాన్ని వదిలేసి కాలంచెల్లిన పరిజ్ఞానంతో భద్రాద్రి ప్లాంటును కేసీఆర్‌ నిర్మించారు. యాదాద్రి ప్లాంటు నిర్మాణ వ్యయం 3, 4 రెట్లు పెరిగింది. దీనివల్ల అక్కడ ఉత్పత్తయ్యే కరెంటు భారం రాష్ట్ర ప్రజలపై పడనుంది. రాష్ట్రంలో ఈ యాసంగి వడ్లు కొనడానికి 7,149 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నాం. ఏ వ్యాపారి అయినా మద్దతుధరకన్నా ఒక్క రూపాయి తక్కువ ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటాం. పంటల బీమా పథకం అమల్లో లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్రం గతంలో పార్లమెంట్‌లో చెప్పింది. ఇప్పుడు పంటలు పాడయ్యాయని పరిహారం ఇవ్వలేదనడానికి కేసీఆర్‌ సిగ్గుపడాలి. కేసీఆర్‌ గత పదేళ్లలో వరదలు, వడగళ్లతో పంటలు దెబ్బతింటే ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదని రైతులు గమనించాలి’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని