అమరావతి,అభివృద్ధిపై దిమ్మ తిరిగే ప్రశ్నలు.. జవాబు చెప్పలేక వైకాపా నేతల ఉక్కిరిబిక్కిరి

రాజధాని అమరావతి విధ్వంసంతో జరిగిన నష్టం, గత అయిదేళ్లలో రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రాకపోవడం, అభివృద్ధి లేక ఉపాధి కరవై యువత వలస పోవడంపై ప్రజల నుంచి తూటాల్లా వస్తున్న ప్రశ్నలు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైకాపా నాయకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

Updated : 02 Apr 2024 07:41 IST

ఐటీ కంపెనీలు, పరిశ్రమలు రావట.. అమరావతి వాటికి అనుకూలం కాదట!
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అతి తెలివి సమాధానం

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి విధ్వంసంతో జరిగిన నష్టం, గత అయిదేళ్లలో రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రాకపోవడం, అభివృద్ధి లేక ఉపాధి కరవై యువత వలస పోవడంపై ప్రజల నుంచి తూటాల్లా వస్తున్న ప్రశ్నలు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైకాపా నాయకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో రాజధాని అంశం తమపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైకాపా అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని అపార్ట్‌మెంట్ల నివాసితులతో ఆత్మీయ సమావేశాల పేరుతో స్థానిక వైకాపా అభ్యర్థి లావణ్యతో పాటు ఎన్నికల ప్రచారానికి వెళుతున్న ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇలాంటి అనుభవమే ఎదురవుతోంది. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లో తాజాగా నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో అక్కడివారు అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే ఆర్కే నీళ్లు నమిలారు. ఒకపక్క తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్‌ అపార్ట్‌మెంట్‌వాసులతో ఆత్మీయ సమావేశాల్లో.. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక మంగళగిరిని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని, ఈ ప్రాంతాన్ని మరో గచ్చిబౌలిలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తాను మంత్రిగా ఉండగా ఇక్కడికి తెచ్చిన ఐటీ పరిశ్రమల్ని వైకాపా ప్రభుత్వం తరిమికొట్టిందని, తాము మళ్లీ అధికారంలోకి రాగానే ఈ ప్రాంతానికి ఐటీ కంపెనీల్ని తెస్తామని చెప్పారు.

చదరపు అడుగు ధర రూ.5,500 నుంచి రూ.3,500కి పడిపోయింది

‘మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే ప్రభుత్వ కార్యాలయాలన్నీ విశాఖకు వెళ్లిపోతాయి. ఈ ప్రాంత అభివృద్ధి పూర్తిగా ఆగిపోతుంది. భూముల విలువలు పడిపోతాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇక్కడ అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి భూములిచ్చిన రైతులు తమ వాటాగా వచ్చిన ఫ్లాట్లను చ.అడుగు రూ.5,500కి అమ్ముకునేవాళ్లు. వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేశాక ధరలు పడిపోయాయి. ఇప్పుడు రూ.3,500కి కూడా కొనేవాళ్లు లేరు. మా ఇళ్లలో అభిమానంతో రాజశేఖర్‌రెడ్డి ఫొటోలు పెట్టుకున్నాం. లోపల బాధ ఉన్నా... వైకాపా జెండా పట్టుకుని, డబ్బులు ఖర్చుపెట్టుకుని తిరుగుతున్నాం. ప్రజల్లో చాలా బాధ ఉంది. ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులపై పడుతుంది’ అని తాడేపల్లికి సమీపంలో జాతీయ రహదారి పక్కనున్న ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో ఆదివారం ఉదయం లావణ్య, ఆర్కే తదితరులు నిర్వహించిన సమావేశంలో వైకాపా మద్దతుదారు ఒకరు కుండబద్దలు కొట్టారు.

నిర్మాణ వ్యయం ఎక్కువని పరిశ్రమలు రావడం లేదట!

‘ఈ అయిదేళ్లలో ఈ ప్రాంతానికి ఒక్క ఐటీ కంపెనీ రాలేదు. నేను హైదరాబాద్‌ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఐటీ ఉద్యోగాల్లేకపోవడంతో మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లిపోవాలనుకుంటున్నాను. మీరు మళ్లీ అధికారంలోకి వస్తే ఈ ప్రాంతానికి ఏం చేస్తారు? పరిశ్రమలు, పెట్టుబడులు తేవడానికి మీ దగ్గరున్న ప్రణాళికలేంటి?’ అని అదే సమావేశంలో ఒక యువతి ప్రశ్నించారు. అది తనకు తెలియదని ఆర్కే జవాబిచ్చారు. ‘మనం తీర ప్రాంతంలో, తుపానులు వచ్చే ప్రదేశంలో ఉన్నాం. ఇవన్నీ సారవంతమైన భూములు. ఇక్కడ పునాదులు లోతుగా వెయ్యాలి. నిర్మాణ వ్యయం ఎక్కువని పరిశ్రమల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రావట్లేదు. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెడితే ఎక్కువ ప్రోత్సాహకాలు వస్తాయి. అందుకే రాయలసీమ, విశాఖల్లో వచ్చాయి. పైగా ఈ ప్రాంతంతో పోలిస్తే విశాఖ నుంచి హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులకు కనెక్టివిటీ ఎక్కువ. ఐటీ రంగంలో హైదరాబాద్‌ బాగా అభివృద్ధి చెందాక బెంగళూరు కూడా ఇబ్బంది పడుతోంది. అయినా ఐటీలో ఇప్పుడు ఉద్యోగాల్లేవు. మనది వ్యవసాయ జోన్‌. ఇక్కడ చిన్న చిన్న పరిశ్రమలు వస్తాయేమోగానీ, పెద్ద పరిశ్రమలు రావు’ అని ఆర్కే చెప్పిన సమాధానంతో అక్కడున్నవారికి నోటమాట రాలేదు. తెదేపా ప్రభుత్వం చొరవతో అమరావతిలో 68 ఐటీ కంపెనీలు వచ్చాయి. హెచ్‌సీఎల్‌ వంటి ఐటీ దిగ్గజం విజయవాడకు వచ్చింది. మేధాటవర్స్‌, మంగళగిరి ప్రాంతంలో అనేక స్టార్టప్‌ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయి. పైకేర్‌ వంటి కంపెనీలు వందల్లో నియామకాలు చేపట్టాయి. రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే.. మరిన్ని ఐటీ కంపెనీలు వచ్చేవి. అలాంటిది ఇక్కడికి ఐటీ కంపెనీలే రావని ఆర్కే చెప్పడంతో ఏమనాలో వారికి అర్థం కాలేదు. విజయవాడ కన్నా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులకు విశాఖ ఏ విధంగా దగ్గర? విజయవాడ నుంచి విశాఖకు కనెక్టివిటీ లేకపోవడమేంటి? నిర్మాణం వ్యయం చుక్కలను తాకే ముంబయి, బెంగళూరులకే పరిశ్రమలు వచ్చినప్పుడు ఇక్కడికి  ఎందుకు రావని సమావేశానికి వచ్చినవారు ఆగ్రహంగా వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని