రైతులకు పరిహారం అందించే వరకూ పోరాటం

కేసీఆర్‌ను బద్నాం చేయాలనే.. గోదావరి నీళ్లను ఎత్తిపోయడం లేదని, రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించే వరకు పోరాటం చేస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.

Published : 02 Apr 2024 04:00 IST

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: కేసీఆర్‌ను బద్నాం చేయాలనే.. గోదావరి నీళ్లను ఎత్తిపోయడం లేదని, రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించే వరకు పోరాటం చేస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పాలనలో బీడుపడిన తెలంగాణను పచ్చబడేలా చేసింది కేసీఆర్‌ అని, రైతులకు ఊపిరి పోసింది ఎవరో గ్రామాలకు వెళ్తే చెప్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ రైతులను పట్టించుకోకుండా.. ఇతర పార్టీల నాయకులకు కండువాలు కప్పే పనిలో ఉందన్నారు. ‘‘ప్రకృతి విపత్తును రాజకీయం చేస్తున్నారని మంత్రి తుమ్మల అంటున్నారు. మరి ప్రకృతి విపత్తుతోనే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగాయన్న విషయం తెలియదా?’’ అని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు.

రైతుల కష్టాలపై దృష్టి పెట్టాలి: వి.శ్రీనివాస్‌గౌడ్‌

గత భారాస ప్రభుత్వంపై నిందలు వేయడం మాని.. రైతుల కష్టాలపై సర్కారు దృష్టి పెట్టాలని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఎండిన పొలాల పరిశీలనకు కేసీఆర్‌ అడుగుపెట్టగానే.. కాంగ్రెస్‌ నేతలు ఎందుకు  ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. నీళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వ వైఫల్యంతో ఇవ్వడం లేదని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

మాదిగల ద్రోహుల పార్టీ కాంగ్రెస్‌: రసమయి

కాంగ్రెస్‌ మాదిగల ద్రోహుల పార్టీ అని,  మాదిగలకు ఎంపీ సీటు ఇవ్వకపోతే చావు డప్పు కొడతామని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ హెచ్చరించారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో పాటకు చరిత్ర లేదని ఎంపీ కేశవరావు అంటున్నారు. చరిత్ర లేకపోతే జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ఎలా తీసుకున్నారు? ఓట్ల కోసం గద్దర్‌ అన్నను వాడుకున్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది.’’ అని ఆయన అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని