జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్‌

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో పలువురు కీలక నేతలు సోమవారం జనసేన పార్టీలో చేరారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమారపురంలో ఈ చేరికలు చోటుచేసుకున్నాయి.

Published : 02 Apr 2024 04:05 IST

నిమ్మక జయకృష్ణ, మరికొందరు కూడా

 

ఈనాడు, కాకినాడ: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో పలువురు కీలక నేతలు సోమవారం జనసేన పార్టీలో చేరారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమారపురంలో ఈ చేరికలు చోటుచేసుకున్నాయి. అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన తెదేపా నేత, మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌, ఆయన అనుచరులు.. పాలకొండ నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ, రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లె సర్పంచి అరవ శ్రీధర్‌, అనుచరులు జనసేనలో చేరారు. వీరందరికీ పవన్‌ కల్యాణ్‌ కండువాలు కప్పి ఆహ్వానించారు. నాయకులు మండలి రాజేష్‌, తాతంశెట్టి నాగేంద్ర, డాక్టర్‌ గౌతమ్‌, గర్భాన సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఐదేళ్లలో వ్యవస్థలన్నీ సర్వనాశనం: బుద్ధప్రసాద్‌

రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో జరగని అరాచకమంటూ లేదు. వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయి. రూ.వేల కోట్ల విలువైన వనరులను దోపిడీ చేశారు. ఎక్కడా అభివృద్ధి లేదు. నిరుద్యోగం పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గట్టెక్కించాలని కూటమిగా ఏర్పడి పోటీ చేయాలని నిర్ణయించారు. అంధకారమయమైన ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులు నింపడానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెదేపాకు మద్దతు ప్రకటించి, భాజపానూ కూటమిలో కలపడానికి కృషిచేశారు. ఆయన నాకు సుపరిచితులు. తెలుగు భాషా పరిరక్షణకు చేస్తున్న కృషికి వెన్నుదన్నుగా నిలిచారు. పవన్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. అవనిగడ్డ జనసేనకు కేటాయించడంతో నన్ను నిలబడాలని కోరారు. తెదేపా అధినేత చంద్రబాబు మా నిర్ణయాన్ని స్వాగతించారు. రాష్ట్రం బాగుపడాలనేదే మా అందరి కోరిక. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిపాలన ఎప్పుడూ చూడలేదు. రాష్ట్రంలో సామాన్యుడు భయంతో బతికే పరిస్థితి ఉంది. ఈ స్థితిలో ప్రజలకు ధైర్యం చెప్పే నాయకులు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మాత్రమే.

గిరిజన ప్రాంతాలకు అన్యాయం: నిమ్మక జయకృష్ణ

జగన్‌ పాలనలో గిరిజన ప్రాంతాలు పూర్తిగా వెనకబడ్డాయి. గిరిజనులకు అన్యాయం జరిగింది. కనీస అభివృద్ధి లేకపోవడానికి జగన్‌, వైకాపా ఎమ్మెల్యేలే కారణం. పాలకొండ ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ విక్రాంత్‌ భూకబ్జాలు, ఇసుక దందాలకు పాల్పడుతున్నారు. వైకాపా పెద్దల అండదండలతో మైనింగ్‌ మాఫియా రెచ్చిపోతోంది. పవన్‌ ఆదేశిస్తే పాలకొండ నుంచి పోటీ చేస్తా. కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని