లోక్‌సభ ఎన్నికల కోసమే నీటి రాజకీయాలు

లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసమే భారాస నాయకులు నీటి రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు.

Published : 02 Apr 2024 04:06 IST

భారాసపై మంత్రి శ్రీధర్‌బాబు ధ్వజం

పెద్దపల్లి, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసమే భారాస నాయకులు నీటి రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. కాలువల్లేని ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పంటల పరిశీలన చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. పెద్దపల్లిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘రైతుల సమస్యలపై మొసలికన్నీరు కారుస్తున్న కేసీఆర్‌ తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో వారి సమస్యలను పరిష్కరించేందుకు ఎందుకు క్షేత్ర పర్యటనలు చేయలేదు? తొమ్మిదేళ్ల భారాస పాలనలో రైతులకు పంట నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలే లేవు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయలేని ఆయనకు వారి సమస్యలపై మాట్లాడే నైతిక హక్కులేదు. గత ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షాలు సరిగా కురవకపోవడంతో నీటి ఎద్దడి ఏర్పడింది. భారాస ప్రభుత్వం అప్పుడే ఎందుకు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయలేదు? మంథని నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలను అటకెక్కించారు. రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాలకు నీరందించడంలో విఫలమయ్యారు. రాబోయే రోజుల్లో పత్తిపాక జలాశయం, పాలకుర్తి ఎత్తిపోతల పథకాలను మా ప్రభుత్వం నిర్మించి తీరుతుంది. మన నీళ్లు, నిధులు, నియామకాలను భారాస నాయకులు కొల్లగొట్టారు. భారాస పాలనలో జరిగిన తప్పులకు ప్రజలకు సమాధానం చెప్పుకోలేకే వరంగల్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి మా పార్టీలో చేరారు. ప్రస్తుతం పంటల రక్షణకు మా ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఎస్సారెస్పీ నీటిని అందిస్తుంది’’ అని శ్రీధర్‌బాబు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని