చేసినవి ప్రజలకు చెప్పుకోలేకే ఓడిపోయాం

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కేసీఆర్‌ది, ప్రజలది తప్పు కాదని.. భారాస పాలనలో చేసిన పనులను ప్రజలకు చెప్పుకోవడంలో విఫలం కావడం వల్లే ఓటమి పాలయ్యామని మాజీ మంత్రి, భారాస నేత కేటీఆర్‌ అన్నారు.

Updated : 02 Apr 2024 06:04 IST

నల్గొండ, ఖమ్మం నాయకులతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రమాదం
మాజీ మంత్రి కేటీఆర్‌

ఈనాడు, నల్గొండ: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కేసీఆర్‌ది, ప్రజలది తప్పు కాదని.. భారాస పాలనలో చేసిన పనులను ప్రజలకు చెప్పుకోవడంలో విఫలం కావడం వల్లే ఓటమి పాలయ్యామని మాజీ మంత్రి, భారాస నేత కేటీఆర్‌ అన్నారు. 2018 ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండలో భారాస 10 స్థానాల్లో గెలిచినా.. లోక్‌సభ ఎన్నికల్లో రెండు ఎంపీ స్థానాలనూ కాంగ్రెస్‌ కైవసం చేసుకుందని.. ఇప్పుడూ 11 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ గెలిచినా రెండు ఎంపీ సీట్లలో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నల్గొండలో సోమవారం నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  ‘‘కాంగ్రెస్‌లోనే ఏక్‌నాథ్‌ శిందేలు ఉన్నారని భాజపా నాయకులు చెబుతున్నారు. నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన ఆ పార్టీ నాయకుల నుంచే ప్రభుత్వానికి ప్రమాదం ఉంది తప్ప సర్కారును పడగొట్టాలనే ఆలోచన మాకు లేదు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు ఉండి.. ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలి. ముఖ్యమంత్రి, మంత్రులకు ఎవర్ని ఎప్పుడు పార్టీలో చేర్చుకుందామనే ఆలోచన తప్ప... రైతుల కష్టాలు పట్టడం లేదు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. కానీ, 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకొంటున్నారు. నోటిఫికేషన్‌ ఇవ్వకుండా ఉద్యోగాలు ఇవ్వడం ఎలా సాధ్యం? చిన్న, చిన్న కారణాలతోనే పార్టీకి నష్టం జరిగింది. వంద రోజుల్లోనే మోసపోయామని ప్రజలు తెలుసుకుంటున్నారు. డిసెంబరు 9న రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. రుణమాఫీ పొందినవారు కాంగ్రెస్‌కు ఓటేయండి. రుణమాఫీ రానివారు భారాసని గెలిపించండి. కాలం తెచ్చిన కరవని వ్యవసాయశాఖ మంత్రి అంటున్నారు.

ఇది ముమ్మాటికీ కాంగ్రెస్‌ తెచ్చిన కరవే. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని బద్నాం చేశారు. కేసీఆర్‌ పర్యటనకు వస్తున్నారని తెలిసి గాయత్రి పంప్‌హౌస్‌ నుంచి నీళ్లు వదిలారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నీళ్లుండీ రైతులను మోసం చేసినందుకు కాంగ్రెస్‌ నాయకులు క్షమాపణ చెప్పాలి. మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలి’’ అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు. ‘‘వంద రోజుల్లో రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ నాశనం చేసింది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఫోన్‌ ట్యాపింగ్‌ అంటూ డ్రామాలు ఆడుతున్నారు. ఒకరిద్దరు పార్టీలో నుంచి వెళ్లిపోతే నష్టమేం లేదు. నీళ్ల సమస్యపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదు? కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సాగర్‌కు వెళ్లి ఎందుకు నీళ్లు తీసుకురావడం లేదు? ప్రజలు నిలదీస్తారన్న భయంతోనే మంత్రులు ప్రజల్లోకి వెళ్లడం లేదు’’ అని జగదీశ్‌రెడ్డి అన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, పార్టీ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతుకు రూ.లక్ష ఆర్థిక సాయం

నల్గొండ గ్రామీణ మండలం ముషంపల్లిలో పంట ఎండిపోయిన రైతులు గన్నెబోయిన మల్లయ్య, బోర్ల రాంరెడ్డిని కేటీఆర్‌ పరామర్శించారు. పంట ఎండిపోయిందని, కేసీఆర్‌ ఆదుకోవాలంటూ మల్లయ్య చేసిన విన్నపం వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఆయనకు కేటీఆర్‌ ధైర్యం చెప్పారు. పార్టీపరంగా రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని