నన్ను.. నా సిబ్బందినీ బ్లేడ్లతో కోస్తున్నారు!

‘పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలందర్నీ కలవాలన్నది నా కోరిక. ఇక్కడున్న రెండు లక్షల పైచిలుకు జనాభాలో ప్రతి ఒక్కరితో ఫోటో తీయించుకోవాలనుకుంటున్నాను.

Updated : 02 Apr 2024 06:36 IST

ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలిసే ఇంత భద్రత
ఒక్కసారి గెలిపించమని దేవుణ్ని మొక్కుకున్నా
ఇక్కడే ఇల్లు తీసుకుంటా.. స్వస్థలం చేసుకుంటా
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వెల్లడి
100 మంది వరకు నాయకుల చేరిక

ఈనాడు, కాకినాడ - న్యూస్‌టుడే, పిఠాపురం: ‘పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలందర్నీ కలవాలన్నది నా కోరిక. ఇక్కడున్న రెండు లక్షల పైచిలుకు జనాభాలో ప్రతి ఒక్కరితో ఫోటో తీయించుకోవాలనుకుంటున్నాను. కానీ భద్రతా కారణాల వల్ల ఇబ్బంది వస్తోంది.. జనం ఎక్కువమంది పోగైనప్పుడు కిరాయి మూకలు చొరబడి సన్నని బ్లేడ్లు తీసుకొచ్చి నన్ను, నా సిబ్బందినీ కోసి గాయపరుస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కదా.. అందుకే భద్రత మరింత కట్టుదిట్టంగా ఉంటే బాగుంటుందని జాగ్రత్తలు తీసుకుంటున్నా’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. పిఠాపురంలో 100 మందికి పైగా నాయకులు సోమవారం సాయంత్రం జనసేనలో చేరారు. వారందరికీ కండువా కప్పి ఆహ్వానించిన జనసేనాని ఈ సందర్భంగా మాట్లాడుతూ, మీ కోసమే ఇక్కడికి వచ్చానని.. అందరికీ అందుబాటులో ఉంటానని అన్నారు.

సినిమా అభిమాని కోసం..

‘నేను ఎప్పుడూ ఎవర్నీ, ఏదీ అభ్యర్థించను. ఒక్క దేవుణ్నే అభ్యర్థిస్తాను. అదీ రెండుసార్లు మాత్రమే కోరుకున్నా’ అని పవన్‌ తెలిపారు. ‘మహబూబ్‌నగర్‌ నుంచి ఓ అభిమాని వచ్చాడు.. ‘ఒక్క హిట్‌ ఇయ్యన్నా.. రోడ్లమీద తిరగలేకపోతున్నామన్నా.. హిట్‌ లేకపోతే చచ్చిపోతామన్నా’ అన్నాడు.. అభిమానుల కోసం ఒకసారి భగవంతుణ్ని కోరుకున్నాను. అలాగే భీమవరంలో ఓడిపోయిన తర్వాత, మనవాళ్లంతా నలిగిపోతుంటే.. తండ్రీ ఒక్కసారి విజయం అంటే ఏమిటో చూపించమని కోరుకున్నా. అలా అడిగినందుకు పిఠాపురం వాళ్లు గెలిపిస్తామని పిలిచారు. ఇక్కడి ప్రజలకు రుణపడి ఉంటా’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. భారీ మెజార్టీతో గెలిపిస్తే ప్రతి గ్రామంలో పర్యటిస్తానని, ప్రజలతోనే ఉంటానని, ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ‘శ్రీపాద శ్రీవల్లభుడు.. ఆంధ్ర బాప్టిస్ట్‌ చర్చి సాక్షిగా చెబుతున్నా. పిఠాపురం నా స్వస్థలం చేసుకుంటా. ఇక్కడ ఉండి సాధ్యమైనంత మేరకు మీకు సేవ చేసుకుంటా. ఇక్కడి గ్రామాలన్నీ వెతుకుతున్నా. ఏదో ఒక గ్రామంలో ఇల్లు తీసుకుంటా. అక్కడికొచ్చి ఉంటా.. అందరికీ అండగా ఉంటా’ అని ఆయన పేర్కొన్నారు.

మన పొత్తు గెలుస్తుంది..

‘ఓ వైపు నరేంద్ర మోదీ.. మరోవైపు చంద్రబాబు.. ఇంకోవైపు మీరందరూ ఇష్టపడే నేను. మన   పొత్తు గెలుస్తుంది. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది అన్నారు. ‘మీ నినాదాలు.. జయజయధ్వానాలే కదా పార్టీకి శక్తి’ అంటూ శ్రేణులను ఉత్సాహపరిచారు. వైకాపాకు కష్టపడి పనిచేసినా గుర్తింపులేదని ఎంపీటీసీ సభ్యులు తెలిపారని..    జనసేనలో కష్టపడితే గుర్తింపు ఇస్తానని భరోసా ఇచ్చామని పవన్‌ వెల్లడించారు.

నాయకులను తయారు చేస్తాం..

‘భవిష్యత్తులో పవన్‌ కల్యాణ్‌ ఒక్కడే నాయకుడు కాదు.. నా తరం తర్వాత కొత్తతరం రావాలంటే ఇప్పటి నుంచే నాయకులు తయారుకావాలని’ పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు. వార్డు, మున్సిపల్‌, మండల, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయిలో జనసేన బలమైన  నాయకులను తయారు చేస్తుందన్నారు. ఎంతోమంది యువతకు ఉపాధి చూపి.. జనసేన కోసం కష్టపడిన కాకినాడ లోక్‌సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు. తనను మాత్రం చిన్న మెజార్టీతో కాదు.. భారీ మెజార్టీతో గెలిపించాలని కోరగా అందరూ ఉత్సాహంగా సై అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని