వరంగల్‌ అభ్యర్థిగా కడియం కావ్య

వరంగల్‌ లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ కడియం కావ్యకు కేటాయించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఏఐసీసీ అధికారిక ప్రకటన చేసింది.

Published : 02 Apr 2024 04:09 IST

 ప్రకటించిన ఏఐసీసీ
ఇప్పటివరకు 14 స్థానాలకు అభ్యర్థుల ఖరారు
మిగిలిన మూడింటిపై కొనసాగుతున్న ఉత్కంఠ

ఈనాడు, దిల్లీ, హైదరాబాద్‌: వరంగల్‌ లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ కడియం కావ్యకు కేటాయించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఏఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. భారాస అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆ అవకాశాన్ని వదులుకొని తండ్రి కడియం శ్రీహరితోపాటు కాంగ్రెస్‌లో చేరిన ఆమెకు అనుకున్నట్లుగానే సీటు కేటాయించారు. దీంతో కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రంలోని 14 సీట్లకు అభ్యర్థులను   ప్రకటించినట్లయింది. ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌ స్థానాలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. సోమవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ నేతృత్వంలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) సమావేశంలో పెండింగ్‌ స్థానాలపై చర్చించారు. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీలు పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేశారు. కమిటీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇతర పనుల వల్ల హాజరుకాలేకపోయారు. వరంగల్‌ అభ్యర్థిపై మాత్రమే ఏకాభిప్రాయం కుదరడంతో అధికారికంగా ప్రకటించారు. మిగిలిన మూడు స్థానాలకు ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది పేర్లు పరిశీలనలో ఉండటంతో వాటి ప్రకటనను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ స్థానానికి ఇబ్రహీం అలీ మస్కతీ, సమీర్‌ఖాన్‌లలో ఎవరో ఒకరి పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కరీంనగర్‌ అభ్యర్థిత్వం మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకుడు వెలిచాల రాజేందర్‌రావు, తీన్మార్‌ మల్లన్నల మధ్య దోబూచులాడుతోంది. ఇందులో రాజేందర్‌రావుకు సిటింగ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మొగ్గు కొంత ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో స్థానిక సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని ఎవరో ఒకరి పేరును ఖరారు చేయొచ్చన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.

తెరపైకి కొత్తగా మరోపేరు..

ఖమ్మం స్థానంపై కాంగ్రెస్‌లోని అన్నివర్గాలూ గురిపెట్టడంతో పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయానికి రాలేకపోతోంది. ఇప్పటివరకు ఈ స్థానం కోసం వరంగల్‌ మాజీ ఎంపీ సురేందర్‌రెడ్డి కుమారుడు రఘురామిరెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్‌, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పీసీసీ మాజీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుసుమ్‌కుమార్‌ పోటీపడుతున్నారు. తాజాగా అదే జిల్లాకు చెందిన ఓ మీడియా సంస్థ అధిపతి కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. దీంతో ఈ సీటుపై నెలకొన్న ఉత్కంఠ మరింత ఎక్కువైంది. సీఈసీ సమావేశానంతరం రేవంత్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క.. కేసీ వేణుగోపాల్‌ ఇంటికివెళ్లి ఈనెల 6న తుక్కుగూడలో తలపెట్టిన కాంగ్రెస్‌ జనజాతర సభ సన్నాహక ఏర్పాట్లపై చర్చించారు. సభ నాటికి అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని