కేసీఆర్‌ పాపం.. తెలంగాణకు శాపం

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన పాపం రాష్ట్రానికి శాపంగా మారిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.

Published : 02 Apr 2024 04:12 IST

విద్యుత్‌ సంస్థలపై రూ.లక్ష కోట్ల భారం
ఆయన తప్పులను సరిదిద్దుతూ వస్తుంటే మమ్మల్నే ఆడిపోసుకుంటున్నారు
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ఈనాడు, దిల్లీ: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన పాపం రాష్ట్రానికి శాపంగా మారిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఆయన తన పదేళ్ల పాలనలో చేసిన తప్పుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై మోయలేనంత భారం పడిందని, రాష్ట్రంలోని విద్యుత్‌ సంస్థలు రూ.లక్ష కోట్లకు పైగా అప్పుల భారంలో చిక్కుకున్నాయని ఆరోపించారు. కేసీఆర్‌ గొప్పగా కట్టినట్లు చెప్పుకొనే కాళేశ్వరం, భద్రాద్రి సబ్‌క్రిటికల్‌ విద్యుత్‌ కేంద్రం, యాదాద్రి విద్యుత్‌ కేంద్రాలు ఇప్పుడు రాష్ట్రానికి గుదిబండలుగా మారాయని అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌ ఆదివారం సూర్యాపేట జిల్లాలో ఎండిన పంటపొలాలను పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. ఆయన కట్టుకథలు చెప్పే ప్రయత్నంచేశారని ధ్వజమెత్తారు.

కేసీఆర్‌ పట్టించుకోకపోవడంతో తడిసి మోపెడైన ‘యాదాద్రి’ ఖర్చు

‘‘యాదాద్రి పవర్‌ ప్రాజెక్టును బొగ్గు దొరికే స్థలానికి 360 కిలోమీటర్ల దూరాన ఏర్పాటుచేశారు. దానివల్ల బొగ్గు రవాణా ఖర్చు విపరీతంగా పెరిగింది. ఎవరో సవాల్‌ చేయడంతో 2022 సెప్టెంబరు 30న ఎన్జీటీ దాని పర్యావరణ అనుమతులను సస్పెండ్‌ చేసింది. ఆ తర్వాత ఏడాది పాటు అధికారంలోనే కొనసాగిన కేసీఆర్‌ అనుమతుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోలేదు. దానివల్లే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగి ఖర్చు తడిసి మోపెడైంది. మేము ఈ ఏడాది ఫిబ్రవరి 20న ప్రజాభిప్రాయసేకరణ చేపట్టి ఆ నివేదికను మరోసారి పర్యావరణ అనుమతుల కోసం పంపాం. పర్యావరణశాఖ ఈ నెల 5న పరిశీలన చేపట్టనుంది.

ఎన్టీపీసీతో నాడు పీపీఏ ఎందుకు కుదుర్చుకోలేదు?

విభజన చట్టం ప్రకారం ఎన్టీపీసీ ద్వారా రాష్ట్రంలో ఇంకా 2,400 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవకాశం ఉంది. పదేళ్లు పాలన చేసిన వ్యక్తి ఎన్టీపీసీతో పీపీఏ(పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌) చేసుకొని ఆ విద్యుత్‌ రాష్ట్రానికి వచ్చేలా ఎందుకు చర్యలు తీసుకోలేదు? దాని వెనుక ఉన్న కుట్ర ఏంటో ప్రజలకు తెలియాలి. ఆయన ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకొని ఉంటే కాలం చెల్లిన సబ్‌క్రిటికల్‌ టెక్నాలజీతో భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టు పెట్టే పరిస్థితి ఉండేదికాదు. ఎన్టీపీసీ ఉండగా ఇదెందుకు అని ఎవరైనా అడుగుతారేమోనన్న అనుమానంతో దానితో ఒప్పందం చేసుకోకుండా పక్కనపడేశారు. ఇప్పుడు ఎన్టీపీసీ ఉత్పత్తి ప్రారంభించడానికి మరో ఐదేళ్లు పడుతుంది. ఇప్పుడున్న ధరల ప్రకారం లెక్కేస్తే కరెంట్‌ యూనిట్‌ ధర రూ.8 నుంచి రూ.9 వరకు ఉంటుంది. ఇదే సమయంలో సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ సోలార్‌ విద్యుత్‌ను రాబోయే 25 ఏళ్ల కాలానికి యూనిట్‌ రూ.5.59కే ఇవ్వడానికి ముందుకొచ్చింది. చౌకగా దొరికే ఈ విద్యుత్‌ను ప్రజలకు ఇవ్వాలా? లేదంటే రూ.8-9 భారం పడే ఎన్టీపీసీ విద్యుత్‌ను ఇవ్వాలా అన్నదానికి కేసీఆర్‌ సమాధానం చెప్పాలి. రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు రూ.1,10,690 కోట్ల బాకీలు పెట్టి విద్యుత్‌ వ్యవస్థను సర్వనాశనం చేసిన ఆయన ఇప్పుడు ఎన్టీపీసీతో పీపీఏలు ఎందుకు చేసుకోలేదని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉంది.

గత ప్రభుత్వంలో కంటే ఎక్కువ విద్యుత్‌ అందించాం

మేం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే కేసీఆర్‌ హయాంలో ఇచ్చిన దానికంటే ఎక్కువ కరెంటు ఇచ్చాం. మార్చిలో 15,623 మెగావాట్ల పీక్‌ డిమాండ్‌ మేరకు విద్యుత్‌ సరఫరాచేశాం. గతంలో ఎన్నడూ ఇంత డిమాండ్‌ రాలేదు. వాస్తవాలు ఇలా ఉన్నా కేసీఆర్‌ ఆడిపోసుకున్న తీరు అత్యంత దారుణంగా ఉంది. ఆయన రూ.7 లక్షల కోట్లు అప్పుచేసి రాష్ట్రాన్ని ఆగం చేశారు. అయినా మేం పరిస్థితులను చక్కదిద్దుకుంటూ ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కల్పించాం.

భారాసలో ఉన్న కొద్దిమందిని కాపాడుకొనేందుకు ఆపసోపాలు

అంతా తాను చెప్పినట్లే వింటారు, తాను గీసిన గీతను దాటరు అనుకున్న నాయకులు భారాసని వదిలి కాంగ్రెస్‌లో చేరుతుంటే కేసీఆర్‌ తట్టుకోలేకపోతున్నారు. పార్టీలో ఉన్న కొద్దిమందిని కాపాడుకొనేందుకు ఆపసోపాలు పడుతున్నారు’’ అని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని