సంక్షిప్త వార్తలు(6)

తెలంగాణ ప్రజా పార్టీ (టీపీపీ)కి చెందిన పలువురు ఆఫీస్‌ బేరర్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. జి.చిన్నారెడ్డి సోమవారం గాంధీభవన్‌లో వారికి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Updated : 02 Apr 2024 05:33 IST

టీపీపీకి చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరిక

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రజా పార్టీ (టీపీపీ)కి చెందిన పలువురు ఆఫీస్‌ బేరర్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. జి.చిన్నారెడ్డి సోమవారం గాంధీభవన్‌లో వారికి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో క్రిష్ణారావు, అబ్దుల్‌ సత్తార్‌ ఖాన్‌, శివరామిరెడ్డి, తదితరులున్నారు.


ఆర్‌ఎల్‌డీకి సిద్దిఖీ గుడ్‌బై

దిల్లీ: భాజపాతో జట్టు కట్టిన రాష్ట్రీయ లోక్‌దళ్‌కు (ఆర్‌ఎల్‌డీ) షాక్‌ తగిలింది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, కీలక నేత షాహిద్‌ సిద్దిఖీ రాజీనామా చేశారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో భాజపాతో ఆర్‌ఎల్‌డీ పొత్తు పెట్టుకోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉన్న సమయంలో నిశ్శబ్దంగా ఉండటం సరికాదని భావించి పార్టీకి రాజీనామా చేశానని సిద్దిఖీ తెలిపారు. ఆదివారం రాజీనామాను అధ్యక్షుడు జయంత్‌ సింగ్‌కు పంపినట్లు వెల్లడించారు.


గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ కుటుంబానికి అసదుద్దీన్‌ ఒవైసీ పరామర్శ

లఖ్‌నవూ: గ్యాంగ్‌స్టర్‌, రాజకీయ నాయకుడు ముఖ్తార్‌ అన్సారీ ఇటీవల గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో.. ఆయన కుటుంబ సభ్యులకు ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంతాపం తెలిపారు. ఆయన ఆదివారం అర్ధరాత్రి గాజీపుర్‌లో ముఖ్తార్‌ అన్సారీ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ‘ఎక్స్‌’ వేదికగా ఈ విషయాన్ని పంచుకుంటూ.. ‘చీకటి చివర్లో వెలుగు ఉంటుంది’ అని పేర్కొన్నారు. అప్నాదళ్‌(కమెరావాదీ) ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి విడిపోయి ఎంఐఎంతో కలిసి ‘పీడీఎం న్యాయ మోర్చా’ పేరిట ఉమ్మడి వేదికను ప్రారంభించిన సందర్భంగా ఒవైసీ ఆదివారం లఖ్‌నవూలో పర్యటించారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, ముస్లింలకు న్యాయం చేసేందుకు ఆ పార్టీలు దీన్ని ఏర్పాటు చేశాయి.


జగన్‌రెడ్డే అసలైన పెత్తందారు: లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పేదోళ్ల పింఛన్‌ ఆపి.. పెద్దోళ్లకు కాంట్రాక్టు బిల్లులు కట్టబెట్టిన వ్యక్తే అసలైన పెత్తందారు సీఎం జగన్‌రెడ్డి అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ‘అవ్వా తాతలకు అన్యాయం. దివ్యాంగులకు దారుణ మోసం. వితంతువుల ఆసరాకు ఎసరు. రూ.వేల కోట్ల పింఛన్ల సొమ్ము సీఎం సొంత మనుషులకు ధారాదత్తం’ అంటూ ఎక్స్‌ వేదికగా సోమవారం లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.


పింఛన్ల పంపిణీలో వైకాపా అబద్ధాలు ప్రచారం చేస్తోంది

తెదేపా నేత కొల్లు రవీంద్ర ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పింఛన్ల పంపిణీపై అవాస్తవాలే ఎజెండాగా పెట్టుకుని మాజీ మంత్రి పేర్నినాని మాట్లాడుతున్నారని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు వైకాపా నాయకులు పనికట్టుకుని రోజుకో అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. వృద్ధులకు ప్రతినెలా 1నే అందాల్సిన పింఛన్‌ జాప్యం కావడానికి సీఎం జగన్‌రెడ్డే కారణమని సోమవారం ఆయన ఓ ప్రకటనలో విమర్శించారు. సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా ఇంటి వద్దనే పింఛన్‌ ఇచ్చే అవకాశమున్నా రాజకీయ ప్రయోజనాల కోసం వయోవృద్ధులను వేధిస్తున్నారని, త్వరలో వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.


జగన్‌ ప్రభుత్వం 25వేల పాఠశాలల్ని మూసేసింది

మాజీ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా ప్రభుత్వం జీవో-117 తెచ్చి 25వేల పాఠశాలలను మూసేసి, 50వేల ఉపాధ్యాయ పోస్టుల్ని రద్దు చేసిందని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ ధ్వజమెత్తారు. 1.70లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేసిన చరిత్ర తెదేపాదైతే.. ఏటా డీఎస్సీ నిర్వహిస్తానన్న హామీని తుంగలో తొక్కి ఒక్క పోస్టునూ భర్తీచేయని వ్యక్తి జగన్‌రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఈ ప్రభుత్వం బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌, విదేశీవిద్య లాంటి పథకాల్ని రద్దుచేసింది. విద్యాహక్కు చట్టానికి తిలోదకాలిస్తూ.. మాతృభాషలో బోధనను దూరం చేసింది’ అని రామకృష్ణ మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని