కచ్చతీవును కాంగ్రెస్‌ ప్రధానులు పట్టించుకోలేదు: జైశంకర్‌

ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో తమిళనాడుకు సమీపంలోని ‘కచ్చతీవు’ ద్వీపం వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.

Published : 02 Apr 2024 04:41 IST

దిల్లీ: ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో తమిళనాడుకు సమీపంలోని ‘కచ్చతీవు’ ద్వీపం వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. దీనిపై సోమవారం విదేశీవ్యవహారాల శాఖ మంత్రి  జైశంకర్‌ స్పందించారు. ‘‘నాటి ప్రధానులు భారత భూభాగంపై ఉదాసీనత ప్రదర్శించారు. మాజీ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ దృష్టిలో ఇది చిన్న ద్వీపం. దీనికి ప్రాముఖ్యతే లేదని భావించి.. వదిలించుకోవాలనుకున్నారు. ఇందిరాగాంధీ కూడా ఇదే అభిప్రాయంతో నిర్ణయాలు తీసుకున్నారు’’ అని మంత్రి వ్యాఖ్యానించారు. 1974లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ దీవిని అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ.. శ్రీలంకకు అప్పగించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల పేర్లను చైనా మార్చడంపైనా జైశంకర్‌ స్పందించారు. ‘‘మీ ఇంటిపేరు మారిస్తే అది నాదవుతుందా..! అరుణాచల్‌ప్రదేశ్‌ భారతదేశ రాష్ట్రం. పేర్లను మార్చడం వలన ఎలాంటి ప్రయోజనం లేదు’’ అని పేర్కొన్నారు. కచ్చతీవుపై జైశంకర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పి.చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు ‘‘గత 50 ఏళ్లుగా మత్స్యకారుల్ని నిర్బంధిస్తున్నారన్నది వాస్తవం. అలాగే శ్రీలంక మత్స్యకారుల్ని భారత్‌ అదుపులోకి తీసుకుంటుంది. శ్రీలంకతో కేంద్రంలోని ప్రతీ ప్రభుత్వం చర్చలు జరిపి, వారిని విడిపిస్తోంది. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు ఇలాంటివి జరగలేదా..? తమిళనాడులో ఇతర పార్టీలతో అధికార భాజపా పొత్తులో ఉన్నప్పుడు జరగలేదా..?’’ అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని