వికసిత భారత్‌ ఎజెండాతో ఎన్నికల మేనిఫెస్టో!

మూడో దఫా అధికారంలోకి రాగానే భారీ నిర్ణయాలుంటాయని ప్రధాని మోదీ తరచూ చెబుతున్న నేపథ్యంలో భాజపా మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం సోమవారం దిల్లీలో జరిగింది.

Published : 02 Apr 2024 04:49 IST

లోక్‌సభ ఎన్నికల వాగ్దానాలపై భాజపా కసరత్తు ప్రారంభం

దిల్లీ: మూడో దఫా అధికారంలోకి రాగానే భారీ నిర్ణయాలుంటాయని ప్రధాని మోదీ తరచూ చెబుతున్న నేపథ్యంలో భాజపా మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం సోమవారం దిల్లీలో జరిగింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక నినాదం ‘2047కు వికసిత భారత్‌’ సాధన లక్ష్యం ఆ పార్టీ ఎన్నికల వాగ్దాన పత్రంలో అత్యంత కీలకాంశం కానుంది. ఇదే ప్రధాన ఎజెండాగా పార్టీ మేనిఫెస్టో కమిటీ మొదటి భేటీ కొనసాగింది. ఎనిమిది మంది కేంద్ర మంత్రులు, ముగ్గురు ముఖ్యమంత్రులు, మరికొందరు పార్టీ సీనియర్‌ నేతలు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి, భాజపా సీనియర్‌ నేత రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షత వహించారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ విలేకరులతో మాట్లాడుతూ..‘‘వికసిత భారత్‌ లక్ష్య సాధన మార్గ సూచీపై చర్చించాం. మిస్డ్‌కాల్‌ సర్వీస్‌ ద్వారా పార్టీకి 3.75లక్షలకు పైగా, ప్రధాని నరేంద్ర మోదీ(నమో) యాప్‌ ద్వారా సుమారు 1.70 లక్షల సూచనలు అందాయి. దేశవ్యాప్తంగా మూడు వేలకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజలు వీటిని పంపించారు. భాజపా మేనిఫెస్టో రూపకల్పనలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడం ప్రధాని మోదీపై వారికున్న విశ్వాసాన్ని తెలియజేస్తోంది. ఆయన నుంచి వారు ఆశిస్తున్నదేమిటో స్పష్టమవుతోంది. అందిన సూచనలు, సలహాలన్నింటినీ వర్గీకరించి తదుపరి సమావేశం నాటికి వాటికో తుది రూపు తీసుకొస్తామ’’ని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని