జగన్‌ సర్కారు రాజకీయ కుట్రతోనే.. వయోవృద్ధులకు ఇబ్బందులు

వాలంటీర్లంతా వైకాపా కార్యకర్తలేనని, వారంతా పార్టీకోసం పనిచేస్తున్నారని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలే ప్రస్తుతం ఎన్నికల విధులు, పింఛన్ల పంపిణీ నుంచి ఎన్నికల సంఘం వారిని దూరంపెట్టడానికి కారణమని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు.

Updated : 02 Apr 2024 06:17 IST

ఉద్యోగుల ద్వారా ఇళ్ల వద్దే పింఛన్లు అందించాలి
ఎన్నికల సంఘానికి తెదేపా ఎంపీ కనకమేడల లేఖ

ఈనాడు, దిల్లీ: వాలంటీర్లంతా వైకాపా కార్యకర్తలేనని, వారంతా పార్టీకోసం పనిచేస్తున్నారని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలే ప్రస్తుతం ఎన్నికల విధులు, పింఛన్ల పంపిణీ నుంచి ఎన్నికల సంఘం వారిని దూరంపెట్టడానికి కారణమని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు. వైకాపాకు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు కూడా వాలంటీర్లందరూ పార్టీకోసమే పనిచేస్తారని బహిరంగ ప్రకటనలు చేశారని, ఈ అంశాలు కేంద్ర ఎన్నికలసంఘం దృష్టికి వెళ్లడంవల్లే వారు చర్యలు తీసుకున్నారని చెప్పారు. సామాజిక సంక్షేమ పింఛన్ల పంపిణీకి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరం పెట్టాలని ఈసీఐ ఆదేశించిందే తప్ప వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీచేయొద్దని చెప్పలేదు. అయితే ఈ అంశంలో ప్రతిపక్షంపై బురదజల్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వయోవృద్ధులను సచివాలయాలకు వద్దకు పిలిపించి ఎండలో నిలబెట్టి దురుద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతోంది.

వాస్తవానికి ఆర్థిక సంవత్సరం ముగింపును దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్‌ నెలలో పింఛన్లను 3వ తేదీన పంపిణీచేస్తామని సెర్ప్‌ చెప్పినట్లు సాక్షి పత్రిక గత నెల 28న ప్రచురించింది. రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షలమంది పింఛనుదారులు ఉండగా, 1.65 లక్షలమంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారు. వారి ద్వారా లబ్ధిదారులు అందరికీ రెండురోజుల్లో ఇంటివద్దే పింఛన్లు అందించడానికి వీలుంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పింఛన్ల పంపిణీకి 10 రోజులు పడుతుందని చెప్పడం దారుణం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడానికి వీలున్న ఈ కార్యక్రమాన్ని సాగదీసి ఎన్నికల సంఘంపై బురదజల్లడంతోపాటు, రాజకీయంగా దీన్ని ఉపయోగించుకోవాలని వైకాపా చూస్తోంది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలి. సచివాలయం/పంచాయతీ/ఇతర ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించి ఇళ్లవద్దే వయోవృద్ధులకు పింఛన్లు అందించేలా చర్యలు తీసుకొని ఎండలో వారు ఇబ్బందులు పడకుండా చూడాలి’’ అని కనకమేడల కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని