సంక్షిప్త వార్తలు (24)

నాలుగు సార్లు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సౌదాగర్‌ గంగారాం మంగళవారం భాజపాలో చేరారు.

Updated : 03 Apr 2024 06:11 IST

భాజపాలోకి మాజీ ఎమ్మెల్యే సౌదాగర్‌ గంగారాం

జుక్కల్‌, న్యూస్‌టుడే: నాలుగు సార్లు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సౌదాగర్‌ గంగారాం మంగళవారం భాజపాలో చేరారు. దిల్లీలోని భారతీయ జనతా పార్టీ  కార్యాలయంలో పార్టీ జాతీయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌ సమక్షంలో భాజపా కండువా కప్పుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్‌ ఉన్నారు. 1978లో రాజకీయాల్లోకి ప్రవేశించిన గంగారాం పోటీ చేసిన తొలిసారే జుక్కల్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1983, 1989, 2004లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొందారు.


కేటీఆర్‌ లీగల్‌ నోటీసులను ఎదుర్కొంటాం
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత కేకే మహేందర్‌రెడ్డి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు ఇస్తే న్యాయపరంగా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి కేకే మహేందర్‌రెడ్డి తెలిపారు. వారు మంగళవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మా ఫోన్లు ట్యాపింగ్‌ అయ్యాయనే అనుమానంతో డీజీపీకి ఫిర్యాదు చేస్తే కేటీఆర్‌ ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. వారే శాశ్వతంగా అధికారంలో ఉండాలనే దుర్బుద్ధితో కల్వకుంట్ల కుటుంబం ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడిందని ఆరోపించారు. తెలంగాణలో ట్యాక్స్‌ వసూలు చేసి దిల్లీకి పంపుతున్నారన్న భాజపా నేతల ఆరోపణల్లో నిజం లేదని శ్రీనివాస్‌రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.


రఘునందన్‌రావుపై కేసు నమోదు

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: భాజపా మెదక్‌ లోక్‌సభ అభ్యర్థి ఎం.రఘునందన్‌రావుపై సంగారెడ్డి పట్టణ ఠాణాలో ఈ నెల 1న కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌ రిపోర్టు మంగళవారం వెలుగులోకి వచ్చింది. గత నెల 27న సంగారెడ్డిలో నిర్వహించిన భాజపా కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, మెదక్‌ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిలపై రఘునందన్‌రావు అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని గత నెల 28న సంగారెడ్డి భారాస ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ ఫిర్యాదు చేసినట్లు సీఐ భాస్కర్‌ తెలిపారు. ఈ మేరకు 504 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.


కాంగ్రెస్‌లో చేరినవారు పదవులకు రాజీనామా చేయాలి: భారాస నేతల డిమాండ్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: భారాసలో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి తమ పదవులకు రాజీనామా చేయాలని భారాస నేతలు పొన్నాల లక్ష్మయ్య, దాసోజు శ్రవణ్‌, గాదరి కిశోర్‌, బాల్క సుమన్‌ డిమాండ్‌ చేశారు. వారు మంగళవారం తెలంగాణభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో 2014 నుంచి ఇప్పటి వరకు పనిచేసిన ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, హోంశాఖ కార్యదర్శులను విచారించాలన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ ప్రైవేట్‌దా, ప్రభుత్వానిదా తేల్చాలని డిమాండ్‌ చేశారు. వరంగల్‌లో కడియం కావ్యకు డిపాజిట్‌ కూడా రాదని చెప్పారు.


భాజపాపై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

దిల్లీ: ఎన్నికల వేళ తమ పార్టీని కించపరిచేలా వక్రీకరించిన వీడియోలను భాజపా విడుదల చేస్తోందంటూ కాంగ్రెస్‌ మంగళవారం ఈసీకి ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా కాంగ్రెస్‌ ప్రచారాన్ని బిలియనీర్‌ వ్యాపారి జార్జ్‌ సౌరోస్‌తో భాజపా పోల్చడాన్ని సైతం ఈసీ దృష్టికి తీసుకువెళ్లినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. కాంగ్రెస్‌ను అవమానపరిచేలా ఉన్న ఆ వీడియోలను వెంటనే తొలగించాలని, వాటి రూపకర్తలపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని తమ పార్టీ నాయకులు సల్మాన్‌ ఖుర్షీద్‌, పవన్‌ ఖేడా, గుర్దీప్‌ సప్పల్‌ ఈసీని కోరినట్లు జైరాం రమేశ్‌ పేర్కొన్నారు.


రాముడు భాజపా గుత్తసొత్తు కాదు: పైలట్‌

దిల్లీ: శ్రీరాముడు అందరివాడనీ, ఆయనపైన, హిందూ మతంపైన భాజపాకు గుత్త హక్కులు లేవని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సచిన్‌ పైలట్‌ ఉద్ఘాటించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి భావోద్వేగ అంశాలపై కాకుండా ప్రజా సమస్యల గురించి పోరాడుతుందని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలవాలనే ఎన్డీయే కూటమి నినాదం అహంకార పూరితమన్నారు. అన్ని రాజకీయ పార్టీల పట్ల నిష్పాక్షికంగా వ్యవహరించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.


వారిని ఆర్టీసీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలి: కూనంనేని

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీలో స్వల్ప కారణాలతో 1500 మందికిపైగా సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించడంతో ఆయా కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని.. వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వకాలంలో బస్సుల కండిషన్‌ సరిగా లేకపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు జరిగాయని.. వాటికి బాధ్యులను చేస్తూ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లను తొలగించారని పేర్కొన్నారు.


మాదిగలకు న్యాయంచేయాలి: మోత్కుపల్లి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఎంపీ టికెట్ల కేటాయింపులో మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానానికి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు విజ్ఞప్తి చేశారు. ఆయన మంగళవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. మాదిగ, మాలలకు జనాభా ప్రాతిపదికన సమ న్యాయం చేయాలన్నారు.


క్షమాపణ తర్వాతే ఓట్లు అడగాలి
పీసీసీ ఎన్నారై సెల్‌ ఛైర్మన్‌ వినోద్‌కుమార్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: గల్ఫ్‌ కార్మికులకు క్షమాపణలు చెప్పిన తర్వాతే భాజపా, భారాసలు ఓట్లు అడగాలని పీసీసీ ఎన్నారై సెల్‌ ఛైర్మన్‌ వినోద్‌కుమార్‌ డిమాండ్‌చేశారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. రూ.500 కోట్లతో గల్ఫ్‌ సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని భారాస మాట తప్పిందని అన్నారు.


కాంగ్రెస్‌ నుంచి బక్క జడ్సన్‌ బహిష్కరణ

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ నాయకుడు బక్క జడ్సన్‌పై బహిష్కరణ వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ పీసీసీ క్రమశిక్షణ సంఘం ఆయనను 6 సంవత్సరాల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ నోటీసులకు జడ్సన్‌ ఇచ్చిన వివరణతో కమిటీ సంతృప్తి చెందలేదని ఛైర్మన్‌ చిన్నారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


ఇంకా సీఎంగా ఎలా ఉంటారు: భాజపా

దిల్లీ: అవినీతి ఆరోపణలతో జైలులో ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌.. ఇంకా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతుండటాన్ని భాజపా ప్రశ్నించింది. పారదర్శక పాలనను అందించే వ్యక్తిని సీఎంగా పొందడం దిల్లీ ప్రజల హక్కు అని పేర్కొంది. ‘కేజ్రీవాల్‌ ద్వంద్వ విధానాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఆయన సహచరులు మనీశ్‌ సిసోదియా, సత్యేంద్ర కుమార్‌ జైన్‌లు జైలుకెళ్లాల్సి వచ్చినప్పుడు వారి పదవులకు రాజీనామాలు చేయించారు. ఇప్పుడు తానే అరెస్టు అయినప్పటికీ రాజీనామా చేయకుండా పదవిలోనే కొనసాగుతున్నారు’ అని భాజపా అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా మంగళవారం విమర్శలు గుప్పించారు. ఇలా చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.


ఆటవిక పాలన నుంచి బిహార్‌ను కాపాడిన ఎన్‌డీయే: మోదీ

పట్నా: ఎన్‌డీయే పాలన మొదలయ్యాకే బిహార్‌లో ఆటవిక పాలన అంతమయ్యిందనే విషయాన్ని యువతకు వివరించాలని భాజపా కార్యకర్తలకు ప్రధాని మోదీ సూచించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నమో యాప్‌ ద్వారా బిహార్‌లోని బూత్‌ స్థాయి కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఎన్‌డీయే పాలన కాలంలో బిహార్‌లోని   3.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారనే వాస్తవాన్ని ప్రచారం చేయాలని కోరారు. రాష్ట్రంలోని మిత్రపక్షాలన్నీ సమన్వయంతో పనిచేయాలని, ఎన్‌డీయేకు వేసే ప్రతి ఓటు మోదీని బలపరుస్తుందనే సంగతిని ఓటర్లకు వివరించాలని పేర్కొన్నారు.


రాహుల్‌పై పరువు నష్టం కేసు విచారణ 12కు వాయిదా

సుల్తాన్‌పుర్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌): కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి 2018లో నమోదైన పరువు నష్టం కేసు విచారణ ఈ నెల 12కు వాయిదా పడింది. రాహుల్‌కు బెయిలుకు వీలులేని వారెంట్‌ జారీ చేయాలని కోర్టుకు దరఖాస్తు చేశానని, న్యాయమూర్తి మంగళవారం సెలవులో ఉండడంతో విచారణ వాయిదా పడిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది సంతోష్‌ పాండే తెలిపారు. 2018లో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌ మాట్లాడుతూ.. ‘‘నిజాయితీగా ఉంటూ, స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తామని చెప్పుకునే భాజపా ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకుంది’’ అని ఆరోపించారు. ఆ సమయంలో భాజపా జాతీయ అధ్యక్షుడిగా అమిత్‌ షా ఉన్నారు. దీంతో భాజపా నేత విజయ్‌ మిశ్ర రాహుల్‌పై పరువునష్టం కేసు పెట్టారు.


కొత్తపేట, రామచంద్రాపురంలో చంద్రబాబు రోడ్‌షోలు నేడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు ‘ప్రజాగళం’ పేరుతో నిర్వహిస్తున్న రోడ్‌షోలు బుధవారం అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని కొత్తపేట, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో జరగనున్నాయి. 4న కొవ్వూరు, గోపాలపురం, 5న నరసాపురం, పాలకొల్లు, 6న పెదకూరపాడు, సత్తెనపల్లి, 7న పామర్రు, పెనమలూరుల్లో ఆయన పర్యటిస్తారు. ప్రజాగళంలో భాగంగా ఇప్పటికే 15 నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్‌షోలు నిర్వహించారు.


జగన్‌ రాక్షస రాజకీయాలకు వృద్ధులు, దివ్యాంగులు బలి: బోండా ఉమా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పింఛన్ల పంపిణీపై సీఎం జగన్‌ చేస్తున్న రాక్షస రాజకీయాలతో వృద్ధులు, దివ్యాంగులు బలవుతున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. తమ స్వార్థ రాజకీయాలకు వాలంటీర్లను వైకాపావారు వాడుకోబట్టే సంక్షేమ పథకాల పంపిణీకి ఎన్నికల సంఘం దూరం పెడుతూ నిర్ణయం తీసుకుందని తెలిపారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇంటింటికీ పింఛన్ల పంపిణీని ఈసీ ఆపిందని ‘సాక్షి’లో విషప్రచారం చేయడం సిగ్గుచేటు. పింఛనుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛను ఇవ్వొద్దని ఈసీ ఎక్కడా చెప్పలేదు’ అని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.


షర్మిలను గెలిపిస్తేనే  వైఎస్‌ వివేకాకు న్యాయం: సీపీఐ నారాయణ

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీలోని కడప లోక్‌సభ స్థానానికి ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పోటీ చేయనుండటంపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ స్పందించారు. షర్మిలను గెలిపిస్తేనే వైఎస్‌ వివేకానందరెడ్డికి న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. కడప లోక్‌సభ స్థానంలో వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని, హత్యకు గురైన దివంగత వైఎస్‌ వివేకానందరెడ్డికి న్యాయం జరగాలంటే కడపలో షర్మిలను గెలిపించాలని కోరారు. ఈ మేరకు నారాయణ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.


తెదేపాలో చేరనున్న బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: కొంతకాలం నుంచి వైకాపాపై అసంతృప్తితో ఉన్న ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ తెదేపాలో చేరనున్నట్లు ప్రకటించారు. మంగళవారం తన అనుచరులతో సమావేశం నిర్వహించిన ఆయన.. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ దొరకగానే ఆయన సమక్షంలో పార్టీలో చేరతానని తెలిపారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కుమార్‌ ఓటమే లక్ష్యంగా పని చేస్తానని స్పష్టం చేశారు.


వాలంటీర్లు వైకాపా కోసం పనిచేయండి
ఇది నా మాట కాదు.. జగన్‌ది
విజయనగరం జడ్పీ ఛైర్మన్‌ ఎం.శ్రీనివాసరావు వ్యాఖ్యలు

పార్వతీపురం, బెలగాం, న్యూస్‌టుడే: వాలంటీర్లు రాజీనామా చేసి, వైకాపా కోసం పని చేయాలని విజయనగరం జడ్పీ ఛైర్మన్‌ ఎం.శ్రీనివాసరావు అన్నారు. ఇది తన మాట కాదని, ముఖ్యమంత్రి జగన్‌ మాటని పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మంగళవారం వైకాపా శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విధుల్లో చేరవచ్చన్నారు.


వినుకొండ వైకాపా ఎమ్మెల్యే బొల్లాకు ఈసీ నోటీసు

ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట: పల్నాడు జిల్లా వినుకొండ వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఆయన ఇటీవల విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపక్ష నేతలను అసభ్య పదాలతో దూషించారు. బొల్లాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఈ నెల 1న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనాకు ఫిర్యాదు చేశారు. సీఈఓ ఆదేశాల మేరకు.. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని వినుకొండ ఆర్వో వరద సుబ్బారావు.. బొల్లాకు మంగళవారం నోటీసులు జారీ చేశారు.


ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డిపై కేసు

తుళ్లూరు, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించారన్న ఫిర్యాదు మేరకు ప్రభుత్వ సలహాదారు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డిపై మంగళవారం తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత నెల 26న రాష్ట్ర సచివాలయంలో చంద్రశేఖర్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేత నారా లోకేశ్‌పై పలు విమర్శలు చేశారు. ప్రభుత్వ పదవిలో ఉండి రాజకీయ విమర్శలు చేయడం నియమావళికి విరుద్ధమని పేర్కొంటూ ఆంధ్ర పెన్షనర్ల పార్టీ అధ్యక్షుడు పి.సుబ్బరాయన్‌తో పాటు శాసనమండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్‌లు గత నెల 27న రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. వారి ఆదేశాల మేరకు తుళ్లూరు మండల మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ హెడ్‌, ఎంపీడీవో బి.శివన్నారాయణ తుళ్లూరు ఎస్‌హెచ్‌వోకు మంగళవారం ఫిర్యాదుచేశారు. ఈ మేరకు తుళ్లూరు సీఐ షేక్‌ సుబాని కేసు నమోదు చేశారు.


ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఛైర్మన్‌పై కేసు నమోదు

కడప నేరవార్తలు, బద్వేలు, న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై వైయస్‌ఆర్‌ జిల్లా కడప ఒకటో పట్టణ ఠాణా, బద్వేలు పోలీసుస్టేషన్‌లో మంగళవారం కేసులు నమోదయ్యాయి. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఛైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి, వైయస్‌ఆర్‌ ఆర్టీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య ఇటీవల ఆర్టీసీ డిపోల్లో ప్రచారం చేస్తూ.. వైకాపాకు మద్దతు తెలపాలని కరపత్రాలు పంపిణీ చేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందునా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


వ్యాపారులకు సమయం ఇవ్వాలి

తెదేపా నేత డూండి రాకేష్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో వ్యాపార నిమిత్తం నగదు తీసుకెళ్లే వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని తెదేపా వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్‌ అన్నారు. స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించి ఆధారాలు చూపించడానికి 24 గంటల సమయం ఇవ్వాలని సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనాను మంగళవారం ఆయన కోరారు.


సీఎం జగన్‌పై చర్యలు తీసుకోవాలి

సీఈసీకి ఫిర్యాదు చేసిన భాజపా నేత బాజీ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రసంగించిన సీఎం జగన్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈసీ)కి భాజపా మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ బాజీ మంగళవారం ఫిర్యాదు చేశారు. ‘భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసినందుకు జగన్‌కు లీగల్‌ నోటీసులు పంపించాం. సంధ్య ఆక్వా కంపెనీ యజమాని వైకాపాకు సంబంధించిన వ్యక్తి కాదని ఆయన నిరూపించగలరా? అబద్ధాలు చెబితే ప్రజలు ఓటేస్తారని జగన్‌ నమ్మకం. పురందేశ్వరి కుటుంబంపై ఆయన వ్యాఖ్యలను మా పార్టీ ఖండిస్తోంది. ఈ ఆరోపణలపై రూ.20 కోట్ల పరువు నష్టం దావా వేశాం. వారం రోజుల్లో క్షమాపణ చెప్పకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటారు’ అని బాజీ హెచ్చరించారు.


పింఛన్ల పంపిణీ ఆలస్యంపై ప్రభుత్వానిదే బాధ్యత : సీపీఐ

ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీలో జరుగుతున్న జాప్యంపై ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ‘ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయనివ్వద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. రాష్ట్రంలో 66 లక్షల మంది పింఛనుదారులు ఉండగా.. సుమారు 1.25 లక్షల మంది సచివాలయ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితో కలిసి పింఛన్లు ఇవ్వకుండా అధికార యంత్రాంగం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ఈ ఎన్నికల్లో జగన్‌ సర్కార్‌కు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి’ అని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని