నాయకులకు కాదు.. నీళ్లకు గేట్లు తెరవండి!

నాయకుల కోసం పార్టీ గేట్లు తెరిచినట్లు చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ముందు ప్రాజెక్టుల గేట్లు తెరిచి, ఎండుతున్న పంటలకు సాగునీరు ఇచ్చి రైతులను కాపాడాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

Updated : 03 Apr 2024 05:02 IST

మాజీ మంత్రి హరీశ్‌రావు

గజ్వేల్‌, న్యూస్‌టుడే: నాయకుల కోసం పార్టీ గేట్లు తెరిచినట్లు చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ముందు ప్రాజెక్టుల గేట్లు తెరిచి, ఎండుతున్న పంటలకు సాగునీరు ఇచ్చి రైతులను కాపాడాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో మంగళవారం నిర్వహించిన భారాస కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలి. అప్పుడే రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలవుతాయి. దేవుళ్ల పేరు చెప్పి ఓట్లు అడగడం తప్ప భాజపా దేశానికి చేసిందేమీ లేదు. భాజపాతో కలిస్తే మంచి జోడీ.. లేకుంటే ఈడీ వస్తుంది’’ అని విమర్శించారు. నల్లధనం తీసుకొచ్చి రూ.15 లక్షలు చొప్పున పేదల ఖాతాల్లో వేశారా? ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. దుబ్బాక ప్రజలు ఎమ్మెల్యేగా తిరస్కరించిన భాజపా అభ్యర్థి రఘునందన్‌రావుకు లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్‌ దక్కదన్నారు. మూడు నెలల్లో ఆరు పార్టీలు మారిన కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధుకు ఎందుకు ఓటేయాలో చెప్పాలన్నారు.

రూ.2 లక్షల రుణమాఫీ అయిన రైతులు కాంగ్రెస్‌కు, రుణమాఫీ కానివారు భారాసకు ఓటు వేయాలన్నారు. గజ్వేల్‌కు గతంలో భారాస ప్రభుత్వం మంజూరు చేసిన రూ.150 కోట్ల నిధులను నిలిపేసి అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శించారు. ‘‘మహిళలకు రూ.2,500, రూ.4 వేల ఆసరా పింఛన్‌, కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్ష, తులం బంగారం; నిరుద్యోగ భృతి, క్వింటాలు ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇవ్వనందుకు ఓటు వేయాలా’’ అని ప్రశ్నించారు. 42.80 లక్షల మందికి ఆసరా పింఛను పెంచుతామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్‌పై కేసు నమోదు చేయాలన్నారు. వెంకట్రామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ తాము ఇప్పుడిస్తున్న హామీలను రికార్డు చేసుకోవాలని.. గెలిచిన తర్వాత నెరవేర్చకుంటే నడిబజారులో నిలదీయండని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ రోజా శర్మ, డీసీసీబీ ఛైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, బల్దియా ఛైర్మన్‌ రాజమౌళి, గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి  పాల్గొన్నారు.


పాడి రైతులకు బకాయిలు చెల్లించాలి

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాడి రైతులకు పాల బిల్లుల్ని సకాలంలో చెల్లించడం లేదని, 45 రోజుల బిల్లులు పెండింగులో ఉన్నాయని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. పెండింగులో ఉన్న దాదాపు రూ.80 కోట్ల పాల బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంగళవారం హరీశ్‌రావు లేఖ రాశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు