భాజపాలో చేరకుంటే నా అరెస్టు తప్పదట

నెలరోజుల వ్యవధిలో భాజపాలో చేరాలని, లేదంటే ఈడీ చేతిలో అరెస్టయ్యేందుకు సిద్ధంగా ఉండాలని తన సన్నిహితుడి ద్వారా భాజపా తనను సంప్రదించిందని దిల్లీ మంత్రి ఆతిశీ సంచలన ఆరోపణ చేశారు.

Published : 03 Apr 2024 03:33 IST

దిల్లీ మంత్రి ఆతిశీ సంచలన వ్యాఖ్యలు

దిల్లీ: నెలరోజుల వ్యవధిలో భాజపాలో చేరాలని, లేదంటే ఈడీ చేతిలో అరెస్టయ్యేందుకు సిద్ధంగా ఉండాలని తన సన్నిహితుడి ద్వారా భాజపా తనను సంప్రదించిందని దిల్లీ మంత్రి ఆతిశీ సంచలన ఆరోపణ చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు మరో నలుగురు ఆప్‌ నేతలు అరెస్టవుతారని తెలిపారు. తనతో పాటు మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌, ఎమ్మెల్యే దుర్గేశ్‌ పాథక్‌, రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చడ్డాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్టు చేయొచ్చని పేర్కొన్నారు. దిల్లీలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘కేజ్రీవాల్‌ను జైలుకు పంపించినంత మాత్రాన ఆప్‌ విచ్ఛిన్నం కాలేదని భాజపాకు అర్థమైంది. అందుకే పార్టీలో తర్వాతి వరసలో ఉన్న నలుగురు నేతలను జైల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. భాజపా బెదిరింపులకు భయపడేది లేదు’ అని ఆతిశీ స్పష్టం చేశారు.

సీఎం రాజీనామా చేసేందుకు ఒక్క కారణం కూడా లేదు

ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా చేస్తారా? అనే అంశంపై స్పందిస్తూ..‘ఆయన రాజీనామా చేసేందుకు ఒక్క కారణం కూడా లేదు. మద్యం కేసు చార్జీషీట్‌లో ఆయన పేరు లేదు, దోషిగా తేలలేదు. అన్నింటికి మించి ఆయనకు దిల్లీ అసెంబ్లీలో భారీ మెజార్టీ ఉంది. ఒకవేళ కేజ్రీవాల్‌ రాజీనామా చేస్తే..తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చడం భాజపాకు మరింత సులభం అవుతుంది’ ఆతిశీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని