ఇలా పార్టీలోకి వచ్చి... అలా టికెట్‌ పట్టేసి

భాజపాలోకి గత 3 నెలల్లో 14 మంది ఎంపీలు, ఐదుగురు మాజీ ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు, ఒక మాజీ వాయు సేనాధిపతి, ఒక మాజీ న్యాయమూర్తి, ఒక మాజీ రాయబారి, ఒక మాజీ ముఖ్యమంత్రి చేరారు.

Updated : 03 Apr 2024 04:59 IST

3 నెలల్లో 14 మంది ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు మాజీ ఎంపీలు భాజపాలో చేరిక
వీరిలో పలువురికి అవకాశం

ఈనాడు, దిల్లీ: భాజపాలోకి గత 3 నెలల్లో 14 మంది ఎంపీలు, ఐదుగురు మాజీ ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు, ఒక మాజీ వాయు సేనాధిపతి, ఒక మాజీ న్యాయమూర్తి, ఒక మాజీ రాయబారి, ఒక మాజీ ముఖ్యమంత్రి చేరారు. మార్చి 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల జాబితాల్లో ఇందులోని 25 మందికి స్థానం దక్కింది. హైదరాబాద్‌ అభ్యర్థి కొంపెల్ల మాధవి, సినీ నటి కంగనా రనౌత్‌, దాద్రానగర్‌ హవేలీ శివసేన ఎంపీ కళాబెన్‌ దేల్కర్‌, అమరావతి ఇండిపెండెంట్‌ ఎంపీ నవనీత్‌ రాణా భాజపా టికెట్లు ప్రకటించిన తర్వాత ఆ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో సొంతంగా 370కిపైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న భాజపా విజయమే ప్రాతిపదికగా అభ్యర్థులను రంగంలోకి దించుతోంది.

సంస్థాగతంగా బలంగా ఉన్నచోట్ల ఐదారుసార్లు లోక్‌సభకు ఎన్నికైన సీనియర్లను సైతం పక్కనబెట్టి కొత్తవారికి టికెట్లిచ్చింది. పార్టీ బలం అంతగాలేని చోట బయటి పార్టీలో బలంగా ఉన్న వారిని చేర్చుకుని టికెట్లు ఇస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణకు చెందిన ఎంపీలు పి.రాములు, బీబీ పాటిల్‌, మాజీ ఎంపీలు గోడం నగేష్‌, సీతారాం నాయక్‌, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, ఆరూరి రమేష్‌లాంటి వారిని పార్టీలో చేర్చుకుంది. అలాగే బీఎస్పీ నుంచి వచ్చిన ఎంపీ రితేష్‌ పాండే, కాంగ్రెస్‌ ఎంపీలు గీతా కోడ, ప్రణీత్‌ కౌర్‌, రవ్‌నీత్‌ బిట్టు, శివసేన ఎంపీ కళాబెన్‌ దేల్కర్‌, ఇండిపెండెంట్‌ ఎంపీ నవనీత్‌ రాణా, ఆప్‌ ఎంపీ సుశీల్‌ కుమార్‌ రింకూ, బిజూ జనతాదళ్‌ ఎంపీ భర్తృహరి మహతాబ్‌లకు వారు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలనే యథాతథంగా కేటాయించింది.

  • పార్టీలో చేరిన అమెరికాలో మాజీ భారత రాయబారి తరణ్‌జీత్‌ సింగ్‌ సంధుకు అమృత్‌సర్‌, హైకోర్టు జడ్జి పదవికి రాజీనామా చేసి వచ్చిన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్‌ గంగోపాధ్యాయకు తమ్‌లుక్‌ సీట్లను కేటాయించింది.
  • సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు సీతా సోరెన్‌, వరప్రసాద్‌లకు దుమ్కా, తిరుపతి టికెట్లు ఇచ్చింది. ఝార్ఖండ్‌లోని దుమ్కా లోక్‌సభ స్థానానికి తొలి జాబితాలోనే సిట్టింగ్‌ ఎంపీ సునీల్‌ సోరెన్‌ పేరును ప్రకటించిన భాజపా నాయకత్వం మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ వదిన సీతా సోరెన్‌ పార్టీలో చేరిన తర్వాత ఆమెకు కట్టబెట్టింది.
  • గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లోకి వెళ్లి అక్కడ ఓటమిపాలైన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్‌ శెట్టర్‌ను తిరిగి పార్టీలో చేర్చుకుని బెళగావి టికెట్‌ కేటాయించింది.
  • ఇప్పటివరకూ పార్టీలో చేరిన ఉత్తర్‌ ప్రదేశ్‌ లాల్‌గంజ్‌ నియోజకవర్గ బీఎస్పీ సిట్టింగ్‌ ఎంపీ సంగీతా ఆజాద్‌, పశ్చిమ బెంగాల్‌ తమ్‌లుక్‌ ఎంపీ దిబ్యేందు అధికారి, ఒడిశాలోని బిజూ జనతాదళ్‌ ఎంపీ అనుభవ్‌ మొహంతికి టికెట్లు దక్కలేదు. వీరిలో మొహంతికి అసెంబ్లీ టికెట్‌ను భాజపా ఇవ్వనుంది.
  • మాజీ వాయు సేనాధిపతి ఆర్‌కేఎస్‌ బదౌరియా టికెట్‌ కోసం వేచి చూస్తున్నారు.
  • హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 9 మంది మార్చి 23న భాజపా తీర్థం పుచ్చుకున్నారు. జూన్‌ 1న రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు భాజపా టికెట్లు ఇచ్చింది. ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు ఇచ్చిన రాజీనామాలను అక్కడి స్పీకర్‌ ఆమోదించకపోవడంతో ఆ స్థానాలకు ఉప ఎన్నిక సాధ్యం కాలేదు.
  • గత 3 నెలల కాలంలో తమిళనాడు, ఉత్తరాఖండ్‌లకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు విజయ ధరణి, రాజేంద్ర భండారీ, పంజాబ్‌ ఆప్‌ ఎమ్మెల్యే శీతల్‌ అంగురల్‌ భాజపా తీర్థం పుచ్చుకున్నారు.
  • లోక్‌సభ సీట్లు ఆశించి పార్టీలో చేరిన కేరళ మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్‌ కుమార్తె పద్మజా వేణుగోపాల్‌, వారణాశి కాంగ్రెస్‌ మాజీ ఎంపీ రాజేష్‌ కుమార్‌ మిశ్ర, బాలీవుడ్‌ గాయని అనూరాధా పౌడ్వాల్‌లకు ఇప్పటివరకూ అవకాశం దక్కలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు