రేవంత్‌రెడ్డి భాజపాలోకి వెళ్లడం పక్కా!

సీఎం రేవంత్‌రెడ్డి..రాహుల్‌గాంధీ కోసం పనిచేస్తున్నారో, మోదీ కోసం పని చేస్తున్నారో అర్థం కావడం లేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Updated : 03 Apr 2024 04:53 IST

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ జోస్యం

శామీర్‌పేట, న్యూస్‌టుడే: సీఎం రేవంత్‌రెడ్డి..రాహుల్‌గాంధీ కోసం పనిచేస్తున్నారో, మోదీ కోసం పని చేస్తున్నారో అర్థం కావడం లేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత భాజపాలోకి వెళ్లే మొదటి వ్యక్తి రేవంత్‌రెడ్డేనని జోస్యం చెప్పారు. తాను చేస్తున్న ఈ ఆరోపణపై రేవంత్‌రెడ్డి స్పందించకపోవడమే దానికి నిదర్శనమన్నారు. శామీర్‌పేట మండలం అలియాబాద్‌ చౌరస్తాలోని సీఎంఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో మంగళవారం మేడ్చల్‌ నియోజకవర్గ కార్యకర్తలు, ముఖ్యనేతల సమావేశంలో ఆయన ప్రసంగించారు. రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెబుతూ, తప్పుడు ప్రచారం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఆక్షేపించారు. కాంగ్రెసోళ్లు పచ్చి మోసగాళ్లని, కేసీఆర్‌ ఇచ్చిన ఉద్యోగాలు తమ ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపించారు. చైతన్యవంతులైన విద్యార్థులకు ఈ విషయం తెలుసని, వాళ్లే కాంగ్రెస్‌వారి అంతు చూస్తారన్నారు.

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రేవంత్‌రెడ్డికి సవాలు విసిరారు. రేవంత్‌రెడ్డిగానీ, భాజపాగానీ మల్కాజిగిరికి చేసింది గుండుసున్నా అని ఎద్దేవా చేశారు. బండి సంజయ్‌ ప్రధాని మోదీని దేవుడిగా అభివర్ణిస్తారని, మోదీ ఎందుకు దేవుడయ్యాడో ఆయన చెప్పాలని ప్రశ్నించారు. ధరలు పెంచినందుకు ఆయన్ను దేవుడని అనుకోవాలా అంటూ నిలదీశారు. నిజమైన హిందువులు మతం పేరుతో రాజకీయాలు చేయరని తెలిపారు. భారాస ప్రభుత్వం రుణమాఫీ చేయలేదంటూ ఈటల రాజేందర్‌ చేస్తున్న వ్యాఖ్యలపైనా కేటీఆర్‌ స్పందించారు. ఈటల రాజేందర్‌ ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడే కేసీఆర్‌ రూ.16 వేల కోట్ల మేర రైతు రుణాలు మాఫీ చేశారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ మాత్రం రూ.14.50 లక్షల కోట్ల మేర బడా పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేశారని విమర్శించారు. రుణమాఫీ అయినవాళ్లు కాంగ్రెస్‌కు, మిగతావాళ్లు భారాసకు ఓటేయాలని కోరారు. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

తెలంగాణకు తదుపరి సీఎం కేటీఆరే: మల్లారెడ్డి

సమావేశంలో మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణకు తదుపరి సీఎం కేటీఆర్‌ అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, భారాస నియోజకవర్గ ఇన్‌ఛార్జి మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


కాంగ్రెస్‌ నేతలు క్షమాపణ చెప్పాలి: కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌పై మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్‌ నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేశారని.. వారిద్దరూ వెంటనే తనకు క్షమాపణ చెప్పాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. లేకపోతే వారికి లీగల్‌ నోటీసులు పంపిస్తానని, పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుందని ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని