గత ప్రభుత్వం దోపిడీ వ్యవస్థను సృష్టించింది

పంటలను కాపాడేందుకు రోజువారీగా విద్యుత్తు కొనుగోలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Updated : 03 Apr 2024 04:55 IST

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఇల్లెందు, న్యూస్‌టుడే: పంటలను కాపాడేందుకు రోజువారీగా విద్యుత్తు కొనుగోలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలనూ విచ్ఛిన్నం చేసి గత ప్రభుత్వం దోపిడీ వ్యవస్థను సృష్టించిందని ధ్వజమెత్తారు. భద్రాద్రి జిల్లా ఇల్లెందు పట్టణంలోని ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంపు కార్యాలయంలో మహబూబాబాద్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ ఎన్నికల ఇన్‌ఛార్జి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇల్లెందు, పినపాక, డోర్నకల్‌, మహబూబాబాద్‌, నర్సంపేట, భద్రాచలం ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. తుక్కుగూడ సభ విజయవంతం చేయడం... లోక్‌సభ ఎన్నికల వ్యూహరచనపై సుమారు గంటపాటు వారు అంతర్గతంగా చర్చించుకున్నారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌ వానాకాలంలోనే నీరివ్వ లేదని... ఇప్పుడు ఎండాకాలంలో నీరందించడం లేదని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని పేర్కొన్నారు.

పంటల కొనుగోలుకు రాష్ట్రంలో 7,145 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, 92.36 శాతం మందికి రైతుబంధు జమ చేశామని పేర్కొన్నారు. మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన ప్రకారం పంట బీమాను బుధవారం నుంచి పునరుద్ధరిస్తామన్నారు. గొప్ప పాలన అందిస్తున్న ప్రభుత్వానికి పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపి కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. భద్రాద్రి డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య, ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, నర్సంపేట ఎమ్మెల్యే దొంతు మాధవరెడ్డి, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే మురళీనాయక్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్‌, ఇల్లెందు పురపాలక ఛైర్మన్‌ డి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ సమావేశానికి భారాస ఎమ్మెల్యే...

మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో నిర్వహించిన మహబూబాబాద్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి భద్రాచలం నుంచి గెలుపొందిన భారాస ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. ఆయన కాంగ్రెస్‌లో చేరతారంటూ కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తుక్కుగూడ బహిరంగ సభలో రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు