ఖమ్మంపై పీటముడి!

ఖమ్మం లోక్‌సభ సీటుకు కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపిక విషయమై పీటముడి పడింది. ఇది తేలడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

Updated : 03 Apr 2024 03:48 IST

రాహుల్‌తో చర్చించాకే ఖరారయ్యే అవకాశం
అక్కడి అభ్యర్థిని బట్టి.. కరీంనగర్‌పై నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: ఖమ్మం లోక్‌సభ సీటుకు కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపిక విషయమై పీటముడి పడింది. ఇది తేలడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. పార్టీలో చేరే సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చిన హామీ మేరకు ఆయన సోదరుడికి టికెట్‌ ఇవ్వాలని కొందరు, ప్రభుత్వంలో ముఖ్య స్థానాల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు కాకుండా వేరొకరికి అవకాశమివ్వాలని మరికొందరు ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో ఈ సీటుపై నిర్ణయం తీసుకోవడానికి మరో ఐదారు రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. సోమవారం జరిగిన కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశానికి రాహుల్‌ గాంధీ హాజరుకాకపోవడంతో ఆయనతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. కరీంనగర్‌, హైదరాబాద్‌ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల విషయమై దాదాపు నిర్ణయానికి వచ్చినా.. ఖమ్మం అభ్యర్థి ఎంపిక ప్రభావం కరీంనగర్‌ అభ్యర్థిపై పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు పార్టీ జిల్లా అధ్యక్షుడు షమీర్‌ ఉల్లా పేరును ఖరారు చేసినట్లు సమాచారం. కరీంనగర్‌ స్థానానికి పలువురు పోటీ పడినా మొదటి నుంచీ రేసులో ఉన్న ప్రవీణ్‌రెడ్డి, వెలిచాల రాజేందర్‌రావుల పేర్లే తుది పరిశీలనకు వచ్చినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్‌ సీటును పొన్నం ప్రభాకర్‌కు ఇచ్చినప్పుడు ప్రవీణ్‌రెడ్డికి ఎంపీగా పోటీకి అవకాశం ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆయన పేరునే ఖరారు చేసినా, ఖమ్మం అభ్యర్థి ఎవరో తేలిన తర్వాత సామాజిక సమీకరణాలను కూడా పరిగణనలోకి తీసుకొని కరీంనగర్‌ అభ్యర్థిని ఎంపిక చేస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

ముఖ్యుల కుటుంబానికా? ఇతరులకా?

ఖమ్మం లోక్‌సభ సీటుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి నందిని, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్‌తో పాటు పారిశ్రామికవేత్త రాజేంద్రప్రసాద్‌ తదితరులు పోటీపడ్డారు. ప్రభుత్వంలోని ముఖ్యుల కుటుంబ సభ్యులను మినహాయిస్తే బాగుంటుందనే చర్చ నేపథ్యంలో మాజీ ఎంపీ సురేందర్‌రెడ్డి కుమారుడు రఘురామిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. మొదటి నుంచీ కాంగ్రెస్‌లో ఉండి రాజకీయంగా గుర్తింపు పొందిన కుటుంబం కావడంతో ఈయన పేరును ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు రాష్ట్రంలోని ముఖ్యనేత కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. పొంగులేటికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ గురించి సోమవారం నాటి సీఈసీ సమావేశంలో కమిటీ ఛైర్మన్‌ హరీష్‌ చౌధరి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పొంగులేటి పార్టీలో చేరే సమయంలో హామీ ఇచ్చిన మేరకు సీట్లు ఇవ్వలేకపోయామని, ఆయన రావడం వల్లే మరికొందరు కూడా పార్టీలో చేరారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. నందిని, ప్రసాదరెడ్డిల అభ్యర్థిత్వాల విషయమై కూలంకషంగా చర్చించినా.. రాహుల్‌గాంధీతో చర్చించిన తర్వాత ఖరారు చేయాలని నిర్ణయించారు. ముఖ్యనేతల కుటుంబ సభ్యులకు కాకుండా వేరే వారికి ఇవ్వాలనుకుంటే రఘురామిరెడ్డి పేరే ప్రధానంగా ఉండే అవకాశం ఉందని, మరో సామాజికవర్గానికి సీటు కేటాయించే అవకాశమూ లేకపోలేదని పార్టీ సీనియర్‌ నాయకుడొకరు తెలిపారు.


ఆ రెండింటితో పాటే హైదరాబాద్‌ అభ్యర్థి ప్రకటన

కరీంనగర్‌ లోక్‌సభకు ప్రవీణ్‌రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినా ఖమ్మం పీటముడి వీడే వరకు ప్రకటించే అవకాశం లేదని తెలిసింది. ఖమ్మంలో ప్రసాద్‌రెడ్డి లేదా రఘురామిరెడ్డికి ఇస్తే కరీంనగర్‌ అభ్యర్థి ఎంపికపై మళ్లీ చర్చ జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్‌ అభ్యర్థిని కూడా ఆ రెండు స్థానాలతో పాటే ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఈ నెల ఆరున తుక్కుగూడ బహిరంగసభలో పాల్గొనడానికి రాహుల్‌గాంధీ రానున్నందున ఆ రోజు ఖమ్మం అభ్యర్థిత్వంపై ఆయనతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని