అవ్వాతాతల సొమ్మును అస్మదీయులకు దోచిపెట్టారు

గత ఎన్నికల్లో సొంత బాబాయ్‌ హత్యను రాజకీయ లబ్ధి కోసం వాడుకొన్న జగన్‌రెడ్డి.. నేడు పింఛన్ల పంపిణీ విషయంలోనూ అలానే జగన్నాటకం ఆడుతూ అవ్వాతాతలు, దివ్యాంగులకు నమ్మకద్రోహం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Updated : 03 Apr 2024 06:17 IST

సరిపడా నిధులుంటే ఒకటో తేదీకి ముందే విత్‌డ్రా చేసేవారుగా..
నాడు వివేకా హత్య.. నేడు పింఛన్ల  పంపిణీని అడ్డుపెట్టుకుని జగన్‌ కుట్రలు
లబ్ధిదారులు, ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గత ఎన్నికల్లో సొంత బాబాయ్‌ హత్యను రాజకీయ లబ్ధి కోసం వాడుకొన్న జగన్‌రెడ్డి.. నేడు పింఛన్ల పంపిణీ విషయంలోనూ అలానే జగన్నాటకం ఆడుతూ అవ్వాతాతలు, దివ్యాంగులకు నమ్మకద్రోహం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.  మార్చి 16 నుంచి 30 తేదీల మధ్య అస్మదీయ కాంట్రాక్టర్లకు రూ.13 వేల కోట్లు విడుదల చేసిన వైకాపా ప్రభుత్వం.. పింఛనుదారులకు ఇవ్వాల్సిన రూ.రెండు వేల కోట్ల నిధుల్నీ వారికి దోచిపెట్టిందని విమర్శించారు. నిధుల కొరతతోనే పింఛన్ల పంపిణీని జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. సరిపడా నిధులుంటే గతేడాదిలాగే ఏప్రిల్‌ ఒకటో తేదీకి ముందే బ్యాంకుల్లోంచి పింఛను నిధుల్ని ఎందుకు డ్రా చేయలేదని ప్రశ్నించారు. ఈపాటికే పంపిణీ ఎందుకు మొదలుపెట్టలేదని నిలదీశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఆదేశాల్ని ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. మండుటెండలో పింఛనుదారుల్ని కష్టపెట్టి, ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై నెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని జగన్‌ చూస్తున్నారని.. ఇదంతా రాజకీయ లబ్ధి కోసం ఆయన చేస్తున్న కుట్రని మండిపడ్డారు. వైకాపా కుట్రల్ని తిప్పికొట్టాలని కోరుతూ రాష్ట్ర ప్రజలు, పింఛనుదార్లకు  చంద్రబాబు మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ‘‘గతంలో ‘నారాసురరక్త చరిత్ర’ అని నాపై నిందలేశారు. ఇప్పుడూ అలానే చేస్తున్నారు.  ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వాలంటీర్లను నగదు పంపిణీ బాధ్యతల నుంచి ఎన్నికల కమిషన్‌ తప్పించింది. ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇళ్ల వద్దనే పింఛను ఇవ్వాలని సూచించింది. ఈ పరిణామాన్ని వైకాపా కుట్రలు, కుతంత్రాలకు ఉపయోగించుకుంటున్న విధానాన్ని ప్రజలు, లబ్ధిదారులు అర్థం చేసుకోవాలి’ అని చంద్రబాబు కోరారు.

ఒక్క రోజులో పంపిణీ పూర్తి చేయొచ్చు

‘క్షేత్రస్థాయిలో 1.35 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, మరోవైపు  రెవెన్యూ, సెర్ప్‌, మెప్మా, పంచాయతీరాజ్‌ ఉద్యోగులు ఉన్నారు. వీరి సహకారంతో ఒక్కరోజులో అందరికీ పింఛన్లు అందించే వెసులుబాటు ఉంది. అయినా  సిబ్బంది లేరని,  లబ్ధిదారుల్ని గుర్తించడం కష్టమని ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోంది. ఇది ముమ్మాటికీ కుట్రే’ అని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని