తెదేపా కార్యకర్తలపై వైకాపా ఎమ్మెల్యే అనుచరుల దాడి

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో వైకాపా ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ అనుచరులు తెదేపా కార్యకర్తలపై రాడ్లు, కుర్చీలతో దాడి చేశారు.

Updated : 03 Apr 2024 05:59 IST

మూడు రాజధానులపై ప్రశ్నించినందుకు దాష్టీకం

నందిగామ, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో వైకాపా ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ అనుచరులు తెదేపా కార్యకర్తలపై రాడ్లు, కుర్చీలతో దాడి చేశారు. మూడు రాజధానులపై ప్రశ్నించినందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. చందర్లపాడు మండల     ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక అధ్యక్షుడిగా నల్లాని రామలక్ష్మణప్రసాద్‌ అలియాస్‌ కిషోర్‌, నందిగామ మండల   అధ్యక్షుడిగా నల్లాని నరసింహరావు వ్యవహరిస్తున్నారు. 

నందిగామ 12వ వార్డులో మంగళవారం వైకాపా అభ్యర్థి జగన్మోహనరావు ఎన్నికల ప్రచారానికి వచ్చారు. అదే వార్డులో కిషోర్‌, నరసింహరావు నిర్మించుకుంటున్న ఇంటి కింద  నీడ కోసం ఎమ్మెల్యే అనుచరులు కూర్చున్నారు. ఆ సమయంలో కిషోర్‌ అతని సోదరుడు నరసింహరావులతో ఎమ్మెల్యే అనుచరులకూ మధ్య మూడు రాజధానులపై చర్చ వచ్చింది. మూడు రాజధానులకు మద్దతుగా ఎమ్మెల్యే జగన్మోహనరావు పాదయాత్ర చేయకుండా ఉంటే బాగుండేదని నల్లాని అన్నారు. పక్కనున్న మైలవరం, జగ్గయ్యపేట ఎమ్మెల్యేలు వసంత వెంకటకృష్ణప్రసాద్‌, సామినేని ఉదయభాను రాజధాని అంశంపై తటస్థంగా ఉన్నారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనికి తోడు కిషోర్‌ బైక్‌పై ఎన్టీఆర్‌, చంద్రబాబు చిత్రాలు ఉండటంతో వారిని తెదేపా కార్యకర్తలుగా ఎమ్మెల్యే అనుచరులు భావించి ఎమ్మెల్యే అనుచరులు వారిని విచక్షణారహితంగా కొట్టారు. పట్టణానికి చెందిన ఖాజా పైపుతో దాడి చేయగా, మిగిలిన వారు రాడ్లు, కుర్చీలతో కొట్టారు. కాళ్లతో తన్నారు. కిషోర్‌కు తీవ్రంగానూ, నరసింహరావుకు స్వల్పంగా గాయాలయ్యాయి. వెంటనే వారిని విజయవాడలోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. బాధితులను తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య పరామర్శించారు. ఆమె భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. ప్రశ్నిస్తే కొడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీపీ రవికిరణ్‌, సీఐ హనీష్‌లు బాధితులతో మాట్లాడారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

బాధితులపైనా కేసు

సీసీ కెమెరాల్లో ఎమ్మెల్యే అనుచరులే దాడి చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నా.. కిషోరు సోదరులే తమను కులం పేరుతో దూషించి కొట్టారని ఎమ్మెల్యే అనుచరులు వినుకొండ రామారావు, షేక్‌ ఖాజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని