మిగిలిన రెండు స్థానాలకూ జనసేన అభ్యర్థులు ఖరారు!

రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చే అవకాశం

Updated : 03 Apr 2024 06:27 IST

అవనిగడ్డ నుంచి బుద్ధప్రసాద్‌.. పాలకొండ నుంచి నిమ్మక జయకృష్ణ బరిలోకి!
రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చే అవకాశం

ఈనాడు, అమరావతి: తెదేపా, బీజేపీతో పొత్తులో భాగంగా రాష్ట్రంలో 21 శాసనసభ స్థానాలకు పోటీ చేస్తున్న జనసేన పార్టీ మరో రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అక్కడ కూడా అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ను బరిలో నిలపనున్నారు. రెండు రోజుల కిందటే ఆయన పిఠాపురం వెళ్లి పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు. వివిధ సమీకరణాలు, పేర్లు పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం జరిగింది. అదే తరహాలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గానికి నిమ్మక జయకృష్ణను ఖరారు చేసినట్లు తెలిసింది. ఆయన కూడా తాజాగా జనసేనలో చేరారు. మరోవైపు ఉమ్మడి కడప జిల్లా రైల్వేకోడూరులో భాస్కరరావును అభ్యర్థిగా ఖరారు చేసినా.. వివిధ కారణాలతో ఆయన్ను మార్చే అంశంపై జనసేన దృష్టి సారించినట్లు తెలిసింది. రైల్వేకోడూరు నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి రూపానంద్‌రెడ్డికి సన్నిహితుడైన ముక్కావారిపల్లె సర్పంచి, తాజాగా జనసేనలో చేరిన అరవ శ్రీధర్‌ను ఆ స్థానంలో బరిలోకి దింపే అంశాన్ని పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ అభ్యర్థిత్వాల విషయం బుధవారానికి కొలిక్కి రావచ్చని తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని