మా కుటుంబంపై సీఎం జగన్‌ నిరాధార ఆరోపణలు చేశారు

ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా తన కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేసిన సీఎం జగన్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనాకు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మంగళవారం లేఖ రాశారు.

Published : 03 Apr 2024 05:39 IST

ఇది ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనే.. చర్యలు తీసుకోండి
సీఈఓకి భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా తన కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేసిన సీఎం జగన్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనాకు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మంగళవారం లేఖ రాశారు. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ చిరునామాతో భారీ ఎత్తున మాదకద్రవ్యాలను తీసుకువచ్చిన కంటెయినర్‌ వ్యవహారంలో ఆ సంస్థలో మా కుటుంబ సభ్యులకు వాటా ఉందని సీఎం జగన్‌ ప్రొద్దుటూరులో మార్చి 27న జరిగిన బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని ఫిర్యాదు చేశారు. ఆ సంస్థతో తమ కుంటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

పింఛన్లకు బటన్‌ నొక్కలేరా సీఎం? 

పింఛన్ల పంపిణీలో వాలంటీర్లు దూరంగా ఉండాలనే ఈసీ ఆదేశాలను ఆసరాగా చేసుకుని, ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలపై నెట్టేసి తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవాలని సీఎం జగన్‌ చూస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. 2019కి పూర్వమున్న ప్రభుత్వాలు వాలంటీర్లు లేకుండానే అందించాయని గుర్తుచేశారు. ‘130 సార్లు బటన్‌ నొక్కి లబ్ధిదారులకు డబ్బు పంపిణీ చేశానంటూ ఊదరగొట్టే జగన్‌.. అదే విధానంలో పింఛన్‌ ఎందుకు పంపిణీ చేయడం లేదు? ఎన్నికల సమయంలో వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పింఛన్‌ పంపడం వెనుక ఆయన ఏం ఆశిస్తున్నారో చెప్పాలి. ఎన్నికల నిబంధనల ప్రకారం వాలంటీర్లను ఈసీ పక్కన పెడితే సీఎం జగన్‌ రాజకీయం చేస్తున్నారు’ అని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని