జనం మధ్య పవనోత్సాహం.. పిఠాపురంలో అడుగడుగునా నీరాజనాలు

మండుటెండల్లో చెమటలు కారిపోతున్నా.. నెత్తి మాడిపోతున్నా ఎవరూ లెక్కచెయ్యలేదు. అభిమాన నాయకుడితో చేయి కలపాలని ఆరాటపడ్డారు.

Updated : 03 Apr 2024 08:25 IST

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, కొత్తపల్లి, పిఠాపురం: మండుటెండల్లో చెమటలు కారిపోతున్నా.. నెత్తి మాడిపోతున్నా ఎవరూ లెక్కచెయ్యలేదు. అభిమాన నాయకుడితో చేయి కలపాలని ఆరాటపడ్డారు. ఫొటోలు తీసుకోవాలని ఉత్సాహపడ్డారు. సాగర తీరంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు జనం అడుగడుగునా నీరాజనాలు పలికారు. నాలుగోరోజు ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని యు.కొత్తపల్లి, పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో పర్యటించారు. మాధవపురం, ఇసుకపల్లి, నాగులపల్లి, పొన్నాడ, మూలపేట, రామన్నపాలెం, అమీనాబాద్‌, ఉప్పాడ, కొత్తపల్లి, వాకతిప్ప, యండపల్లి కూడలి, కొండెవరం, నవకండ్రవాడ, పిఠాపురం పట్టణం మీదుగా కుమారపురం వరకు పర్యటించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4.30 గంటల వరకు 35 కి.మీ. మేర రోడ్‌షో సాగింది.

జనంతో మమేకమైన జనసేనాని..

‘అన్నా బాగున్నారా.. మా వీధికి రా అన్నా.. మా ఇంటికి రా అన్నా..’ అంటూ మత్స్యకారులు, ఎస్సీ మహిళలు, గ్రామీణులు ఆత్మీయంగా ఆహ్వానిస్తుంటే కాదనలేక ఆయన ప్రతి గడప దగ్గరా ఆగారు. ఆరుబయట మంచాల పైన, గుమ్మాల దగ్గర కాసేపు కూర్చుని జనసేనాని జనంతో ఆప్యాయంగా మమేకం అయ్యారు. ఇసుకపల్లి- నాగులపల్లి రోడ్డులో కొబ్బరి బొండాలు అమ్మే తాతబ్బాయి దగ్గర కాసేపు కూర్చుని సమస్యలు విన్నారు. ‘ఎమ్మెల్యేగా గెలిచాక నాకు ఇల్లు కట్టివ్వాలి’ అని తాతబ్బాయి కోరారు. పొన్నాడలో సపోటా తోటల వద్ద కౌలు రైతులతో మాట్లాడారు. వరి పొలాలు పరిశీలించారు. మత్స్యకారుడు ఏడిది శేషు ఇంటి దగ్గర నులక మంచంపై కూర్చుని ముచ్చటించారు. కొత్తగా పెళ్లైన మణికంఠస్వామి, అన్నపూర్ణలకు పవన్‌ కల్యాణ్‌ ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.

ఆత్మీయ సమావేశానికి అనుమతి లేదట!

‘మీ కష్టాలను తెలుసుకోవాలని ఉంది.. ఆత్మీయ సమావేశానికి 48 గంటల ముందు ఎన్నికల సంఘం అనుమతి కోరాం. కానీ ఎందుకో అనుమతి రాలేదు. మీరు బాధపడొద్దు. రెండు మూడు రోజుల్లో వచ్చి మళ్లీ కలుస్తాను’.. అని పవన్‌ కల్యాణ్‌ మహిళలకు హామీ ఇచ్చారు. యు.కొత్తపల్లి మండల కేంద్రంలో మంగళవారం ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేయడంతో పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు. అంతలో అక్కడకు చేరుకున్న ఎన్నికల సంచార తనిఖీ బృందం అధికారులు సమావేశానికి అనుమతి లేదని అడ్డుకున్నారు. ముందుగానే అనుమతి కోరినా ఎందుకు ఇవ్వడంలేదని, తొలిరోజు పర్యటనలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైందని జనసేన నాయకులు అసహనం వ్యక్తంచేశారు. ఉదయం నుంచే వచ్చి నిరీక్షిస్తున్న మహిళలు ఆత్మీయ సమావేశానికి ఆటంకం ఎదురవడంతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో పవన్‌.. ‘వాళ్ల చేతిలో రూల్స్‌ ఉన్నాయి. కారణాలు తెలియదుగానీ పర్మిషన్‌ ఇవ్వలేదు. పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ఇంకోరోజు వస్తానని చెప్పి వారిని శాంతింపజేశారు. అనుమతి పత్రాలు లేనందున అడ్డుకున్నామని ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు బుర్రా వేణుగోపాల్‌, ఆర్‌.వి.ప్రసాద్‌ స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని