వైకాపా శవ రాజకీయం

వైకాపా నాయకుల నీచ రాజకీయాలు రోజురోజుకూ పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. వీళ్లు ఇంతకంటే ఇంకేం దిగజారుతారులే అని ఎవరైనా అనుకుంటే ఆ అంచనా తప్పని పదేపదే నిరూపిస్తున్నారు.

Updated : 03 Apr 2024 09:21 IST

వృద్ధుడి సాధారణ మరణం.. దానిని అడ్డం పెట్టుకుని తెదేపాపై బురద చల్లే ప్రయత్నం
పింఛనుతో ముడిపెట్టి యాగీ చేయడానికి కుటిలయత్నం
‘ఇలా చెప్పాలంటూ’ మృతుడి  కుటుంబీకులకు వైకాపా నాయకులు, వాలంటీరు, సాక్షి విలేకరుల తర్ఫీదు  
శిక్షణ సంభాషణల ఆడియోలు లీకై కుతంత్రం బట్టబయలు

వెంకటగిరి, న్యూస్‌టుడే: వైకాపా నాయకుల నీచ రాజకీయాలు రోజురోజుకూ పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. వీళ్లు ఇంతకంటే ఇంకేం దిగజారుతారులే అని ఎవరైనా అనుకుంటే ఆ అంచనా తప్పని పదేపదే నిరూపిస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లాలో ఓ వృద్ధుడి సాధారణ మరణాన్ని సైతం పింఛను వ్యవహారంతో ముడిపెట్టి, దాన్ని ప్రతిపక్షానికి అంటగట్టేందుకు కుటిలయత్నం చేశారు. ఆ మేరకు మృతుడి కుటుంబీకులకు.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సొంత ఛానలైన సాక్షి విలేకరులు, వైకాపా నాయకులు కలిసి తర్ఫీదు ఇస్తున్న సంభాషణల ఆడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఈ కుతంత్రం బట్టబయలైంది. తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన వృద్ధుడు బొడిచర్ల వెంకటయ్య (80) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలోని కుమార్తె వద్ద ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.

గత నెల 31న ఆయన తిరుపతి నుంచి తన సొంతూరైన వెంకటగిరికి వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం మృతి చెందారు. ఆయన సాధారణ మరణాన్ని.. ప్రతిపక్ష తెదేపాపై బురద చల్లేందుకు వినియోగించుకోవాలని భావించిన వైకాపా నాయకులు.. శవ రాజకీయం మొదలుపెట్టారు. సాక్షి విలేకరులు అను, భాస్కర్‌, వాలంటీరు బాలాజీ, వైకాపా నేత కృష్ణయ్యతో పాటు మరికొందరు అధికార పార్టీ నాయకులు వెంకటయ్య ఇంటి వద్దకు చేరుకుని తప్పుడు ప్రచారం ప్రారంభించారు.

‘‘ఒకటో తేదీన పింఛను ఇస్తారని తెలిసి మా మామ గారు.. తిరుపతి నుంచి వెంకటగిరికి వచ్చారు. వచ్చి రావటంతోనే పింఛను ఇవ్వడానికి వాలంటీరు వచ్చారా? అని అడిగారు. ఈసారి వాలంటీరు తెచ్చివ్వరట.. 3వ తేదీన సచివాలయం వద్దకు వెళ్తే అక్కడ ఇస్తారట అని చెప్పాను. ఆ మాట విన్న ఆయన అక్కడే కుప్పకూలిపోయి.. గుండె ఆగి చనిపోయారు’’ అంటూ మీడియాతో చెప్పాలని వెంకటయ్య కోడలికి వైకాపా నాయకులు, వాలంటీరు, సాక్షి విలేకరులు తర్ఫీదు ఇచ్చారు. ఆమె ఆ వాక్యాలను చెప్పేందుకు తడబడుతుంటే. మళ్లీమళ్లీ చెప్పించారు. వెంకటయ్య కుమార్తె సుజాతతోనూ అవే మాటలు వల్లె వేయించారు.

చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటం వల్ల, పింఛను నిలిపేసినందుకు వెంకటయ్య మృతి చెందారంటూ చెప్పాలని, అలా అయితే ముఖ్యమంత్రి జగన్‌ ఆర్థిక సాయం చేస్తారంటూ.. మృతుడి కుటుంబీకులపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో వారంతా వైకాపా నాయకులు, సాక్షి విలేకరులు చెప్పినట్టుగానే మీడియాతో మాట్లాడారు. అయితే వారు అలా పదేపదే ‘శిక్షణ ఇచ్చి’ చెప్పిస్తున్న ఆడియోలు కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో వైకాపా కుట్ర బయటపడింది. ఆ పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, వైకాపా శ్రేణులతో కలిసి బాధితులను పరామర్శించడానికి వచ్చి ‘ఇది చంద్రబాబు చేసిన హత్యే’ అంటూ అదే పాట పాడుతూ అదే ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేయడానికి ప్రయత్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని