చట్టంలో ఎవరికీ లేని మినహాయింపులు జగన్‌కే ఎందుకు?

చట్టంలో ఎవరికీ లేని మినహాయింపులు సీఎం జగన్‌ ఒక్కరికే ఉన్నాయా అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు.

Updated : 03 Apr 2024 06:08 IST

ఇది న్యాయస్థానాల్ని మేనేజ్‌ చేయడం కాదా?
తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

ఈనాడు డిజిటల్‌, అమరావతి: చట్టంలో ఎవరికీ లేని మినహాయింపులు సీఎం జగన్‌ ఒక్కరికే ఉన్నాయా అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. 12 ఏళ్లుగా కోర్టు విచారణకు హాజరుకాకపోవడం న్యాయస్థానాల్ని మేనేజ్‌ చేయడం కాదా అని విమర్శించారు. ఎదుటివారిని దొంగలు, ఆర్థిక నేరగాళ్లు, విద్రోహశక్తులని విమర్శించే జగన్‌.. ఈ లక్షణాలన్నీ తనవేనని మర్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్‌ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ‘‘హెటిరో, అరబిందో కంపెనీలకు తెలంగాణలోని జడ్చర్లలో ఎకరం రూ.7 లక్షల చొప్పున 250 ఎకరాల్ని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కేటాయించింది. ప్రతిగా వారు రూ.29.5 కోట్లను జగన్‌ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టారు. విశాఖలో రాంకీకి భూముల కేటాయింపుతో జగతి పబ్లికేషన్స్‌కు రూ.10 కోట్లు అందాయి. ఇలా జగన్‌ అక్రమాస్తుల కేసులపై సీబీఐ 11, ఈడీ 5 ఛార్జిషీట్లు వేసింది’’ అని వర్ల రామయ్య పేర్కొన్నారు. దేశ ఆర్థికవ్యవస్థను నాశనం చేసిన వారిని శిక్షించకపోతే మొత్తం వ్యవస్థే నాశనమైపోతుందని జగన్‌ కేసుల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని ఆయన గుర్తుచేశారు.

పెగాసెస్‌తో ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారు

పెగాసెస్‌ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించి ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈసీ) ముకేశ్‌కుమార్‌ మీనాకు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఇజ్రాయెల్‌ నుంచి కొనుగోలు చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌తో డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, ఇంటెలిజెన్స్‌ డీజీ రామాంజనేయులు ట్యాపింగ్‌కు పాల్పడుతున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘అనర్హత వేటు వేయడానికి అన్ని అర్హతలున్నా వీరిద్దరిపై ఈసీ చర్యలు తీసుకోలేదు. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌లు ఏం మాట్లాతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారో వినే పనిలోనే వీరున్నారు. డీజీపీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా పెగాసెస్‌ వాడటం లేదని బహిరంగ ప్రకటన చేయాలి. ఇలాగే తెలంగాణలో ట్యాపింగ్‌కు పాల్పడిన అధికారులు కటకటాల పాలయ్యారు’ అని హెచ్చరించారు. ‘వైకాపాకు అనుకూలంగా వ్యవహరించిన పల్నాడు, చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, నెల్లూరు ఎస్పీలపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. మోదీ సభకు అన్ని విధాల ఆటంకం కల్గించిన ఐజీ పాలరాజును పక్కన పెట్టింది. చట్టాన్ని దాటి వ్యవహరించే అధికారులకు ఇదే గతి పడుతుంది’ అని హెచ్చరించారు. ఫిర్యాదు చేసిన వారిలో తెదేపా బ్రాహ్మణ సాధికార సాధన కన్వీనర్‌ బుచ్చి రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి నియామకం నిబంధనల ఉల్లంఘనే

విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి మల్లికార్జునను కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ సభ్యుడిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని వర్ల రామయ్య ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన సహాధ్యాయి అని, గతంలో సీఎం జగన్‌కు సంబంధించిన కేసుల్ని ఆయనే చూసేవారని తెలిపారు. మల్లికార్జున నియామకంపై సమగ్ర దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వర్ల రామయ్య లేఖ రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని