ఆర్‌ఈసీకి వడ్డీ కూడా కట్టలేరా?

రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ) నుంచి తీసుకున్న రూ.38,666 కోట్ల రుణానికి సుమారు రూ.1,516 కోట్ల వడ్డీని జగన్‌ ప్రభుత్వం బకాయి పెట్టిందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు.

Updated : 03 Apr 2024 06:24 IST

ఆర్బీఐకి ఫిర్యాదు చేస్తామన్న హెచ్చరికలు సిగ్గుచేటు కాదా?
జగన్‌ ప్రభుత్వంపై పట్టాభిరామ్‌ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ) నుంచి తీసుకున్న రూ.38,666 కోట్ల రుణానికి సుమారు రూ.1,516 కోట్ల వడ్డీని జగన్‌ ప్రభుత్వం బకాయి పెట్టిందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు. వడ్డీ చెల్లించకపోతే ఆర్బీఐకి ఫిర్యాదు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో ఆర్‌ఈసీ ఎండీ హెచ్చరించడం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా? అని నిలదీశారు. అస్మదీయ కంపెనీలకు విద్యుత్తు ప్రాజెక్టుల్ని దోచిపెట్టబట్టే గతంలో రూ.వందల్లో వచ్చే బిల్లులు.. నేడు వేల రూపాయలకు పెరిగాయని దుయ్యబట్టారు. జగన్‌రెడ్డి ఈ అయిదేళ్లలో పది సార్లు ఛార్జీలు పెంచి, సుమారు రూ.27,442 కోట్ల భారం ప్రజలపై మోపారని విమర్శించారు. ఛార్జీల బాదుడుతో దోచుకున్న దాంట్లో సగం కూడా అమ్మఒడి లాంటి పథకాలకు ఖర్చు చేయలేదని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘చివరికి మరుగుదొడ్డిని కూడా వదలకుండా జగన్‌ పన్నుల భారం మోపారు. చంద్రబాబు హయాంలో మిగులు విద్యుత్తు రాష్ట్రంగా ఉన్న ఏపీని.. నేడు విద్యుత్తు కోతలకు నిలయంగా మార్చారు. సౌర విద్యుత్తు ప్రాజెక్టుల పేరుతో బినామీ కంపెనీలకు రూ.వేల కోట్ల విలువైన భూముల్ని దోచిపెట్టారు. అప్పుల కోసం వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు అమరుస్తూ రైతుల మెడకు ఉరితాళ్లు బిగించారు’’ అని పట్టాభిరామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులపై శ్రద్ధ ఉంటే ప్రజలపై నేడు ఇంత మొత్తంలో భారం పడేది కాదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు