సంక్షిప్తవార్తలు(15)

త్వరలో తాను భాజపాలో చేరనున్నట్లు కర్ణాటకలోని మండ్య ఎంపీ సుమలత అంబరీశ్‌ (స్వతంత్ర) ప్రకటించారు.

Updated : 04 Apr 2024 05:38 IST

భాజపాలోకి సుమలత

ఈనాడు, బెంగళూరు: త్వరలో తాను భాజపాలో చేరనున్నట్లు కర్ణాటకలోని మండ్య ఎంపీ సుమలత అంబరీశ్‌ (స్వతంత్ర) ప్రకటించారు. 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఆమె ఏడాది కిందటే భాజపాకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా కాకుండా ఆ పార్టీ నుంచి టికెట్‌ పొందేందుకు ప్రయత్నించారు. భాజపా, జేడీఎస్‌ పొత్తు నేపథ్యంలో మండ్య స్థానాన్ని దళ్‌కు కేటాయించడంతో కంగుతిన్న సుమలత ప్రధాని ఫోనుతో మెత్తబడ్డారు. బుధవారం మండ్యలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్‌డీఏ అభ్యర్థి కుమారస్వామికి మద్దతిచ్చేందుకు నిర్ణయించినట్లు సుమలత ప్రకటించారు.


కమల దళంలోకి బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల తరుణంలో ప్రముఖ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ కాంగ్రెస్‌కు షాకిచ్చారు. ఆయన హస్తం పార్టీని వీడి భాజపా గూటికి చేరారు. దిల్లీలో బుధవారం ఆ పార్టీ నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. బాక్సింగ్‌లో భారత్‌ తరఫున తొలి ఒలింపిక్‌ పతకం సాధించిన విజేందర్‌.. 2019లో కాంగ్రెస్‌లో చేరారు. గత సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ దిల్లీ నుంచి పోటీ చేసి భాజపా అభ్యర్థి రమేశ్‌ బిధూరీ చేతిలో ఓటమి పాలయ్యారు.


లోక్‌సభ ఎన్నికలకు ఫరూఖ్‌ అబ్దుల్లా దూరం

శ్రీనగర్‌: నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) అధ్యక్షుడు, శ్రీనగర్‌ సిట్టింగ్‌ ఎంపీ ఫరూఖ్‌ అబ్దుల్లా అనారోగ్యం కారణంగా ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. బుధవారం ఇక్కడ జరిగిన పార్టీ కార్యక్రమంలో ఫరూఖ్‌ కుమారుడు, ఎన్‌సీ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా ఈ మేరకు ప్రకటించారు.


హామీలపై ప్రశ్నించినందుకే సస్పెండ్‌ చేశారు: బక్క జడ్సన్‌

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: అధికారంలోకి రాగానే అమలు చేస్తామని ప్రకటించిన పలు హామీల గురించి ప్రశ్నించినందుకే తనను కాంగ్రెస్‌ నుంచి సస్పెండ్‌ చేశారని బక్క జడ్సన్‌ ఆరోపించారు. విధివిధానాలు సరిగాలేకుండా తనను పార్టీ నుంచి చిన్నారెడ్డి తప్పించారని బుధవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ మూలాలను, సిద్ధాంతాలను చెరిపేస్తున్నారని, లౌకిక భావాలను తుంగలో తొక్కుతున్నారన్నారు. తనను కక్షతోనే కుట్రపూరితంగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి బహిష్కరించారన్నారు. ఇకపై తెలంగాణ వనరుల రక్షణ సమితి పేరుతో తన కార్యాచరణను కొనసాగిస్తానని ప్రకటించారు.  


జమ్ములో పీడీపీ, ఎన్‌సీలు విడివిడిగా పోటీ

శ్రీనగర్‌: జమ్ము-కశ్మీర్‌లో విపక్ష కూటమి ‘ఇండియా’లో భాగస్వామ్య పార్టీలైన పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ(పీడీపీ), నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ)లు లోక్‌సభ ఎన్నికల్లో 3 స్థానాల్లో విడివిడిగా పోటీ చేయనున్నాయి. తమను సంప్రదించకుండానే ఒంటరిగా పోటీ చేస్తామని ఎన్‌సీ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా ప్రకటించారని, కశ్మీర్‌లోని మూడు లోక్‌సభ స్థానాలకు పోటీచేయడం తప్ప తమ దగ్గర ఇంకో మార్గం లేదని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు.


కేసీఆర్‌ లాంటి ప్రతిపక్ష నేత ఉండటం దురదృష్టకరం: కోదండరెడ్డి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కేసీఆర్‌ లాంటి ప్రతిపక్ష నేత ఉండటం దురదృష్టకరమని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోలేదని..ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలకు కాంగ్రెస్సే కారణమని ఎండిన పంటలు చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన బుధవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు నకిలీ విత్తనాల కుంభకోణం జరిగి వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ నాలుగు నెలల్లో 63 మంది రైతు ఆత్మహత్యలు జరిగాయి. అందులో వేర్వేరు కారణాలతో చనిపోయినవారు సగం మంది ఉన్నారు. రైతుల మీద ప్రేముంటే ఖమ్మంలో రైతులకు భేడీలు ఎందుకు వేయించారు?’’ అని కోదండరెడ్డి మండిపడ్డారు.


ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలి: లక్ష్మణ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కాంగ్రెస్‌, భారాసలు డ్రామాలు ఆడుతున్నాయని దీనిపై ప్రజలకు నమ్మకం లేదని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కె.లక్ష్మణ్‌ అన్నారు. బుధవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌ ఫోన్‌ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. సీబీఐకి అప్పగించకుంటే గవర్నర్‌ని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. సీబీఐ దర్యాప్తుతోనే అసలు దోషులు బయటికి వస్తారన్నారు. రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్‌ స్థానాలు భాజపా గెలుస్తుందని లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు.


కాంగ్రెస్‌లో సంజయ్‌ నిరుపమ్‌పై ఆరేళ్ల బహిష్కరణ వేటు

దిల్లీ: మహారాష్ట్రలో తమ పార్టీ నేత, మాజీ ఎంపీ సంజయ్‌ నిరుపమ్‌పై కాంగ్రెస్‌ కొరడా ఝళిపించింది. ఆరేళ్లపాటు ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. క్రమశిక్షణారాహిత్యంతో వ్యవహరించడం, పార్టీ వ్యతిరేక ప్రకటనలు చేయడమే ఇందుకు కారణమని బుధవారం ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. సంజయ్‌ని స్టార్‌ క్యాంపెయినర్ల జాబితా నుంచి తప్పించినట్లు వెల్లడించింది. మహా వికాస్‌ ఆఘాడీ (ఎంవీఏ)లో భాగస్వామ్య పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ మిత్రపక్షం శివసేన (యూబీటీ)ను లక్ష్యంగా చేసుకొని ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడం గమనార్హం.


5 నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

ఈనాడు, అమరావతి: ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఈ నెల 5 (శుక్రవారం) నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా కాసినాయన మండలం అమగంపల్లి నుంచి ఆమె బస్సు యాత్ర చేపడతారు. కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేస్తున్నందున అక్కడి నుంచే ప్రచారం మొదలుపెట్టాలని నిర్ణయించారు.


వైకాపాకు శవ రాజకీయాలు అలవాటే: బుద్ధా వెంకన్న

తాడేపల్లి, న్యూస్‌టుడే: ఎన్నికల ముందు శవ రాజకీయాలు వైకాపాకు అలవాటేనని తెదేపా నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. పెనమలూరులో వృద్ధురాలు మృతి నేపథ్యంలో చంద్రబాబు ఇంటి ముట్టడికి మంత్రి జోగి రమేష్‌ పిలుపునివ్వడంతో బుద్ధా వెంకన్న, మంగళగిరి నియోజకవర్గ తెదేపా నాయకులు, కార్యకర్తలు బుధవారం రాత్రి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ.. ‘తలా తోక లేకుండా జోగి రమేశ్‌ మాట్లాడితే పరిగెత్తించి కొడతాం. చంద్రబాబు ఇంటిపై గతంలో పోలీసుల అండతో దాడికి యత్నించి మంత్రి పదవి పొందారు. మళ్లీ అలాంటి ప్రయత్నం చేయాలనుకుంటున్నారు ఇలాంటివి సాగనివ్వం. పింఛన్లు వైకాపానే ఆపి, ఆ నెపాన్ని చంద్రబాబుపై వేస్తున్నారు’ అని మండిపడ్డారు.


వాలంటీర్లు రాజీనామా చేయాలని  వైకాపా పెద్దల ఒత్తిళ్లు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: వాలంటీరు బాధ్యతల నుంచి ఇప్పుడు తప్పుకుంటే మూడు నెలల వేతనం రూ.15వేలు, ఎన్నికల్లో పనిచేసేందుకు మరో రూ.15 వేలు కలిపి రూ.30వేలు ఇస్తామని.. దీనికి అంగీకరించకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగిస్తామని వైకాపా పెద్దలు వాలంటీర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడలో ఇప్పటికే వారితో రెండుమూడు చోట్ల సమావేశాలు నిర్వహించారు. మొదట్లో రాజీనామాలు చేయడానికి వారు నిరాకరించారు. ప్రలోభాలు ఎర చూపి, తొలగిస్తామని భయపెట్టి దారికి తెచ్చుకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో బుధవారం 185 మంది  వార్డు వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.


ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేయాలి: సీపీఎం

ఈనాడు, అమరావతి: వృద్ధులకు ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేయించకుండా.. వారిని గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు రప్పించే ప్రభుత్వ అసమర్థ చర్యను సీపీఎం తీవ్రంగా ఖండించింది. తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెంలోని నెరబైలు సచివాలయం వద్ద షేక్‌ అసమ్‌ నన్నే సాహెబ్‌ అనే వృద్ధుడు మరణించడంపై విచారం వ్యక్తం చేసింది. ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షలు పరిహారంగా చెల్లించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. సీపీఎం కార్యకర్తలు పింఛన్‌దారులకు మద్దతుగా నిలిచి, ఇళ్ల వద్దే సకాలంలో పింఛన్లు ఇవ్వాలని కోరుతూ ఆందోళనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మూడో తేదీ వచ్చినా పింఛన్లు పంపిణీ చేయకుండా వృద్ధులు, వికలాంగులు, మహిళల్ని ఎండలో తిప్పడం భావ్యం కాదన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా సచివాలయాల వద్ద షామియానాలు ఏర్పాటు చేయాలని కోరారు. రాజకీయ సమరంలో వృద్ధులు, మహిళలు, వికలాంగులు సమిధలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.


ఈసీ ఆదేశాలు బేఖాతరు
వర్ల రామయ్య

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘మండుటెండలో బుధవారం సచివాలయాలకు వచ్చినా పింఛన్‌ సొమ్ము జమ కాలేదంటూ పలువురు సిబ్బంది వృద్ధులను వెనక్కు పంపడమేంటి? సకాలంలో పింఛన్‌ ఇవ్వకపోవడం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేయడమే. పింఛన్‌ సొమ్ము సచివాలయాల ఖాతాల్లో జమ చేసి లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలి. లబ్ధిదారులందరినీ సచివాలయాలకు వచ్చి పింఛన్‌ తీసుకోవాలని చెప్పడం దుర్మార్గం’ అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి బుధవారం లేఖ రాశారు.


అప్పులతో ఆర్థిక సంవత్సరానికి స్వాగతమా?
జగన్‌ సర్కారు తీరుపై సీపీఐ విమర్శ

ఈనాడు, అమరావతి: కొత్త ఆర్థిక సంవత్సరం తొలిరోజే జగన్‌ ప్రభుత్వం రిజర్వు బ్యాంకు నుంచి రూ.4 వేల కోట్ల రుణం తీసుకుని, అప్పులతో ఆర్థిక సంవత్సరానికి స్వాగతం పలికిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బుధవారం ఓ ప్రకటనలో విమర్శించారు. ‘జగన్‌ సర్కారు రూ.10 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసింది. జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు కూడా అప్పులు వెతుకుతున్న దుస్థితి నెలకొంది. ఉద్యోగులకు దాదాపు రూ.32 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా.. వారిని విస్మరించి అస్మదీయులకు చెల్లించింది. ఎన్నికల కోడ్‌ తరువాత చేసిన రూ.14,500 కోట్ల చెల్లింపులపై విచారణ జరిపించాలి’ అని డిమాండ్‌ చేశారు.


దళితుడి శిరోముండనం కేసులో వాదనలు పూర్తి

విశాఖ లీగల్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దళితుడి శిరోముండనం కేసులో తుది వాదనలు బుధవారంతో ముగిశాయి. ప్రధాన నిందితుడు వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఇతర నిందితులు విశాఖ జిల్లా ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక న్యాయస్థానంలో హాజరయ్యారు. నిందితుల తరఫున కె.వి. రామమూర్తి వాదనలు వినిపించారు. అనంతరం తీర్పు ఇవ్వడానికి గాను న్యాయమూర్తి లాలం శ్రీధర్‌ ఈ కేసును ఈ నెల 12వ తేదీకి వాయిదా వేశారు. 1996 డిసెంబరు 29న శిరోముండనం ఘటన జరగ్గా, బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు తోట త్రిమూర్తులుపై 1997 జనవరి 4న కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు పలు మలుపులు తిరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు 28ఏళ్ల తర్వాత తీర్పు వెలువడనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని