ఫోన్‌ ట్యాపింగ్‌తో నాకేం సంబంధం?

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Updated : 04 Apr 2024 06:41 IST

అడ్డగోలుగా మాట్లాడితే సీఎంనూ వదిలిపెట్టను
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌
మంత్రి కొండా సురేఖ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కేకే మహేందర్‌రెడ్డిలకు లీగల్‌ నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ‘‘ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా ఎవరో హీరోయిన్లను బెదిరించానని ఓ మంత్రి మాట్లాడుతున్నారు. అలాంటి పనిచేయాల్సిన అవసరం నాకేంటి? ఇలాగే అడ్డగోలు ఆరోపణలు చేస్తే ముఖ్యమంత్రి సహా ఎవర్నీ వదిలిపెట్టను. న్యాయపరంగా ఎదుర్కొంటాను’’ అని పేర్కొన్నారు. ‘‘ఒకవేళ మా ప్రభుత్వ హయాంలో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగి ఉంటే.. మారింది ప్రభుత్వమే తప్ప అధికారులు కాదు. ఆనాడు కీలక పోస్టుల్లో ఉన్న ఐపీఎస్‌ అధికారులు శివధర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, రవి గుప్తా ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనూ కీలక పోస్టుల్లో ఉన్నారు. అప్పుడు ట్యాపింగ్‌ జరిగితే వారికి తెలియకుండా ఉంటుందా? ఈ అధికారులు ఎవరూ బాధ్యులు కారా? చిత్తశుద్ధి ఉంటే 2004 నుంచి ఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణ   జరిపించండి’’ అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ‘‘గతంలో నా ఫోన్‌ కూడా సర్వేలెన్స్‌లో ఉందని.. అప్పట్లోనే ప్రజలతో పంచుకున్నాను. ఎవరి ఫోన్లు ట్రాప్‌ అయ్యాయి.. ఎవరు చేశారనేది ప్రభుత్వం తేల్చాలి. ఫోన్‌ ట్యాపింగ్‌పై కాదు.. తాగు, సాగునీటిపై దృష్టి పెట్టండి’’ అని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్‌లో భారాస ఎమ్మెల్యేలు గోపీనాథ్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, వివేకానంద, పార్టీ నాయకుడు కార్తీక్‌రెడ్డితో కలిసి కేటీఆర్‌ బుధవారం మీడియాతో మాట్లాడారు.

ప్రాజెక్టుల్లో నీళ్లున్నా నిర్వహించే తెలివి లేదు

‘‘కాంగ్రెస్‌ హయాంలో మళ్లీ తాగునీటి తండ్లాట మొదలైంది. మహిళలు రోడ్లపై ఖాళీ బిందెలతో తల్లడిల్లుతోంటే.. రేవంత్‌రెడ్డి లంకెబిందెల గురించి మాట్లాడుతున్నారు. దిల్లీకి ధనరాశులను తరలిస్తున్న రేవంత్‌రెడ్డికి జలరాశులు తరలించే ఓపిక లేదు. గతంలో మేము ప్రజల అవసరాలు ఎలా తీర్చాలని ఆలోచిస్తే.. రేవంత్‌ ప్రభుత్వం మాత్రం చేరికలపై దృష్టి పెట్టింది. మా ప్రభుత్వ హయాంలో మంచినీటి సదుపాయం పొందడాన్ని మానవ హక్కుగా గుర్తించి.. రూ.38 వేల కోట్లతో మిషన్‌ భగీరథను చేపట్టి పూర్తి చేశాం. కనీసం దాని నిర్వహణ కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదు. గతంలో కంటే 14 శాతం అధికంగా వర్షం కురిసినా.. తాగునీటి కొరత ఎందుకు వచ్చింది? ప్రాజెక్టుల్లో నీళ్లున్నాయి. వాటిని నిర్వహించే తెలివి ప్రభుత్వానికి లేదు. కృష్ణా ప్రాజెక్టుల నుంచి రాష్ట్ర ప్రజలకు తాగునీరు తీసుకోవాలంటే దిల్లీని యాచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మా ప్రభుత్వం డిజైన్‌ చేసిన సుంకిశాల ప్రాజెక్టు 75 శాతం పూర్తయింది.

ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా పక్కనపెట్టడంతో పూర్తి కాలేదు. కేసీఆర్‌పై రాజకీయ కక్షతో.. కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చూపెట్టాలనే ప్రయత్నం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైతే.. మళ్లీ పంప్‌హౌస్‌లు ఎట్లా ప్రారంభమయ్యాయి? ఈ మూణ్నెల్లలో మేడిగడ్డకు మరమ్మతులు చేసి, పంపులు ఆన్‌ చేసి ఉంటే.. ఒక్క ఎకరం పంట కూడా ఎండకపోయేది. రైతుల ఆత్మహత్యల వివరాలను రేవంత్‌రెడ్డికి నేరుగా పంపిస్తాం. వెంటనే రైతు రుణమాఫీ చేయాలి. ఓ పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి.. పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరితే వారి సభ్యత్వం రద్దు చేయాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పింది. కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లపై వేటు వేయాలని ఇప్పటికే స్పీకర్‌కు ఫిర్యాదు ఇచ్చాం. ఆదివారం వరకు గడువు ఇచ్చాం. ఆలోపు నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం’’ కేటీఆర్‌ పేర్కొన్నారు.


వారం రోజుల్లో క్షమాపణలు చెప్పకుంటే న్యాయపరమైన చర్యలు

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తనకు సంబంధం లేని విషయాల్లో తన పేరును ప్రస్తావించారని, అవాస్తవాలతో కూడిన ఆరోపణలు చేశారని పేర్కొంటూ.. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత కేకే మహేందర్‌రెడ్డిలకు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు పంపించారు. వారం రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేదంటే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారు తన పేరును పదే పదే కుట్రపూరితంగా ప్రస్తావిస్తున్నారని, తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నందున చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తన పేరును ప్రస్తావిస్తూ అసత్యాలు ప్రచారం చేసిన కొన్ని మీడియా సంస్థలకు, యూట్యూబ్‌ ఛానళ్లకు కూడా నోటీసులు పంపించినట్లు ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని