10 లక్షల మందితో తుక్కుగూడ సభ!

లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచే జాతీయ ప్రచార శంఖం పూరించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.

Published : 04 Apr 2024 03:56 IST

అక్కణ్నుంచే ఎన్నికల జాతీయ మ్యానిఫెస్టో విడుదల
ఏర్పాట్లు ముమ్మరం చేసిన కాంగ్రెస్‌

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచే జాతీయ ప్రచార శంఖం పూరించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. గత పదేళ్లుగా కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ ఈ లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇటీవల తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సమరభేరి మోగించిన తుక్కుగూడ వేదిక కలసివచ్చిందనే సెంటిమెంట్‌తో..జాతీయస్థాయిలో పార్టీ ఇచ్చే హామీలకు సంబంధించిన మేనిఫెస్టోను ఈ నెల 6న జనజాతర పేరిట అక్కడ నిర్వహించే బహిరంగ సభలో విడుదల చేయాలని అధిష్ఠానం నిర్ణయించింది.

ఏర్పాట్లపై సీఎం దిశా నిర్దేశం

సభకు అన్ని గ్రామాలు, పట్టణాల నుంచి ప్రజలు తరలిరావాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. లోటుపాట్లు జరగకుండా అందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సభకు జనాలను తరలించేలా వాహనాలు, ఇతర సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ నేపథ్యంలో దాదాపు పది లక్షల మంది జనజాతరకు హాజరవుతారని కాంగ్రెస్‌ పార్టీ అంచనా వేస్తోంది. ఎండ వేడి ఎక్కువగా ఉన్నందున సభకు హాజరయ్యే వారికి తాగునీరు, మజ్జిగతోపాటు ఇతర సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తుక్కుగూడలోని 60 ఎకరాల మైదానం పక్కనే వాహనాల పార్కింగ్‌కు సుమారు 300 ఎకరాల స్థలం అందుబాటులో ఉండగా..ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఎన్నికల ప్రచారం..నేతలకు సమన్వయ బాధ్యతలు

పార్లమెంటు ఎన్నికల ప్రచార ప్రణాళికల అమలు సమన్వయకర్తలుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో నేతను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నియమించారు. వీరి పేర్ల జాబితాను పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ బుధవారం విడుదల చేశారు. ఆదిలాబాద్‌, ఖానాపూర్‌, బాన్సువాడ, ఎల్‌.బి.నగర్‌, మహేశ్వరం, అంబర్‌పేట, గోషామహల్‌, గద్వాల, ఆలంపూర్‌, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌, ఆలేరు, డోర్నకల్‌, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాలకు ఇద్దరు చొప్పున, పినపాకకు ముగ్గురు సమన్వయకర్తలను నియమించారు. గ్రామస్థాయిలో ప్రచారాన్ని ఎప్పటికప్పుడు వీరు పర్యవేక్షించాలని నిర్దేశించారు.

సైబర్‌ నేరగాళ్ల వలపై అప్రమత్తంగా ఉండాలి

కాంగ్రెస్‌ పార్టీ తరఫున పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల నుంచి డబ్బు దోచుకునేందుకు సైబర్‌ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలు బుధవారం తెలిపాయి. ‘పార్టీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని, నామినేషన్‌ దాఖలుకు అవసరమైన బీఫారం పంపడానికి డబ్బు జమచేయాలంటూ’ సైబర్‌ నేరగాళ్ల నుంచి ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయని పేర్కొన్నాయి. ‘పలువురు అభ్యర్థులు అనుమానంతో గాంధీభవన్‌ను సంప్రదిస్తున్నారు. పార్టీ తరఫున డబ్బు కోసం ఎవరూ అలా ఫోన్లు చేయరు. అలాంటి ఫోన్‌కాల్స్‌కు స్పందించవద్దని సూచిస్తున్నాం’ అని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని