మెదక్‌ ఎంపీ స్థానం గెలవాల్సిందే

పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయానికి స్థానిక నేతలంతా ఐక్యతతో కృషిచేయాలని, మెదక్‌ ఎంపీ స్థానాన్ని గెలిచి తీరాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Updated : 04 Apr 2024 06:33 IST

నియోజకవర్గ నేతలకు సీఎం దిశానిర్దేశం
అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ప్రచార ప్రణాళికలు రచించాలని సూచన

ఈనాడు, హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయానికి స్థానిక నేతలంతా ఐక్యతతో కృషిచేయాలని, మెదక్‌ ఎంపీ స్థానాన్ని గెలిచి తీరాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ప్రచార ప్రణాళికలు రూపొందించి ప్రజల్లోకి వెళ్లాలని, పోలింగ్‌ కేంద్రం స్థాయి నుంచే ఓట్లు వేయించుకునే వ్యూహంతో ముందుకెళ్లాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల తరవాత స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని, పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి పార్లమెంటు ఎన్నికలు ఉపకరిస్తాయని వివరించారు. బుధవారం తన నివాసంలో మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గస్థాయి ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, మెదక్‌ అభ్యర్థి నీలం మధు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు నర్సారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి, ఆంజనేయులు గౌడ్‌, దుబ్బాక పార్టీ ఇన్‌ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకుగానూ ఇటీవలి ఎన్నికల్లో మెదక్‌లో మాత్రమే కాంగ్రెస్‌ నెగ్గింది. మిగిలిన ఆరుచోట్ల భారాస విజయం సాధించింది. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో పటాన్‌చెరు, సంగారెడ్డిలో భాజపాతో, సిద్దిపేట, నర్సాపూర్‌, మెదక్‌, గజ్వేల్‌, దుబ్బాక సెగ్మెంట్లలో భారాస నుంచి పోటీ ఉంటుందని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది. ఈ పరిస్థితులపై సీఎం వారితో చర్చించారు. మెదక్‌ పార్లమెంటు స్థానం భారాస అభ్యర్థి వెంకట్రాంరెడ్డిపై పలు కుంభకోణాల ఆరోపణలున్నాయని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం వారికి సూచించినట్లు తెలుస్తోంది. ‘‘అన్ని స్థాయుల్లోని నేతలు ఈ ఎన్నికల్లో కలసికట్టుగా పనిచేయాలి. ఇప్పటికే రాష్ట్రంలో ఐదు గ్యారంటీలను అమలుచేస్తున్నాం. ఈ నెల 6న తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్‌ జాతీయ మ్యానిఫెస్టోను కూడా విడుదల చేయబోతున్నాం. అందులో పార్టీ ఇచ్చే హామీలను ఇంటింటా ప్రచారం చేయాలి. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఐదుగురు నేతలతో సమన్వయ కమిటీని ఏర్పాటుచేసుకోవాలని’ సీఎం మార్గదర్శనం చేసినట్టు నేతలు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని